Share News

వైసీపీకి షాక్‌..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:33 AM

ఎన్నికల వేళ ఆలూరు నియోజకవర్గంలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

వైసీపీకి షాక్‌..!

తిరిగి టీడీపీ గూటికి బొజ్జమ్మ దంపతులు

చంద్రబాబు సమక్షంలో చేరిక

వైసీపీలో బీసీ మహిళకు అవమానం

ఆలూరు/దేవనకొండ, ఏప్రిల్‌ 2: ఎన్నికల వేళ ఆలూరు నియోజకవర్గంలో అధికార వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కప్పట్రాళ్ల బొజమ్మ, ఆ పార్టీ నాయకుడు డి.రామచంద్ర నాయుడు దంపతులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లో వారికి చంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దేవనకొండ మండలంతో పాటు ఆలూరు నియోజకవర్గంలో బలమైన నాయకులుగా ఎదిగిన వారు తిరిగి సొంతగూటికి వెళ్లడంతో వైసీపీకి తీవ్ర నష్టం చేకూరనుంది. ఇదే సమయంలో బోయ సామాజిక వర్గానికి చెందిన బొజ్జమ్మ తెలుగుదేశం పార్టీలోకి రావడంతో ఆ పార్టీకి ఓటు బ్యాంక్‌ పెరిగే అవకాశం ఉంది.

వైసీపీలో అడుగడుగునా అవమానాలే..

దివంగత నేత కప్పట్రాళ్ల వెంకటప్ప నాయుడి హత్య అనంతరం ఆయన రాజకీయ వారసురాలిగా బొజ్జమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆస్పరి జడ్పీటీసీగా, ఆమె భర్త రామచంద్ర నాయుడు దేవనకొండ ఎంపీపీగా పని చేశారు. ఆ తర్వాత కోట్ల సుజాతమ్మ టీడీపీలోకి చేరడంతో, టీడీపీలో నామమాత్రంగా కొనసాగారు. వాల్మీకి బోయ సామాజిక వర్గానికి చెందిన బొజ్జమ్మను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పార్టీలోకి తీసుకు రావాలని ప్రయత్నించారు. ఈ క్రమంలో వైసీపీ రాయలసీమ రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో గత ఏడాది జూన్‌19న టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో బొజ్జమ్మకు ఆలూరు అసెంబ్లీ టికెట్‌ ఇస్తానంటూ సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆమెకు గన్‌మెన్‌లను కూడా కేటాయించారు. ఇచ్చిన మాట తప్పిన జగన్‌ ఇటీవల ఆలూరు టికెట్‌ను చిప్పగిరి జడ్పీటీసీ విరూపాక్షికి కేటాయించారు. బీసీ మహిళకు వైసీపీ చేసిన ద్రోహాన్ని జీర్ణించుకోలేకపోయారు బొజమ్మ వర్గీయులు. మరోవైపు కర్నూలు పార్లమెంట్‌ స్థానానికి అవకాశం ఇస్తారని ఆశించినా, అదే సామాజిక వర్గానికి చెందిన కర్నూలు మేయర్‌ బీవై రామయ్యకు టికెట్‌ కేటాయించింది. అప్పటి నుంచి బొజ్జమ్మ దంపతులు వైసీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. వారం రోజుల క్రితం జగన్‌ ఎమ్మిగనూరుకు వచ్చిన సందర్భంగా కూడా బొజ్జమ్మ హాజరు కాలేదు. స్వయంగా ఆలూరు సమన్వయకర్త విరుపాక్షి బొజ్జమ్మ ఇంటికి వెళ్లి నచ్చచెప్పినా, వారు ససేమీరా అన్నారు.

‘టీడీపీ విజయానికి కృషి చేస్తాం’

టీడీపీలో చేరిన అనంతరం కప్పట్రాళ్ల బొజ్జమ్మ, డి.రామచంద్ర నాయుడు విలేకరులతో మాట్లాడుతూ తిరిగి సొంత గూటికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీడీపీలో సముచిత స్థానం ఇస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. అదేవిధంగా టీడీపీ కర్నూలు పార్లమెంట్‌ అభ్యర్థి పంచలింగాల నాగరాజు, ఆలూరు టీడీపీ అభ్యర్థి వీరభద్ర గౌడ గెలుపునకు కృషి చేస్తామని తెలిపారు.

Updated Date - Apr 03 , 2024 | 12:33 AM