Share News

వరదలా వాన

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:33 AM

దంచికొట్టిన వానతో వాగులు వంకలు పొంగి పొర్లాయి.

వరదలా వాన

పొంగి ప్రవహించిన హంద్రీ వంక

పలు చోట్ల స్తంభించిన రాకపోకలు

నీట మునిగిన పంట పొలాలు

హంద్రీలో చిక్కుకున్న గంజహళ్లి రైతులు

సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన అధికారులు

దంచికొట్టిన వానతో వాగులు వంకలు పొంగి పొర్లాయి. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోనెగండ్ల మండలం గంజహళ్లి గ్రామానికి చెందిన 25 మంది రైతులు హంద్రీ నదిలో చిక్కుకున్నారు. అధికారులు స్పందించి తెప్ప ద్వారా వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కౌతాళం-ఉరుకుంద మధ్యలో ఉన్న వంకను దాటుకోవడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హాలహర్విలో వీధులన్నీ జలమయం కావడంతో మహిళంతా ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

పత్తికొండ/కర్నూలు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి):

పత్తికొండ డివిజన్‌లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో హంద్రీ వంక పొంగి ప్రవహించింది. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పత్తికొండ మండలం చిన్నహుల్తి ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. హంద్రీ వాగు ప్రవాహానికి చిన్నహుల్తి వద్ద ఆదోని - పత్తికొండ ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు సుమారు 6 గంటలపాటు స్తంభించాయి. దీంతో బస్సులు, ఆటోలు, మోటార్‌సైకిళ్లపై వేరే ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్తికొండలో 94.6, మద్దికెర మండలంలో 75.2, తుగ్గలి మండలంలో 56.2 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మద్దికెర మండలం బురుజుల నుంచి హోసూరు, పెద్దహుల్తి, చిన్నహుల్తి, జూటూరు సమీపంలో పంట పొలాలు నీట మునిగాయి. హంద్రీ వంక పరివాహక ప్రాంతంలో వరద నీటికి దెబ్బతిన్న పంట పొలాలను మంగళవారం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు పరిశీలించారు. ఆర్డీవో రామలక్ష్మి, తహసీల్దార్‌ వెంకటలక్ష్మిలతోపాటు వివిధ శాఖల అధికారులతో ఆయన వరద నీరు చేరిన ప్రాంతాల్లో పర్యటించారు. చిన్నహుల్తి ఎస్సీ కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు.

గోనెగండ్ల: గంజహళ్లి గ్రామం దగ్గర హంద్రీ నదిలో 25 మంది రైతులు చిక్కుకున్నారు. వేరు వేరుగా ఉదయం హంద్రీనది సమీపంలోని తమ పంట పొలాలకు వెళ్లారు. వారితోపాటు 16 ఎద్దులు, 28 గొర్రెలు ఉన్నాయి. రైతులంతా పొలం పనులు చేసుకుంటుండగా 11 గంటల సమయంలో ఒక్కసారిగా హంద్రీలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో రైతులు పరుగున కొందరు చెట్లపైకి, మరి కొందరు ఎత్తుగా ఉన్న గట్ల పైకి చేరుకున్నారు. బిక్కుబిక్కుమంటూ హాహాకారాలు చేశారు. కొందరి దగ్గర సెల్‌ఫోన్లు ఉండటంతో గ్రామస్థులకు సమాచారం చేరవేశారు. సర్పంచ్‌ రాముడు మండల అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, ఈవోఆర్‌డీ నాగేష్‌, ఆర్‌ఐ సుబ్బారెడ్డి, పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి తెప్పను తెప్పించి రైతులు చిన్న దరగయ్య, పెద్ద దరగయ్య, భీమన్న, దొరస్వామి, రామలింగమ్మ, సరస్వతి, జయమ్మ, మంగమ్మ, రాకేష్‌, పులేంద్ర, పార్వతితోపాటు 16 ఎద్దులు, 28 గొర్రెలను సురక్షింతగా గట్టుకు చేర్చారు. దీంతో గ్రామస్థులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

