Share News

దారి కష్టాలు

ABN , Publish Date - Dec 22 , 2024 | 11:48 PM

ఆలూరు పట్టణం మీదుగా చేపట్టిన జాతీయ రహదారి 167 పనులు ఆగిపోయాయి. దీంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి.

దారి కష్టాలు
కంకర తేలిన జాతీయ రహదారి

నిలిచిన ఎస్‌హెచ్‌ 167 పనులు

ప్రమాదాల బారిన వాహనదారులు

ఆలూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆలూరు పట్టణం మీదుగా చేపట్టిన జాతీయ రహదారి 167 పనులు ఆగిపోయాయి. దీంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటు న్నాయి. ఈ రహదారి పనులను 2017లో ప్రారంభించారు. 50కిమీ పరిధిలోని హాలహర్వి మండలం చింతకుంట నుంచి ఆలూరు మీదుగా బళ్లారికి వెళుతుండగా, మరోవైపు మంత్రాలయానికి వెళుతుంది. అయితే మిగతా ప్రాంతాల్లో పనులు పూర్తికాగా, ఆలూరు, హాలహర్వి మండలాల్లో మాత్రం పెండింగ్‌ పడ్డాయి. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నాయి. ఈ రోడ్డుపై నిత్యం 500పైగా భారీ వాహనాలు వెళుతుంటాయి. టోల్‌ గేట్‌ నిర్మాణం వద్ద పనులు ఆగిపోయి, పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఏడాది క్రితం ఓ విద్యుత్‌ ఉద్యోగి బైక్‌ అదుపు తప్పి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామీణ నీటి సరఫరా కార్యాలయం నుంచి కొంత దూరం వరకు రోడ్డు కంకర తేలి అధ్వానంగా మారింది. భారీ వాహనాలు వెళ్తుండడంతో దుమ్ము ధూళికి గురై వ్యాపారులు ఇబ్బందులకు గురి అవుతున్నారు.

సగం మధ్యలో వదిలేశారు

స్థానిక వాసవి కల్యాణ మండపం నుంచి కొంత దూరం వదరకు సగం రోడ్డు వేసి వదిలేశారు. అలాగే రోడ్డు ఎత్తుగా ఉండటంతో వాహనాలు అదుపు తప్పి చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే కొత్త బస్టాండు నుంచి కి.మీ మేర వేసిన దారి కూడా ఇలాగే ఉంది. రోడ్డు మధ్యలో డివైడర్ల ఏర్పాటుకు ఖాళీ స్థలం వదిలారు. అయితే డివైడర్లను ఏర్పాటు చెయ్యలేదు. దీంతో ఎప్పుడు ఏ వాహనం వస్తుందోనని చోదకులు ఆందోళన చెందుతున్నారు.

కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం

ఆలూరు పట్టణంలో అసంపూర్తిగా ఉన్న జాతీయ రహదారి పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్‌కు నోటీసులు ఇచ్చాం. ఈ విషయంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. త్వరలోనే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. - శంకర్‌ రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, నేషనల్‌ హైవే కర్నూలు

Updated Date - Dec 22 , 2024 | 11:49 PM