ముంచిన వర్షం
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:47 PM
మండలంలో శనివారం అర్థరాత్రి వర్షం కురవడంతో పంట మునిపోయింది. మనేకుర్తి, కురుకుంద గ్రామాల్లో చేతికొచ్చే సమయంలో నీటిలో మునగడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

ఆలూరులో తడిసిన మిరప
పూత రాలిన శనగ
ఆవేదనలో ఆలూరు, పత్తికొండ రైతులు
ప్రభుత్వం ఆదుకోవాలని వినతి
ఆలూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో శనివారం అర్థరాత్రి వర్షం కురవడంతో పంట మునిపోయింది. మనేకుర్తి, కురుకుంద గ్రామాల్లో చేతికొచ్చే సమయంలో నీటిలో మునగడంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వర్షం దెబ్బకు మిరపకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన చెందుతున్నారు. అప్పులు చేసి మరీ సాగు చేశామని, పంట చేతికందే సమయంలో ఇలా అయిందని ఆవేదన చెందుతున్నారు.
రూ.10లక్షల నష్టం
బ్యాంకులో అప్పులు చేసి ఎనిమిది ఎకరాల్లో మిరప సాగు చేశాను. పంట చేతికొచ్చే సమయంలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి పంట తడిసిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలి. - హనుమంతు, మనేకుర్తి
పత్తికొండ టౌన్: పత్తికొండలో ఆదివారం కురిసిన అకాల వర్షం శనగకు నష్టం చేసింది. పంట ప్రస్తుతం పూత దశలో ఉంది. పత్తికొండలో ఆదివారం 5.6 మీ.మీల వర్షం కురిసింది. ఈ వర్షం దెబ్బకు పూత రాలిపోయే ప్రమాదముందని రైతులు ఆదోళన చెందుతున్నారు. మండలంలో రబీ సీజన్‌లో 4,600 హెక్టార్లలో శనగ సాగు చేశారు. మొక్కలు ఏపుగా పెరిగి మంచి దిగుబడి వస్తుందన్న ఆశతో ఉన్న రైతులు అకా వర్షం దెబ్బకు దిగాలు చెందుతున్నారు.
మంచి దిగుబడి వస్తుందనుకున్నా
నాకున్న మూడెకరాల్లో శనగ సాగు చేశారు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది పంట ఏపుగా పెరిగింది. దీంతో మంచి దిగుబడి వస్తుందని ఆశించాను. అయితే ఆదివారం కురిసిన అకాల వర్షంతో పూత రాలిపోయి పంట దెబ్బతింది. పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశముంది. - నర్సప్ప, రైతు పెద్దహుల్తి.
ఏవో వెంకటరాముడును వివరణ కోరగా.. శనగ రైతులు 191919 రకం ఫర్టిలైజర్‌ను పంటపై పిచికారి చేస్తే పంట దెబ్బతినకుండా దిగుబడులు పొందవచ్చని తెలిపారు.