Share News

ఘనంగా రంజాన్

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:42 AM

ఆత్మకూరు పట్టణంలో గురువారం రంజాన్‌ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.

ఘనంగా రంజాన్
జూపాడుబంగ్లాలో ప్రార్థన చేస్తున్న ముస్లింలు

ఆత్మకూరు, ఏప్రిల్‌ 11: ఆత్మకూరు పట్టణంలో గురువారం రంజాన్‌ పర్వదిన వేడుకలను ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. పట్టణంలోని కొత్తపేట పెద్ద మసీదు, రహమత్‌నగర్‌లోని మక్కా మసీద్‌, రహమానియా మసీద్‌, లక్ష్మీనగర్‌లో ఖుగ్రామసీద్‌, బస్టాండ్‌ సమీపంలోని యాసీన్‌మసీద్‌, మోమిన్‌నగర్‌లోని మోమిన్‌మసీద్‌, పెద్దకబేలా సమీపంలోని ఉమరేతారెఫ్‌మసీద్‌, సంతమార్కెట్‌ సమీపంలోని ఆసర్‌మసీద్‌, నీలితోట్ల వీధిలోని మహ్మదీయమసీద్‌, అర్బన్‌కాలనీలోని అతాయిరసూల్‌ మసీద్‌, శ్రీశైలం రస్తాలో ఉన్న మదరసామసీద్‌, పెద్దబజారులోని చౌక్‌మసీద్‌ ఆయా కాలనీల్లో ఉన్న అన్ని మసీదులతో పాటు దుద్యాల రస్తాలో ఉన్న ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయా మసీదుల్లో మతపెద్దలు రంజాన్‌ సందేశాన్ని జనులకు వినిపించి అందులోని మంచి విషయాలకు వెల్లడించారు. ప్రతివ్యక్తి దానగుణం కలిగి ఉండాలని, తనకు ఉన్నదాంట్లో దానం చేయడమే గొప్పలక్ష్యంగా భగవంతుడు పేర్కొన్నారని గుర్తుచేశారు. ప్రతిఒక్కరూ మహ్మద్‌ ప్రవక్త చూసిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. అనంతరం నంద్యాల రస్తాలో ఉన్న ఖబరస్తాన్‌లోని తమ పితురుల సమాధుల వద్దకు వెళ్లి నివాళి అర్పించారు.

ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే బుడ్డా:

రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక నంద్యాల టర్నింగ్‌ వద్ద ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ముస్లింలను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బుడ్డా మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని ముస్లింలు నెలరోజుల పాటు ఉపవాసదీక్షలు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. స్నేహం, కరుణ, క్షమ, క్రమశిక్షణ, దయాగుణాలకు ప్రతీకగా నిలిచే రంజాన్‌ పర్వదినం మానవాళిని ఆదర్శంతంగా తీర్చిదిద్దబడుతోందని అన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరు సంతోషకంగా గడపాలని ఆకాంక్షించారు. ఇదిలావుంటే ముస్లిం సోదరులు పెద్దఎత్తున తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే బుడ్డాకు ఆత్మీయంగా పలుకరించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాగా బీజేపీ నియోజకవర్గం కన్వీనర్‌ మోమిన్‌ షబాన మాజీ ఎమ్మెల్యే బుడ్డాను కలిసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గం టీడీపీ సమన్వయర్త బన్నూరు రామలింగారెడ్డి, మాజీ సర్పంచ్‌ గోవిందరెడ్డి, టీడీపీ మండల, పట్టణాధ్యక్షులు శివప్రసాద్‌రెడ్డి, వేణుగోపాల్‌, టీడీపీ మైనార్టీ విభాగం నాయకులు కలీముల్లా, నాగూర్‌ఖాన్‌, నాయకులు అబ్దుల్లాపురం బాషా, ఫకృద్దీన్‌, రాజారెడ్డి, మల్లికార్జునరెడ్డి, సుబ్బయ్య తదితరులు ఉన్నారు.