కౌతాళం: మండలంలో 66.4 మి.మీ. వర్షపాతం నమోదైనది. కౌతాళం-ఉరుకుంద మధ్యలో ఉన్న వంకను దాటుకోవడానికి భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్ణాటక బస్సులు అవతల ఒడ్డుకే నిలిపి వేయడంతో ప్రయాణికులు గంటల తరబడి రోడ్డుపైనే వేచి చూడాల్సి వచ్చింది. అలాగే కౌతాళం-ఆదోనికి పోవు రోడ్డులో లక్షమ్మవ్వ క్యాంపు వద్ద వంక నీరు రావడంతో బస్సులు ఇరువైపుల నిలిచిపోయాయి. ఉప్పరహల్‌ గ్రామం వద్ద ఉన్న వంక కరకట్ట ఒక వైపు కొట్టుకుపోయింది. రౌడూరు వంక పొంగి పొర్లింది.

హాలహర్వి: హాలహర్విలో భారీ వర్షం కురిసింది. వేదవతి ఉగ్రరూపం దాల్చింది. వాగుల సమీపంలో పొలాలన్నీ జలమయమయ్యాయి. మోదాహల్‌, చింతకుంట వద్ద కట్రవాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. వీధులన్నీ జలమయం కావడంతో హాలహర్వికి చెందిన మహిళంతా ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించారు.

మంత్రాలయంలో అత్యధిక వర్షపాతం

కర్నూలు(అగ్రికల్చర్‌), ఆగస్టు 20: జిల్లా వ్యాప్తంగా మంగళవారం 56.1 మిల్లీమీటర్ల మేర భారీ వర్షపాతం నమోదైంది. మంత్రాలయంలో అత్యధికంగా 189.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హాలహర్విలో 128.6, కోసిగిలో 96.2, పత్తికొండలో 94.6, క్రిష్ణగిరిలో 94.2, ఆలూరులో 98.4, మద్దికెరలో 75.2, కౌతాళంలో 66.4, ఆస్పరిలో 64.8, తుగ్గలిలో 56.2, పెద్దకడుబూరులో 55.6, చిప్పగిరిలో 52.8, ఆదోనిలో 48.2, సి.బెళగల్‌ మండలంలో 45.4, వెల్దుర్తిలో 44.4, గోనెగండ్లలో 44.2, హొళగుందలో 42.8, కోడుమూరులో 32, దేవనకొండలో 31.2, కల్లూరులో 30, గూడూరులో 62, కర్నూలు అర్బన్‌లో 17.2, నందవరంలో 14.6, కర్నూలు రూరల్‌లో 13.4 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది.

గాజులదిన్నెకు పోటెత్తిన వరద

పత్తికొండ, మద్దికెర, ఆస్పరి ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హంద్రీనది ఉప్పొంగింది. గాజులదిన్నె ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఉదయం 8 గంటల సమయంలో 20వేల క్యూసెక్కుల వరద నమోదైంది. మద్యాహ్నం 2 గంటల సమయానికి 25-30వేల క్యూసెక్కులకు చేరింది. సాయంత్రానికి 5వేల క్యూసెక్కులకు వరద తగ్గిందని ఇంజనీర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం 373.3 మీటర్ల లెవెల్‌లో 1.65 టీఎంసీ నీటి నిల్వ చేరింది. బుధవారం ఉదయానికి 2 టీఎంసీలకు పైగా వరద నమోదవుతుందని ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు.

కోసిగి: మండల పరిధిలోని దేవరబెట్ట గ్రామానికి వెళ్లే కల్వర్టు కోతకు గురవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయురాలు గ్రామానికి వెళ్లలేక వెనుదిరగాల్సి వచ్చింది. భారీ వర్షాలు వస్తే గ్రామానికి బయట ప్రపంచంతో సంబంధాలు ఉండవని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

దేవనకొండ: భారీ వర్షాలకు అలారుదిన్నె వద్ద హంద్రీకి వరద పోటెత్తింది. అలారుదినె, పొట్లపాడు, కుంకనూరు, తెర్నేకల్‌ గ్రామాల పరివాహక ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. పత్తి, వేరుశనగ, ఉల్లి, మిరప, టమోటా, కంది పంటలు దాదాపు పన్నెండు వందల ఎకరాలలో నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా. అలారుదిన్నె హంద్రీ వంతెనను తహసీల్దార్‌ జయన్న పరిశీలించి వాహనదారులకు పలు సూచనలు చేశారు.

Updated Date - Aug 21 , 2024 | 12:33 AM