రమణీయం రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:57 AM
మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.

మంత్రాలయం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు. రాఘవేంద్రస్వామి మఠంలో రాఘవేంద్రస్వామి సజీవ సమాధి పొందిన కార్తీక గురువారం శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాఽధిపతి సుబుధేంద్రతీర్థుల ఆధ్వర్యంలో మఠం పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాఘవేంద్రస్వామి బృందావన ప్రతిమను స్వర్ణ పల్లకిలో అధిష్టించి రమణీయంగా ఊరేగించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాలు మధ్య శ్రీమఠం ప్రాంగణం చుట్టూ ఊరేగించారు. అనంతరం ఊంజల సేవ చేశారు.
మంత్రాలయంలో పోటెత్తిన భక్తులు: రాఘవేంద్ర స్వామి దర్శనార్థం భక్తులు పోటెత్తారు. బుధవారం సాయంత్రం నుంచి భక్తుల తాకిడి పెరిగింది. రాఘవేంద్ర స్వామికి ఇష్టమైన దినం గురువారం కావటంతో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాషా్ట్రల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో మఠం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. అన్నపూర్ణ భోజనశాల, మహాముఖ ద్వారం, మధ్వమార్గ్ కారిడార్, ప్రధాన రహదారులు, రాఘవేంద్ర సర్కిల్, నదితీరం భక్తులతో కోలాహలంగా మారింది. గ్రామ దేవత మంచాలమ్మను దర్శించుకొని రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. క్యూలైనన్లు, పరిమళ ప్రసాదం వద్ద భక్తుల సందడిగా మారింది. శ్రీ మఠం ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్ వెంక టేష్ జోషి పరిమళ ప్రసాదం కొరత రానీయకండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని, భక్తులు పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థుల ఆశీస్సులు పొందారు.