Share News

ప్రహరీ నిర్మించండి మహాప్రభో

ABN , Publish Date - May 26 , 2024 | 12:18 AM

నగరంలోని ఒకటో వార్డు ఖండేరిలో పార్కు స్థలంలో నిర్మించుకున్న గుడిసెలు, ఇళ్లను నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కూల్చివేశారు.

ప్రహరీ నిర్మించండి మహాప్రభో
శిథిలాల కింద డ్రైనేజీ

ఇళ్లను కూల్చి 42 రోజులవుతున్నా పట్టని అధికారులు

ఇళ్లలోకి విష పురుగులు వస్తున్నాయని బాధితుల ఆవేదన

కర్నూలు(న్యూసిటీ), మే 25: నగరంలోని ఒకటో వార్డు ఖండేరిలో పార్కు స్థలంలో నిర్మించుకున్న గుడిసెలు, ఇళ్లను నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు కూల్చివేశారు. అయితే ఇప్పటి వరకు ఆ స్థలంలో ఎలాంటి ప్రహరీ నిర్మించకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టూ ప్రహరీ నిర్మించాలని ఈ నెల 1, 16న కార్యాలయంలో సిబ్బందికి వినతి పత్రం అందజేసినా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని ఒకటో వార్డు ఖండేరి రాఘవేంద్ర స్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఐటీఐ కళాశాల వెనుక భాగాన పార్కు స్థలం ఉంది. అందులో సుమారు 40 ఏళ్లుగా ఐదు సెంట్ల స్థలంలో పేదలు గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని జీవనం సాగిస్తున్నారు. వారంతా రోజువారీ పని చేసుకునే బతికే కూలీలు. గత నెల 13న సుమారు వంద మంది పోలీసులు, 50 మంది నగర పాలక సంస్థ అధికారులు, సిబ్బంది హుటాహుటిన వచ్చి ఇళ్లను తొలగించారు. దీంతో ఆ పేదలంతా పిల్లాపాపలతోరోడ్డున పడ్డారు.

42 రోజులు గడుస్తున్నా.. ఇళ్లను కూల్చి 42 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రహరీ నిర్మించ డంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఎవరైనా అధికారులను అడిగితే ఎన్నికల విధుల్లో ఉన్నామని చెబుతున్నారని స్థానికులు తెలుపు తున్నారు. ఎన్నికల కోడ్‌ ఉన్నప్పుడే ఇళ్లను కూల్చిన అధికారులకు ప్రహరీ నిర్మించేందుకు ఎన్నికల విధులు ఎలా అడ్డు వస్తాయని ప్రశ్నిస్తున్నారు.

ఇళ్లలోకి విష పురుగులు.. కూల్చిన స్థలం పక్కనే ఉన్న ఇళ్లలోకి విష పురుగులు వస్తున్నాయని స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ ఇళ్లలో వృద్ధులు, చిన్న పిల్లలు ఉన్నారని ఎవరికైనా ఏదైనా ప్రమాదం జరిగితే నగర పాలక సంస్థ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని అంటున్నారు. కూల్చిన ప్రాం తంలో కాలువలు పూర్తిగా మూసుకుని పోవడంతో నీరంతా తమ ఇళ్ల వద్దకు చేరుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు పట్టించుకోవడం లేదు..

ప్రహరీ నిర్మించాలని అధికా రులకు విన్నవించినా పట్టించు కోవడం లేదు. ఏదైనా చెబితే ఎన్నికల విధుల్లో బిజీలో ఉన్నా మని చెబుతున్నారు. అంతలోపల ఏదైనా జరగరాని ప్రమాదం జరి గితే ఎలా?. ఇళ్లను కూల్చి రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించు కోవడం లేదు. త్వరితగతిన సమస్యను పరిష్కరించాలి.

- ఆర్‌.మల్లికార్జునబాబు, స్థానికుడు

విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయి

ఎప్పుడో ఇళ్లను కూల్చి వేశారు. కూల్చిన రాళ్లు, ఇసుక, తదితర వాటి కింద నుంచి తేళ్లు, పాములు ఇళ్లలోకి వస్తున్నాయి. ప్రతి రోజూ భయం..భయంతో గడుపుతున్నాం. అధికా రులు సమస్యను పరిష్క రించాలి.

- శారదమ్మ, స్థానికురాలు

ఎన్నికలయ్యాక నిర్మిస్తాం

ప్రహరీ నిర్మించాలని ఉన్నతాధికా రులు ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రహరీ నిర్మించాలని అక్కడికి వెళితే బాధి తులు పరిహారం చెల్లించాలని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించారు. ఇప్పటి వరకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఎన్నికలు అయిపోగానే గోడ నిర్మిస్తాం.

- గిరిరాజు, డీఈఈ, నగర పాలక సంస్థ

Updated Date - May 26 , 2024 | 12:18 AM