Share News

ఎర్రకోట శాసనం..!

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:54 PM

ఎర్రకోట శాసనం..!

ఎర్రకోట శాసనం..!

బుట్టా రేణుకకు స్వేచ్ఛ కరువు

ఎమ్మెల్యే చెప్పినట్టే వినాలంటే ఎలా?

టికెట్‌ మార్పుపై ఊహాగానాలు

కర్నూలు, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు నియోజకవర్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి తీరుపై ఆ పార్టీ నేతల్లో గందరగోళం నెలకొంది. ఇటీవల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా చేనేత సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బుట్టా రేణుక బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచి ఆమె ఎమ్మెల్యేను కాదని నియోజకవర్గంలో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి నుంచి ఆమెకు ఆశించిన స్థాయిలో సహకారం అందడం లేదు. బీసీ మహిళ, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా ఉన్నప్పటికీ ఆమె స్వతంత్రంగా ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితి నెలకొందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరినైనా కలవాలంటే ఎమ్మెల్యే ఏమనుకుంటారో.. ఏ విషయమైనా స్థానిక నాయకులతో చర్చిస్తే పెద్దాయనతో మాట్లాడారా.. అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎందుకొచ్చాను.. అన్న మానసిక సంఘర్షణలో బుట్టా రేణుకలో ఉన్నట్లు వైసీపీలోని ఓ వర్గం నాయకుల ద్వారా సమాచారం. ఈ క్రమంలో తనకు అవకాశం ఉంటే కర్నూలు ఎంపీ టికెట్‌ ఇవ్వాలని బుట్టా రేణుక అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి గుమ్మనూరు జయరాంను సీఎం జగన్‌ ప్రకటించారు. ఆలూరు నియోజకవర్గం టికెట్‌ వైరి వర్గానికి చెందిన చిప్పగిరి జడ్పీటీసీ సభ్యుడు బి.విరుపాక్షికి ఇవ్వడంతో జయరాం వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలో గుమ్మనూరు జయరాం ఎంపీగా పోటీ చేసేందుకు ఒప్పుకోలేదు. ఇక ఆయన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. జయరాం స్థానంలో కర్నూలు ఎంపీగా బీవై రామయ్యను అధిష్టానం ఖరారు చేసినా ప్రకటించలేదు. ఇప్పుడు ఎమ్మిగనూరు కాని పక్షంలో కర్నూలు ఎంపీ స్థానానికి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ బుట్టా రేణుక కోరుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఐప్యాక్‌ టీం మళ్లీ సర్వే చేపడుతోంది.

ఎర్రకోట ఆజ్ఞ లేకుండా అడుగు వేయలేని పరిస్థితి..!

వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఆజ్ఞ లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేని పరిస్థితి నెలకొంది. ఎవరిని కలవాలి..? ఎవరిని కలవకూడదు..? ఏ సమావేశంలో ఏమి మాట్లాడాలి..? ఇలా అన్నింటా ఎర్రకోట జోక్యంపై బుట్టా వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2014-19లో ఎంపీగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో ఆమెకు పలువురు నాయకులు, ప్రజా సంఘాల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సొంత వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేసింది. అందుకే బుట్టా రేణుకను ఎమ్మెల్యే ఎర్రకోటకు తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. ఎమ్మెల్యేకు, తనయుడికి ఎర్రకోట జగన్‌కు సీఎం జగన్‌ టికెట్‌ నిరాకరించారు. దీంతో వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వై.రుద్రగౌడ్‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక ప్రయత్నించారు. వీరిద్దరిని కాదని తన సన్నిహితుడైన మాచాని వెంకటేశ్‌కు టికెట్‌ ఇప్పించుకున్నారు. వెంకటేశ్‌ అభ్యర్థిత్వాన్ని ఎర్రకోట అత్యంత సన్నిహితులే వ్యతిరేకించడంతో గత్యంతరం లేక బుట్టా రేణుక అభ్యర్థిత్వాన్ని అంగీకరించారు. రుద్రగౌడ్‌ ఇంటికి వెళ్లి బుట్టా రేణుక కలవడం కూడా ఎమ్మెల్యే జీర్ణించుకోలేకపోతున్నారు.

Updated Date - Mar 04 , 2024 | 11:54 PM