Share News

ఆశల అన్వేషణ..!

ABN , Publish Date - May 25 , 2024 | 11:41 PM

తొలకరి వర్షాలు పడితే చాలు ఇక్కడ వజ్రాల పంటలు పండుతాయి.

ఆశల అన్వేషణ..!

వివిధ ప్రాంతాల నుంచి జొన్నగిరికి తరలి వస్తున్న జనాలు

వజ్రాల కోసం వెతుకులాట

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆశావహులు

తొలకరి వర్షాలు పడితే చాలు ఇక్కడ వజ్రాల పంటలు పండుతాయి. అవి ఎక్కడెక్కడి నుంచో వచ్చి అన్వేషణ సాగించే వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. జిల్లాలోని తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, మద్దికెర మండలం మదనంతాపురం, వజ్రాల బసినేపల్లి, పెరవలి గ్రామాలు వజ్రాలకు ప్రసిద్ధిగాంచాయి. ఏటా తొలకరి వర్షాలకు ఇక్కడి పొలాల్లో వజ్రాలు బయపడుతుండడంతో వివిధ ప్రాంతాల నుంచి జనాలు ఇక్కడి తరలి వస్తున్నారు. ఒక్క వజ్రం దొరికినా చాలు జీవితం మారిపోతుందన్న ఆశతో అన్వేషణ సాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి వజ్రాలు దొరకడంతో సంతోషం వ్యక్తం చేస్తుండగా మరికొందరు తమ అదృష్టాన్ని పరీ క్షించుకు నేందుకు ఇక్కడి తరలి వస్తున్నారు.

పత్తికొండ, మే 25: కర్నూలు జిల్లాలో తొలకరి వర్షాలకు వజ్రాలు దొరుకుతాయన్న విషయం అన్ని ప్రాంతాలకు పాకిపోయింది. దీంతో ఎక్కడెక్కడి నుంచి జనాలు ఇక్కడికి తరలి వస్తున్నారు. వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. వర్షాలు పడితే చాలు తుగ్గలి మండలం జొన్నగిరి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, మద్దికెర మండలం మదనంతాపురం, వజ్రాల బసినేపల్లి, పెరవలి గ్రామాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రారంభమై తొలకరి వర్షాలకు పొలాల్లో వజ్రాలు బయటపడతాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు జూన్‌ నుంచి ఆగస్టు వరకు వజ్రాల కోసం ఆన్వేషణ సాగిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే కాకుండా అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, గోదావరి జిల్లాలతోపాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఇక్కడికి తరలివస్తున్నారు. పొలాల్లో తిరుగుతూ రాళ్లు రాళ్లు కదుపుతూ వజ్రాన్వేషణ సాగిస్తున్నారు. వజ్రాలు కొనుగోలు చేయడానికి కర్నూలు జిల్లా పెరవలి, జొన్నగిరి, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన వ్యాపారులు తమ ఏజెంట్లను పొలాల వద్దే ఉంచుతారు. వజ్రం బరువు, రంగు, జాతిని బట్టి క్యారెట్లలో లెక్కగట్టి డబ్బులు చెల్లిస్తారు. ఇదంతా కూడా చీకటి వ్యాపారమే. వజ్రం లభ్యమైందని తెలిసినా.. ఏ వ్యక్తికి దొరికింది.. ఏ వ్యాపారి కొనుగోలు చేశారు..? అన్నది మాత్రం బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్తపడతారు.

ఆ గ్రామాల్లోనే వజ్రాలు అధికం

కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దు గ్రామాల్లోని భూగర్భంలో వజ్ర నిక్షేపాలు ఉన్నాయని గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు కూడా నిర్ధారించారు. తుగ్గలి, మద్దికెర మండలాల పరిధిలోని జొన్నగిరి, పగిడిరాయి, తుగ్గలి, అగ్రహారం, హంప, యడవల్లి, మదనంతాపురం, వజ్రాల బసినేపల్లి, కొత్తపల్లి, మద్దికెర తదితర గ్రామాల్లో ఏటా తరుచుగా వజ్రాలు లభ్యమవుతున్నాయి. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భూ గర్భంలో కింబర్‌ లైట్‌ పైపులు ఉన్నాయని మైనింగ్‌ అధికారులు అంటున్నారు. ఈ ప్రాంతాల్లో వజ్రాలు, బంగారు నిక్షేపాల కోసం కొన్నేళ్లుగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఒక్క వజ్రం దొరికితే తమ కష్టాలన్నీ గట్టెక్కుతాయని, ఒక్క రోజులో లక్షాధికారి, కోటీశ్వరులు కావచ్చనే ఆశతో కూలీలు, రైతులు, నిరుద్యోగులు వజ్రాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు.

రైతులకు తిప్పలు

వజ్రాన్వేషణలో జనాలు భూములను గుల్ల చేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వజ్రాన్వేషణతో తాము ఇబ్బందులు పడుతున్నామని స్థానికంగా ఉన్న అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు. చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి పొలాలు తొక్కడం వల్ల నేల గట్టిగా మారుతోందని అంటున్నారు. దీంతో పంటకు అనుకూలంగా భూమిని చదును చేయడానికి అదనంగా ఖర్చు అవుతోందని ఆందోళన చెందుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో వజ్రాన్వేషణకు వచ్చే వారిపై జరిమానాలు విధిస్తున్నారు. అలాగే వారి పొలాల్లోకి రాకూడదని కాపలా ఉండటంతోపాటు తమ పొలాల్లోకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డులు కూడా పెడుతున్నారు.

