Share News

అవనిపై హరివిల్లు

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:56 AM

రామపాదం సోకి రాయి రమణిగా మారిందనేది రామాయణ గాథ.

అవనిపై హరివిల్లు

మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు

అట్టహాసంగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’

ముత్యాల ముగ్గుల పోటీలు

కర్నూలు, ఆదోనిలో ఉత్సాహంగా పోటీలు

రామపాదం సోకి రాయి రమణిగా మారిందనేది రామాయణ గాథ. ఇక్కడ రమణుల మునివేలి కొసలు తగిలిన ముగ్గు పొడులు మట్టిపై పడి మనోహర చిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. మహిళల సృజనాత్మకతకు అద్దం పట్టాయి. ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలతో సంక్రాంతి ముందే వచ్చిందా అనేలా సందడి నెలకొంది. మహిళలు తీర్చిదిద్దిన ముగ్గులతో రంగుల హరివిల్లు రూపుదిద్దుకుంది.

కర్నూలు(కల్చరల్‌), జనవరి 7: ఇలలోని ఇంద్రధనుస్సు నేలపై ఒదిగినట్లు... ఆకాశంలోని తారలన్నీ పుడమిపై వాలినట్లు... విభిన్న వర్ణాలు, వినూత్న రూపాలుగా మారి వేనవేల శోభిత కాంతుల్లో మెరిసిపోయాయి. ముదితల మునివేళ్ల మధ్య జారువాలిన ముగ్గుపిండి... ధవళ కాంతుల మెరుపుల్లో రంగవల్లికలై కాంతులీనాయి. చుక్కను చుక్కనూ కలుపుకుంటూ మహిళలు సృజనాత్మకంగా తీర్చిదిద్దిన ముత్యాల ముగ్గులన్నీ సప్తవర్ణ శోభిత వర్ణాలుగా చక్కగా ఒదిగిపోయాయి. వారిలోని కళాత్మక భావాలకు ముగ్గుల పోటీలు వేదికగా నిలిచాయి. ఆదివారం ‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్‌ నిర్వహించిన కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగుళూరు.. రియల్‌ పార్ట్‌నర్‌ స్వర్గసీమ సుకేతన, హైదరాబాదు’తో పాటు స్థానిక స్పాన్సర్‌ టీజీవీ గ్రూప్‌ జూనియర్‌ చైర్మన్‌ టీజీ భరత్‌ సౌజన్యంతో, మాంటిస్సోరి విద్యాసంస్థల సహకారంతో, ఎ.క్యాంపు మాంటిస్సోరి పాఠశాల క్రీడామైదానంలో ఏర్పాటు చేశారు. ఈ ముగ్గుల పోటీలకు అనూహ్య స్పందన లభించింది. ఉదయం 9 గంటలకే మహిళలు ఉత్సాహంగా చేరుకున్నారు. నిర్ణీత సమయానికి పోటీల్లో పోటాపోటీగా పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పరిధిలో కర్నూలులో నిర్వహించిన ఈ ముగ్గుల పోటీలకు 225 మంది, ఆదోనిలో నిర్వహించిన పోటీలకు 60 మంది మహిళలు హాజరయ్యారు. పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించిన విజేతలకు కర్నూలులో టీజీవీ గ్రూప్‌ అఫ్‌ కంపెనీస్‌ జూనియర్‌ ఛైర్మన్‌ టీజీ భరత్‌, రూ.6వేలు, రూ.4వేలు, రూ.3వేలు నగదు బహుమతులు అందించారు. అలాగే పదిమందికి కన్సొలేషన్‌ బహుమతులు, పోటీల్లో పాల్గొన్నవారందరికీ పార్టిసిపేషన్‌ బహుమతిని అందజేశారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా డాక్టర్‌ దండెబోయిన పార్వతీదేవి, ఎల్‌.లోకేశ్వరరెడ్డి, శ్రీనివాసులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ ఆకుల లక్ష్మణ్‌, ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ ఇన్‌చార్జి చల్లా నవీన్‌కుమార్‌ నాయుడు, బ్యూరో ఇన్‌చార్జి గోరంట్ల కొండప్ప, సర్క్యులేషన్‌ మేనేజర్‌ సోమశేఖర్‌ రెడ్డి, ఏబీఎన్‌ స్టాఫ్‌ రిపోర్టర్‌ సుంకన్న, ఆంధ్రజ్యోతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సృజనాత్మకతను వెలికితీసేందుకు చక్కని వేదిక

మహిళల్లో అంతర్లీనంగా దాగున్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ముగ్గుల పోటీలు చక్కని వేదికగా ఉపయోగపడతాయని టీజీవీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ జూనియర్‌ ఛైర్మన్‌ టీజీ భరత్‌ అన్నారు. కర్నూలులోని ఎ.క్యాంపు మాంటిస్సోరి హైస్కూల్‌లో నిర్వహించిన ముగ్గుల పోటీల విజేతలకు బహుమతి ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రెండు గంటల పాటు మహిళలు ఎంతో శ్రమించి వేసిన ముగ్గులను ఆయన తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో టీజీ భరత్‌ మాట్లాడుతూ హిందూ సంస్కృతిలో సంక్రాంతి విశిష్టమైనదని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వేసే ముగ్గుల్లో సృజనాత్మకత దాగి ఉంటుందని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’వారు గత పదేళ్లుకు పైగా ఏటా ముగ్గులపోటీలు విజయవంతంగా నిర్వహిస్తూ మహిళలల్లో సంస్కృతి, సంప్రదాయాల పట్ల ఆసక్తి కలిగేలా కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. ముగ్గుల పోటీలు చూస్తుంటే ఇప్పుడే పండుగ ప్రారంభం అయిందన భావన కలుగుతోందని చెప్పారు.

ఆదోనిలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు

ఆదోని, జనవరి 7: ఆదోనిలో జరిగిన ముగ్గుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ‘ఆంధ్రజ్యోతి - ఏబీఎన్‌ నిర్వహించిన కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగుళూరు.. రియల్‌ పార్ట్‌నర్‌ స్వర్గసీమ సుకేతన, హైదరాబాదు’ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ఆదోనిలో ఎన్‌డీబీఎల్‌ పత్తి జిన్నింగ్‌, ప్రెస్సింగ్‌ పరిశ్రమ అధినేత బత్తిన లక్ష్మీనారాయణ, హనుమంతమ్మ స్పాన్సర్స్‌గా సహకారం అందించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి డాక్టర్‌ బత్తిన సురేంద్రబాబు, బత్తిన కుబేర్‌నాథ్‌, మిల్టన్‌ గ్రామర్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్‌ కరస్పాండెంట్‌ రమేష్‌బాబు బహుమతులను అందజేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. న్యాయ నిర్ణేతలుగా మణియం సుజాత, హెబ్బట్టం కిరణ్మయి, నీలం బండారిలు వ్యవహరించారు. ఆదోనిలో జరిగిన ముగ్గుల పోటీల్లో కె.రాధిక, పల్లవి, బి. రూప ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు దక్కించుకున్నారు. అదేవిధంగా ఈరమ్మ, రమ్య, శృతి, ప్రసన్నలక్ష్మి, జ్యోతి, అనిత, సోమేశ్వరి, నాగవేణి, లావణ్యలు కన్సొలేషన్‌ బహుమతులను అందుకున్నారు.

Updated Date - Jan 08 , 2024 | 12:56 AM