Share News

30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:45 PM

: పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా కానిస్టేబుళ్ల అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ జి.బిందుమాధవ్‌ తెలిపారు.

 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు
మాట్లాడుతున్న ఎస్పీ జి.బిందుమాధవ్‌

కర్నూలు క్రైం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా కానిస్టేబుళ్ల అభ్యర్థులకు ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎస్పీ జి.బిందుమాధవ్‌ తెలిపారు. ఇందుకు స్థానిక ఏపీఎస్‌పీ రెండో బెటాలియన్‌లో అన్ని ఏర్పాట్లను పోలీసు అధికారులు పూర్తి చేసినట్లు వెల్లడించారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియంలో సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిజికల్‌ మెజర్మెంట్‌ అండ్‌ ఎఫీషియన్సి పరీక్షలను ప్రణాళికబద్ధంగా నిర్వహించాలన్నారు. పరీక్షల నిర్వహణ సిబ్బంది బాధ్యతలపై అవగా హన కల్పించారు. ఏపీఎస్‌ఎల్‌ఆర్‌బీ ఆదేశాలు, నియమ నిబంధనల మేరకు ఈ పరీక్షలు సవ్యంగా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. ఉద్యోగం సాధించాలనే ఒత్తిడిలో అభ్యర్థులు ఉంటారని, వారి పట్ల మర్యాదగా, సహనంతో వ్యవహరించాలని ఎస్పీ సూచించారు. ఈ దేహదారుఢ్య పరీక్షలకు సుమారు 10 వేల మంది అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. అభ్యర్థులకు సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ తర్వాత బయోమెట్రిక్‌, ఎత్తు, ఛాతి వంటి ఫిజికల్‌ మెజర్మెంట్‌ టెస్టులు, ఫిజికల్‌ ఎఫీషియన్సీ టెస్టులు 1600 మీటర్ల పరుగు, 100 మీటర్ల పరుగు, లాంగ్‌ జంప్‌ పరీక్షలు ఉంటాయని తెలిపారు. రిజల్ట్‌ కౌంటర్‌ వరకు అంచెలంచెలుగా సమగ్రంగా విధులు నిర్వర్తించేలా అవగాహన కల్పించారు.

అభ్యర్థులు ఆయా తేదీల్లో నిర్దేశిత సమయంలోనే చేరుకోవాలన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాఫీలు వెంట తీసుకురావాలన్నారు. ఏమైనా సందేహాలు, సమస్యలుంటే పోలీసు ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. సమావేశంలో అడిషినల్‌ ఎస్పీ అడ్మిన్‌ హుశేన్‌పీరా, ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌, జిల్లా పోలీసు కార్యాలయం సూపరింటెండెంట్లు, డీపీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:45 PM