ఆధార్ లేని చెంచులు
ABN , Publish Date - Jul 28 , 2024 | 11:29 PM
చెంచుల ఆధార్‌కు జనన ధ్రువీకరణ అడ్డంకి గా మారింది. దీంతో అధిక శాతం చెంచులు ఆధార్ నమోదు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది.

అడ్డంకిగా జనన ధ్రువీకరణ
పింఛన్‌కు నోచుకోని దివ్యాంగులు
పాణ్యం, జూలై 28 : చెంచుల ఆధార్‌కు జనన ధ్రువీకరణ అడ్డంకి గా మారింది. దీంతో అధిక శాతం చెంచులు ఆధార్ నమోదు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 27న స్థానిక ఇందిరానగర్‌లో ఆధార్ నమోదు క్యాంపు చేశారు. అయితే దాదాపు పది మంది చెంచు వికలాంగులకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకోలేని ఈ పరిస్థితి ఏర్పడింది. గతంలో తహసీల్దారు జనన ధ్రువీకరణ పత్రాలు లేని వారిని విచారించి ధ్రువపత్రాలు మంజూరు చేశారు. వాటి ఆధారంగా ఆధార్ నమోదు చేసేవారు. ప్రస్తుతం తహసీల్దారు ఇచ్చే ధ్రువీకరణ పత్రం ఆధార్‌కు అనుసంధానం కాకపోవడంతో చెంచులు ఆధార్ కార్డు పొందలేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా వికలాంగులు పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. ఇదిలాఉంటే గతంలో ఆధార్ నమోదు చేసుకున్న చెంచుల వివరాలు కూడా ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. వీరికి మళ్లీ ఆధార్ నమోదు చేయాలంటే ఢిల్లీలోని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీఆఫ్ ఇండియా అనుమతి అవసరమని అధికారులు పేర్కొంటున్నారు. చెంచుల ఆధార్ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఎంపీడీవో భాగ్యలక్ష్మి తెలిపారు.