Share News

ఖరీఫ్‌ సాగుకు సానుకూలం

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:04 AM

జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది.

ఖరీఫ్‌ సాగుకు సానుకూలం
పంట పొల్లాల్లో నిలిచిన నీరు

జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు

సాధారణ సాగు విస్తీర్ణం 2లక్షల హెక్టార్లుగా అంచనా

కొలిమిగుండ్ల రూరల్‌, జూన్‌ 11: జిల్లాలో ప్రస్తుతం ఖరీఫ్‌ సాగుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది అనుకున్న సమయానికే రాష్ర్టాన్ని తాకడంతో గత వారం రోజు లుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలోని అనేక మండలాల్లో జూన్‌ మాసం సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు కురిశాయి. దీంతో గ్రామ పరిసరాల్లోని వాగులు, వంకలు, కుంటల్లో జలకళ సంతరించుకోగా, ఒట్టిపోయిన చెరువుల్లోకి వర్షపు నీరు జోరుగా చేరుతోంది. దీంతో అన్నదాతలు ఖరీఫ్‌ సాగుకు వడివడిగా అడుగులు వేస్తున్నారు. గత ఖరీఫ్‌, రబీ సీజన్‌లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన అన్నదాతల్లో ఈ ఖరీఫ్‌ కలిసొస్తుందన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు అశాజనకంగా కురుస్తున్న వర్షాలు, మరోవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటు జిల్లా రైతన్నల్లో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది. విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు తమకు కలిసొస్తుందని అన్నదాతలు భావిస్తున్నారు. జిల్లా ఖరీఫ్‌ సాధారణ సాగు రెండు లక్షల హెక్టార్ల వరకు వుండగా, ఈ ఏడాది పూర్తి స్థాయి విస్తీర్ణంలో పంటలు సాగుకు నోచుకొనే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి అధికార యంత్రాంగం కసరత్తును ప్రారంభించింది. ఖరీఫ్‌ సీజన్‌గా జిల్లాలో వరి, పత్తి, వేరుశనగ, కంది, జీలుగ, పెసర, జొన్న, బెండ తదితర అనేక రకాల పంటలు సాగు చేయడానికి అన్నదాతలు సిద్ధమవుతు న్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని తొలకరి సాగును ఆరంభించారు. ఈనెల 22న ఏరువాక పౌర్ణిమ అనంతరం జిల్లాలో ఖరీఫ్‌ సాగు మరింత ఊపందుకోనుంది. మరోవైపు రైతన్నలకు కలిసొచ్చే ఆరుద్ర కార్తె అదే రోజు రానుండటంతో అన్నదాతలు తమ సాగును ప్రారంభించడానికి ఆసక్తిని చూపుతున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:04 AM