కర్నూలు మెడికల్ కాలేజీలో నైపుణ్య రథం
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:18 AM
ప్రాథమిక శస్త్ర చికిత్స అంశాలపై వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక బస్సు కర్నూలు మెడికల్ కాలేజీకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆన్ వీల్ (జేజీఐడబ్లూ) పేరుతో ఈ వాహనాన్ని సమకూర్చారు

నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ స్కిల్స్ తోడ్పాటు
శస్త్ర చికిత్సలు, బేసిక్ సర్జికల్స్‌పై శిక్షణ
కర్నూలుకు వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ బస్సు
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక శస్త్ర చికిత్స అంశాలపై వైద్య విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేక బస్సు కర్నూలు మెడికల్ కాలేజీకి వచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆన్ వీల్ (జేజీఐడబ్లూ) పేరుతో ఈ వాహనాన్ని సమకూర్చారు. 2018 నుంచి దక్షిణ భారతదేశంలో వివిద వైద్య కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇస్తోంది. కర్నూలు మెడికల్ కాలేజీ విద్యార్థులు, పీజీలకు వృత్తి నైపుణ్యం పెంచే రెండు రోజుల బృహత్తర కార్యక్రమానికి కర్నూలు మెడికల్ కాలేజీ నిర్వహిస్తోంది. నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్టు స్కిల్స్ స్కీమ్ ద్వారా రూ.150 కోట్లతో ఈ ల్యాబ్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. ఇందుకు జాన్సన్ అండ్ జాన్సన్ తోడ్పాటు అందిస్తోంది. ఈ ల్యాబ్ ద్వారా రెండు రోజులు మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోనున్నారు. ఈ స్కిల్ ల్యాబ్ దేశం నలుమూలల తిరుగుతూ పలు వైద్య కళాశాలల విద్యార్థులకు ఆధునిక వైద్యంపై అవగాహన శిక్షణ కల్పిస్తోంది.
ఏం నేర్చుకున్నారంటే..
శస్త్ర చికిత్స చేసేటప్పుడు సింపుల్‌గా కుట్లు వేయడంలో కంటిన్యూ, వెర్టికల్, హారిజంటాల్ విధానాలు నేర్పించనున్నారు. కొత్తగా కుట్లకు బదులు స్టాప్‌లర్ వేయడం ల్యాప్రోస్కోపిక్, ఎండోస్కోపిక్ పద్ధతిలో చికిత్సలను మానిటర్లలో శిక్షణ ఇచ్చారు. ఎండోస్కోపిక్ స్టాప్‌లర్ విధానంలో నొప్పి ఉండదు. రక్తం ఎక్కువ పోదు. రోగులు శస్త్ర చికిత్స అయిన కొద్ది గంటల్లోనే నడవగలరు.
పేద రోగులకు ఎంతోమేలు
అధునాతన శిక్షణ సదుపాయాలతో కర్నూలు మెడికల్ కాలేజీకి వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ ప్రత్యేక బస్సు ఉచితంగా వైద్య విద్యార్థులకు శిక్షణ అందించనుంది. ఈ శిక్షణ పేద రోగులకు ఎంతో మేలు కలుగుతుంది. మెడికోలు, పీజీలు సీనియర్ రెసిడెంట్‌లకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుంది. డా.కే. వెంకటేశ్వర్లు, సూపరింటెండెంట్,
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి
రెండు రోజుల శిక్షణ
ప్రత్యేక బస్సులో ప్రతి విద్యార్థికి రెండు గంటలు శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా సర్జరీ, గైనిక్, ఆర్థో, ఆప్తమాలజీ వైద్య విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ముఖ్యంగా రోగికి కుట్లు వేసే విధానం, ల్యాపోస్కోపిక్ స్టాప్‌లర్స్ నాటింగ్, హ్యాండ్ నాట్స్, బౌవెల్ స్టాప్‌లర్స్ వంటి శస్త్ర చికిత్స అనుబంధ వైద్య ప్రక్రియలపై శిక్షణ ఇవ్వనున్నారు. సుమారు 100 మంది పీజీ, సీనియర్ రెసిడెంట్లు ఈ రెండు రోజుల శిక్షణ పొందనున్నారు. - డా. హరిచరణ్, వైస్ ప్రిన్సిపాల్, కర్నూలు మెడికల్ కాలేజీ