Share News

మద్దతు ధరకు పత్తి కొనుగోలు

ABN , Publish Date - Nov 26 , 2024 | 11:52 PM

మద్దతు ధరకే పత్తి కొనుగోలు చేస్తామని ఏపీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి అన్నారు.

మద్దతు ధరకు పత్తి కొనుగోలు
పరిశ్రమల యజమానులతో సీసీఐ జనరల్‌ మేనేజర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి

డిసెంబరు 2నుంచి నిబంధనలు సడలింపు

సీసీఐ జనరల్‌ మేనేజర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి

ఆదోని అగ్రికల్చర్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : మద్దతు ధరకే పత్తి కొనుగోలు చేస్తామని ఏపీసీసీఐ జనరల్‌ మేనేజర్‌ అమర్‌నాథ్‌ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మార్కెట్‌ యార్డు పరిధిలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సెక్రటరీ రామ్మోహన్‌ రెడ్డి చాంబర్‌లో సీసీఐ లీజు తీసుకున్న పత్తి పరిశ్రమల యజమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని ఎప్పటికప్పుడు జిన్నింగ్‌ చేసి దూది బేళ్లుగా కట్టి నిల్వ ఉంచాలన్నారు. నిబంధనల ప్రకారం పత్తిని జిన్నింగ్‌ చేయాలని సూచించారు. ఇప్పటికే ఎన్‌డీబీఎల్‌ పరిశ్రమ, నాగేంద్ర, జిన్నింగ్‌ పరిశ్రమ, దారా శ్రీజిన్నింగ్‌ పరిశ్రమలో కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని మరో రెండు జిన్నింగ్‌ పరిశ్రమలు జయంత్‌ కాటన్స్‌, ఐశ్వర్య జిన్నింగ్‌ పరిశ్రమల్లో పత్తి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 17వేల క్వింటాళ్ల పత్తి రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.7,521తో కొనుగోలు చేశామన్నారు. వారం రోజులోపు రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, డిసెంబరు 2నుంచి నిబంధనలు సడలించి ప్రతి రైతు నుంచి మొత్తం పత్తిని కొనుగోలు చేస్తామన్నారు. సమావేశంలో జిన్నింగ్‌ పరిశ్రమ యజమానులు వెంకటరామ్‌ రెడ్డి, బత్తిన కుబేర్‌నాథ్‌, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 26 , 2024 | 11:52 PM