Share News

‘ప్రొ. సాయిబాబా మృతి.. రాజ్యం చేసిన హత్య’

ABN , Publish Date - Oct 20 , 2024 | 11:54 PM

ప్రొఫెసర్‌ సాయిబాబా సహజంగా మరణించలేదని, ఆయనను రాజ్యం హత్య చేసిందని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ చిలుకా చంద్రశేఖర్‌ అన్నారు.

‘ప్రొ. సాయిబాబా మృతి.. రాజ్యం చేసిన హత్య’
మాట్లాడుతున్న వేదిక రాష్ట్ర కన్వీనర్‌ చిలుకా చంద్రశేఖర్‌

కర్నూలు కల్చరల్‌, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రొఫెసర్‌ సాయిబాబా సహజంగా మరణించలేదని, ఆయనను రాజ్యం హత్య చేసిందని ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక రాష్ట్ర కన్వీనర్‌ చిలుకా చంద్రశేఖర్‌ అన్నారు. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో వేదిక ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ సాయిబాబా స్మృతిలో బహిరంగ సభ నిర్వహించారు. అంతక ముందు కలెక్టరేట్‌ నుంచి ప్రొఫెసర్‌ సాయిబాబా చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం వేదిక జిల్లా కన్వీనర్‌ అల్లాబకాష్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో చిలుకా చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల చేతుల్లో కీలుబొమ్మలుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. భారత సైన్యం సొంత ప్రజలపైనే యుద్ధం చేస్తోందని ఆరోపించారు. ఆదివాసీ ఉద్యమాలకు ప్రపంచవ్యాప్తంగా సంఘీభావం కూడగట్టినందుకే ప్రొ. సాయిబాబ మీద ప్రభుత్వం కక్షకట్టి జైలుపాయి చేసిందని అన్నారు. ఆయనకు జైల్లో వైద్యం చేయించకుండా వేధించిందని, బైటికి వచ్చాక ఆయన మరణించే పరిస్థితి ఏర్పడిందని, ఇది రాజ్యం చేసిన హత్య అని అన్నారు. ఆదివాసీల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను విడనాడాలని, కేంద్రం చేస్తున్న కగార్‌ యుద్ధాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో విప్లవ రచయితల సంఘం నాయకుడు పాణి, సీసీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, జేవీవీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ వి. బ్రహ్మారెడ్డి, రైతుకూలీ సంఘం నాయకుడు సుంకన్న, పీవోపీ నాయకుడు శ్రీనివాసరావు, మనోహర మాణిక్యం, ఎస్‌డీపీఐ నాయకుడు చాంద్‌బాషా, కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు సుబ్బరాయుడు, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్‌ భాస్కరరెడ్డి, డీటీఎఫ్‌ నాయకుడు రత్నం ఏసేపు ప్రసంగించారు.

Updated Date - Oct 20 , 2024 | 11:54 PM