వెలుగోడు: ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని ముస్తిం మత పెద్దలు సూచించారు. రంజాన్‌ పండుగను గురువారం పట్టణంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సమాజంలో నెలకొన్న అశాంతిని తొలగించి శాంతి కలిగేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. యూన్‌స్‌ తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరు: రంజాన్‌ పండుగను పురస్కరించుకొని పట్టణంలోని అలెహదీస్‌, సున్నీజమాత్‌ ఈద్గాల వద్ద గురువారం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అల్లూరు రోడ్డులోని అలెహదీస్‌ వద్ద మత గురువులు మౌలానా ఇస్మాయిల్‌, మౌలానా రఫిక్‌, కర్నూలు రోడ్డులోని సున్నీజమాత్‌ ఈద్గా వద్ద ముక్తి అబ్దుల్‌ రెహమాన్‌, మౌలానా అబ్దుల్‌ రెహమాన్‌ పండుగ విశిష్టత గురించి వివరించారు. చిన్నారులు కూడా ఈద్గా వద్దకు చేరుకొని ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్‌ పండుగ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన మాండ్ర, జయసూర్య

టీడీపీ నాయకులు మాండ్ర శివానందరెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య రంజాన్‌ పండుగ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ నాయకులు షకీల్‌ అహ్మద్‌, జాకీర్‌, ముర్తుజావళి, జమీల్‌, పలుచాని మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పాములపాడు: మండలంలో ముస్లింలు రంజాన్‌ పండుగ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పాములపాడులోని ఈద్గా వద్ద ముస్లింలు సాముహిక ప్రార్థనలు చేశారు. ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

పగిడ్యాల: మండలంలోని ఈద్గాలు, మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మౌలానాలు మహ్మద్‌ ప్రవక్త బోధనలు, సందేశాలను వినిపించారు. అనంతరం పిల్లలు, పెద్దలు ఒకరినొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఎలాంటి ఆవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముచ్చుమర్రి పోలీసు బందోబస్తు చేపట్టారు.

మిడుతూరు: మండలంలో రంజాన్‌ను ముస్లింలు ఘనంగా జరుపుకొన్నారు. ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేక పార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మత పెద్దలు మాట్లాడుతూ ప్రేమ, సోదరభావం, శాంతికి చిహ్నమే రంజాన్‌ పర్వదినమని అన్నారు.

జూపాడుబంగ్లా: జూపాడుబంగ్లా మండలంలో గురువారం రంజాన్‌ పండగ వేడుకలు ముస్లింలు ఘనంగా నిర్వహించారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక పార్థనలు చేశారు.

కొత్తపల్లి: మండలంలో రంజాన్‌ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు చేశారు. దుద్యాల, శివపురం, ముసలిమడుగు, కొత్తపల్లి, ఎదురుపాడు, నందికుంట, వీరాపురం, కొక్కెరంచ తదితర గ్రామాల్లో వేడుకలు జరుపుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మహానంది: మండలంలో గురువారం ఘనంగా రంజాన్‌ వేడుకలను ముస్లింలు నిర్వహించుకొన్నారు. గాజులపల్లి, గోపవరం, బుక్కా పురం, ఎం.తిమ్మాపురం, నందిపల్లి, తమ్మడపల్లి, మసీదుపురం, యి.బొల్లవరంలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. మానవాళికి ధార్మిక జీవనానికి దిశా నిర్దేశం చేసేది రంజాన్‌ అని ముస్లిం మత పెద్దలు తెలిపారు.

బండిఆత్మకూరు: మండలంలో ఈద్గాలు, మసీదుల్లో ముస్లింలు ప్రార్థనలు చేశారు. పేదలకు దానం చేశారు. ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

గోస్పాడు: మండలంలోని గోస్పాడు, పసురుపాడు, యాళ్ళూరు, జిల్లెల్ల, తదితర గ్రామాలలో ముస్లింలు రంజాన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం ఆయా గ్రామాల్లోని మసీదుల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఆయా మసీదుల్లోని మత గురువులు ముస్లింలందరికీ రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో అందరూ సుఖసంతోషాలతో కలిసిమెలిసి అన్నదమ్ముల్లా జీవించాలని సూచించారు. దేశంలోని అన్ని మతాలు, కులాల, జాతుల వారు పరస్పర సోదర భావంతో మెలిగి నవ భారత్‌ వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.

పాణ్యం: మండలంలో రంజాన్‌ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. పాణ్యం ఈద్గా వద్ద ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కౌలూరు పరిధిలోని సున్నీ మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సున్నీ మసీదు వద్ద వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

గడివేముల: మండలంలోని అన్ని గ్రామాల్లో గురువారం ముస్లింలు రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈద్గాల్లో ప్రార్థనలు చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. మత పెద్దలు మహమ్మద్‌ ప్రవక్త బోధనలను వినిపించారు.

Updated Date - Apr 12 , 2024 | 12:42 AM