Share News

పోటా పోటీ..!

ABN , Publish Date - Feb 15 , 2024 | 12:28 AM

మార్లమడి రోడ్డుకు భూమి పూజ చేయడానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బూసినేని విరుపాక్షి పోటీ పడ్డారు.

పోటా పోటీ..!

మార్లమడి రోడ్డుకు భూమి పూజ

ఒకే రహదారికి వేర్వేరుగా చేసిన మంత్రి జయరాం, విరుపాక్షి

హొళగుంద, ఫిబ్రవరి 14: మార్లమడి రోడ్డుకు భూమి పూజ చేయడానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆలూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త బూసినేని విరుపాక్షి పోటీ పడ్డారు. వీరిద్దరు బుధవారం ఒకే రోడ్డుకు వేర్వేరుగా భూమి పూజ చేయడం చర్చనీయాంశంగా మారింది. హొళగుంద మండలంలోని మార్లమడికి పంచాయతీ రాజ్‌ ప్లాన్‌ నిధుల కింద (పీఆర్‌ఆర్‌) రూ.5.34 కోట్లు మంజూరయ్యారు. సుగుణ కన్‌స్ట్రక్షన్‌ అనంతపూర్‌ నిర్మాణ సంస్థ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. ఈ పనులను ప్రారంభించేందుకు విరుపాక్షి, మంత్రి జయరాం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సిద్ధమయ్యారు. దీంతో ఉదయం 9:30 గంటలలకు విరుపాక్షి తన అనుచర వర్గంతో రోడ్డు పనులకు భూమి పూజ చేసి వెళ్లిపోయారు. 10:30 గంటలకు కార్మిక శాఖ మంత్రి జయరాం వచ్చి రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్లమడికి గ్రామానికి వెళ్లడానికి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, దీనిని దృష్టిలో ఉంచుకొని రోడ్డు నిర్మాణం పనులు వేగవంతం చేయాలని సదరు కాంట్రాక్టర్‌ రఘునాథ రెడ్డి, డీఈఈ వెంకట్‌ ప్రసాద్‌కు మంత్రి సూచించారు.

అధికారం వచ్చిందని అత్యుత్సాహం చూపిస్తున్నారు

ఒకే రోడ్డుకు ఇద్దరు నాయకులు భూమి పూజ చేయడంపై విలేకరులు ప్రశ్నించగా, మంత్రి జయరాం మాట్లాడుతూ కొందరికి ఇప్పుడు అధికారం వచ్చిందని అత్యుత్సాహం చూపిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని, తాను పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎవరికీ ఇబ్బంది పెట్టలేదని, దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని అన్నారు. జగన్మోహన్‌ రెడ్డి చేసిన అభివృద్ధి మరోసారి అధికారం తీసుకొస్తుందని తెలిపారు.

తలలు పట్టుకున్న పోలీసులు

అధికార పార్టీకి చెందిన నాయకులు కావడంతోపాటు అటు మంత్రి, ఇటు ఇన్‌చార్జి కావడంతో పాటు ఇద్దరు ఒకే కార్యక్రమంలో పాల్గొంటుండటంతో, ఇరువర్గాల వారు ఎదురై గొడవలు జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. ఇద్దరి కాన్వాయి ఎదురెదురు కాకుండా వీరుపాక్షిని సులువాయి మీదుగా ఆలూరు వెళ్లేలా సూచించారు. మంత్రి కన్వాయి ఎల్లార్తి మీదుగా హొళగుందకు రావడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆలూరు, ఆస్పరి సీఐలు వెంకటేశ్వర్లు, హనుమంతు, హొళగుంద, ఆలూరు, హాలహర్వి ఎస్సైలు పెద్దయ్యనాయుడు, ఓబులేసు, నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 12:28 AM