నిష్పక్షపాతంగా విధులు నిర్వహించండి: కలెక్టర్
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:17 AM
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా, సమర్థవంతంగా, స్వేఛ్చాయుతంగా నిర్వహించేందుకు విడతలవారిగా శిక్షణ కార్యక్రమాల్లో సంపూర్ణ అవగాహన పొంది ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా విజయవంతం చేయాలని కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు అధికారులకు సూచించారు.

నంద్యాల (కల్చరల్), మార్చి 5: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా, సమర్థవంతంగా, స్వేఛ్చాయుతంగా నిర్వహించేందుకు విడతలవారిగా శిక్షణ కార్యక్రమాల్లో సంపూర్ణ అవగాహన పొంది ఎలాంటి విమర్శలకు తావివ్వకుండా విజయవంతం చేయాలని కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని వైఎస్సార్ సెంటినరీ హాల్‌లో మంగళవారం ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల మాస్టర్లు, ట్రైనర్లు, సెక్టోరియల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్‌తో పాటు జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి, డీఆర్వో పద్మజ, నంద్యాల, ఆత్మకూరు, ఆర్డీవోలు, నంద్యాల మున్సిపల్ కమిషనర్, తదితరులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచించిన నిభందనలు తప్పకుండా అమలుపరుస్తూ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచించిన 12 యాప్స్‌పై అవగాహన ఉండాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు మ్యాపింగ్ చేసి ప్రతిపాదనలు ఉంటే వెంటనే సమర్పించాలని అన్ని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నంద్యాలలో 5, డోన్‌లో 2, శ్రీశైలంలో ఒకటి, బనగానపల్లెలో ఒక పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు ప్రతిపాదనలు ఇస్తే ఎన్నికల కమిషన్‌కు నివేదిస్తామని కలెక్టర్ చెప్పారు. సమయం తక్కువ ఉందని, అన్ని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు.