కలెక్టర్‌గా రంజిత్ బాషా
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:09 AM
కర్నూలు జిల్లాకు కొత్త కలెక్టర్‌గా పి.రంజిత్ బాషాను నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
బాపట్ల కలెక్టర్‌గా పని చేస్తూ ఇక్కడికి బదిలీ
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా జి.సృజన
కర్నూలు, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాకు కొత్త కలెక్టర్‌గా పి.రంజిత్ బాషాను నియమిస్తూ ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ పని చేస్తున్న ప్రస్తుత కలెక్టర్ డాక్టర్ జి.సృజనను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. జిల్లా కలెక్టర్‌గా రానున్న రంజిత్ బాషా ప్రస్తుతం బాపట్ల జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు. ఈయన 2007 గ్రూప్-1 అధికారిగా ఎంపికయ్యారు. తొలుత కడప ఆర్డీవోగా, తర్వాత గుడివాడ ఆర్డీవోగా, సీసీఎల్ పీడీసీ ఎమ్మార్వోగా విధులు నిర్వహించారు. 2018 ఫిబ్రవరిలో ఐఏఎస్‌గా పదోన్నతి పొందారు. విజయవాడ నగర కమిషనర్‌గా, పంచాయితీరాజ్ రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టరుగా, కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఆనాడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేసిన నారా లోకేశ్ ఓఎస్‌డీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. గత ఏడాది ఏప్రిల్ 15న బాపట్ల జిల్లా తొలి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్‌గా సార్వత్రిక ఎన్నికల విధులు పక్కాగా నిర్వహించారనే అధికారులు అంటున్నారు. కర్నూలు జిల్లా కలెక్టర్‌గా డాక్టర్ జి.సృజన 2023 ఏప్రిల్ 7న నియమించారు. అంతకుముందు ఆమె గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ కమిషనర్‌గా పని చేశారు. జిల్లా కలెక్టర్‌గా బాద్యతలు చేపట్టాక నిక్కచ్చిగా వ్యవహరిస్తూ పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా ఎన్నికల అధికారిగా పారదర్శకంగా బాధ్యతలు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించడంలో సక్సెస్ అయ్యారనీ సృజన పలువురి నుంచి ప్రశంసలు అందుకుంది. ఇదిలా ఉండగా నూతన కలెక్టర్ రంజిత్ బాషా శనివారం రాత్రి ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. సొంత ప్రాంతంలో పోస్టింగ్ రావడంతో జన్మభూమికి సేవ చేసేభాగ్యం దక్కినట్లయిందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూ సంక్షేమ పథకాలను చేరువ చేస్తానన్నారు.