కొడుకు చదువులకు ఉపయోగపడతాయని..

మాది పొదిలి. నా భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. మాకు ఒక అబ్బాయి. నేను మా ఆయన, మా మరిది పొదిలి నుంచి వజ్రాలను వెతికేందుకు ఇక్కడికి వచ్చాం. ఆటో ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకే సరిపోవడం లేదు. మా బాబును మంచి చదువులు చదివించాలన్నది నా ఆశ. వజ్రం దొరికితే ఆ డబ్బును మాబాబు చదువులకు ఉపయోగిస్తాను.

. - కోటమ్మ, పొదిలి, ప్రకాశం జిల్లా

చాలీచాలని సంపాదనకు ఆసరాఅవుతుందని

మాది తాడిపత్రి. కుటుంబం పెద్దది.. ఆదాయం చిన్నది. ఉన్నంతలో జీవనం చేస్తున్నాం. ఇక్కడ వజ్రాలు దొరుకుతాయని తెలిసి నేను, నా భార్య, మా అమ్మ ఇక్కడికి వచ్చాం. మా అదృష్టం బాగుండి వజ్రం దొరికితే మా కుటుంబ ఆర్థిక అవసరాలు తీరుతాయని, ఆశ. అందుకే ఇక్కడికి వచ్చాం.

- శ్రీరాములు, తాడిపత్రి, అనంతపురం

పది సంవత్సరాలుగా వస్తున్నా

మాది చిలకలూరిపేట. మేస్త్రీగా పని చేస్తాను. ఉన్నంతలో కుటుంబాన్ని బాగానే పోషిస్తున్నాను. వజ్రం దొరికితే మరింత బాగా కుటుంబాన్ని చూసుకోవచ్చని ఇక్కడికి వచ్చాను. పదేళ్ల నుంచి వస్తూనే ఉన్నాను. నాతోపాటు వెతికిన వారికి నా కళ్ల ముందరే వజ్రాలు దొరికాయి. నాకు మాత్రం దొరకలేదు. ఈ ఏడాదైనా దొరకదా అన్న ఆశతో వచ్చాను.

- రాంబాబు, చిలకలూరిపేట, గుంటూరు

అప్పులు తీరుస్తాను

మాది ఏలూరు. పెళ్లయి ముగ్గురు పిల్లలు పుట్టాక భర్త చనిపోయాడు, కూలీనాలీ చేసి పిల్లలనుపెంచిపెద్దచేశాను. అప్పులు చేసి పెళ్లిళ్లు చేసి పంపాను. వారి పెళ్లిళ్ల కోసం చేసిన అప్పులు తీర్చడం కష్టంగా మారింది. కూలికి వెల్తే రోజుకు రూ 300 వస్తుంది. నాకుంటుంబ అవసరాలు పోను మిగిలేది అప్పులకు కడుతున్నాను. అదృష్టం కలిసొచ్చి వజ్రం దొరికితే అప్పులు తీర్చేస్తాను. మూడేళ్లుగా వజ్రాలను వెదికేందుకు వస్తున్నాను. దొరికితే కష్టాలన్నీ తీరిపోతాయని ఆశతో ఈ ఏడాది వచ్చాను.

- వెంకటరత్నమ్మ, ఏలూరు జిల్లా

పిల్లల కష్టాలు తీరుద్దామని

పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశాను. పేదరికంతో పిల్లలను చదువుకు దూరం చేశాను. పెళ్లిళ్లు చేసుకుని వారు కూలి పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని తెలిసి వెతికేందుకు వచ్చాను. అదృష్టం కొద్ది వజ్రం దొరికితే ఆ వచ్చిన డబ్చును నా పిల్లలకు ఇచ్చి వారి పిల్లలను చదివించేందుకు వాడుకోమని చెబుతాను.

- మరియమ్మ, ఆత్మకూరు (నంద్యాల జిల్లా)

నా భర్త చేసిన అప్పులు తీరుస్తాను

మాది కావలి. ఇద్దరు పిల్లలు పుట్టాక భర్త చనిపోయాడు. కూలినాలి చేసి పిల్లలను చదివిస్తున్నాను. అయితే నా భర్త బతికున్నప్పుడు చాలా అప్పులు చేశాడు. ఆ అప్పుల వాళ్లు ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. కూలినాలి చేసి పిల్లల చదువులు, కుటుంబ ఖర్చులు పోను అంతో ఇంతో అప్పుల వాళ్లకు కడుతున్నాను. వజ్రం దొరికితే నా భర్త చేసిన అప్పులు పూర్తిగా చెల్లించి పిల్లలకు మంచి చదువులు చదివిస్తాను.

- కోటేశ్వరమ్మ, కావలి, నెల్లూరు జిల్లా

Updated Date - May 25 , 2024 | 11:41 PM