Share News

శ్రీశైలంలో భద్రత ఏర్పాట్లపై సమీక్ష

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:19 AM

శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లు, పోలీస్‌ భద్రతా చర్యలను ఆదివారం ఏఎస్పీ కె. ప్రవీణ్‌కుమార్‌ సమీక్షించారు.

శ్రీశైలంలో భద్రత ఏర్పాట్లపై సమీక్ష

శ్రీశైలం, ఏప్రిల్‌ 7: శ్రీశైలంలో జరుగుతున్న ఉగాది మహోత్సవాల ఏర్పాట్లు, పోలీస్‌ భద్రతా చర్యలను ఆదివారం ఏఎస్పీ కె. ప్రవీణ్‌కుమార్‌ సమీక్షించారు. ఇందులో భాగంగా ఏఎస్పీ శ్రీశైల క్షేత్ర పరిధిలోని రథ వీధిని, అగ్నిగుండ ప్రవేశ ప్రాంగణం, పార్కింగ్‌ తదితర ప్రదేశాలలో పర్యటించి భద్రత, ట్రాఫిక్‌ నిర్వహణపై పోలీస్‌ సిబ్బందికి తగు సూచనలు చేశారు. క్షేత్ర పర్యటనకు ముందుగా భ్రమరాంబ అతిథి గృహం నందు ఉగాది మహోత్సవాల ఏర్పాట్ల సమీక్షలో ఏఎస్పీ కె. ప్రవీణకుమార్‌, ఆలయ కార్యనిర్వహణాధికారి డి. పెద్దిరాజు, ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు, దేవస్థానం ఇంజనీరింగ్‌ అధకారులు, ఆలయ భద్రతా విభాగం అధికారులు, స్థానిక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ప్రభోత్సవం, రథోత్సవం జరిగే సమయంలో ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సోమవారం రాత్రి శివదీక్షా శిబిరాలలో జరిగే అగ్నిగుండ ప్రవేశం, వీరచార విన్యాసాల కార్యక్రమాలకు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారన్నారు. అలాగే వైద్యసేవలు, అగ్రిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచుకోవాలని, భక్తులు అగ్ని గుండంలోనికి ప్రవేశించకుండా చుట్టూ పటిష్టమైన కంచె ఏర్పాటు చేయాలన్నారు. అగ్ని గుండ ప్రవేశం, వీరచార విన్యాసాల కార్యక్రమాలను భక్తులందరూ వీక్షించే విధంగా గంతంలో వలె ఎల్‌ఈడీ స్ర్కీన్లలో ప్రసారం చేయాలన్నారు. ఉత్సవాలు పూర్తి అయ్యేవరకు కమాండ్‌ కంట్రోల్‌ రూము నందు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అదేశించారు.

Updated Date - Apr 08 , 2024 | 12:19 AM