Share News

ప్చ్‌... చేసిందేమీ లేదు..!

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:16 AM

‘మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చింది.

ప్చ్‌... చేసిందేమీ లేదు..!

ఐదేళ్లలో మంత్రి జయరాం చేసిన అభివృద్ధి శూన్యం

స్వలాభం ఫుల్‌.. ప్రగతి నిల్‌..!

సొదరులు, కుటుంబ సభ్యులే బాగుపడ్డారు

‘వేదవతి ప్రాజెక్టు’ వదిలేసిన అమాత్యుడు

మంత్రి గుమ్మగనూరు ప్రగతి ముద్ర

‘మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చింది. ఇక మా ఊళ్లన్నీ బాగుపడతాయ్‌. రోడ్లు, స్కూళ్లు, నీరు... అబ్బో ఇలా ఒక్కటేమిటి ఎన్ని కావాలో... ఏమేమీ కావాలో అన్నీ మా మంత్రిగారు చేసేస్తారు...’ అని ఐదేళ్ల క్రితం మంత్రి పదవి దక్కించుకున్న గుమ్మనూరు సొంత నియోజకవర్గం ఆలూరు ప్రజల అనుకున్నారు. కానీ నేడు అదే ప్రజల మాట తీరు మారింది. ‘ఐదేళ్లు మంత్రి పదవిలో ఉండి ఈయన ఒరగబెట్టింది ఏమీ లేదు..’ అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఒకరికో ఇద్దరికో మంత్రి పదవి వరిస్తుంది. అలాంటిది సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో రెండు సార్లు గుమ్మనూరు జయరాం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా చాన్స్‌ దక్కించుకున్నారు. మంత్రి పదవి దక్కించుకున్నాక జిల్లా ప్రయోజనాలు దేవుడెరుగు... రెండు సార్లు గెలిపించిన ఆలూరు నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. ఇది చేశా.. అని చెప్పుకోవడానికి మంత్రికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం నేటికీ కనపడలేదు. ఈ క్రమంలో ఆయన ముచ్చటగా మూడోసారి ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ఈదఫా ఎన్నికలను ఎదుర్కోనున్నారు. ఈ క్రమంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో.. ఆయన భవితవ్యం ఏమిటన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

కర్నూలు, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం వెనుకబడిన ఆలూరు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రజా సంక్షేమం... ప్రగతి కోసం కొంతైనా కేటాయించి ఉంటే పల్లెసీమలు ఎంతో అభివృద్ధి చెందేవి. ప్రజల ఓట్లేసి గెలిపించి మంత్రి హోదా కట్టి పెడితే స్వలాభానికే పెద్దపీఠ వేశారని, సొదరులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు కొందరు మినహా ప్రజలు బాగుపడింది లేదని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా ఆలూరు ప్రాంతం శతాబ్దాలుగా ఎదరుర్కొంటున్న కరువు.. వలసల నివారణే లక్ష్యంగా గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టును అటకెక్కించారనే ఆరోపణలు ఉన్నాయి.

చిప్పగిరి నుంచి ప్రస్థానం..

ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం జడ్పీటీసీగా రాజకీయ అరంగ్రేటం చేసిన మంత్రి గుమ్మగనూరు జయరాం టీడీపీ వీడి ప్రజారాజ్యంలో చేరి.. ఆ తరువాత వైసీపీలో చేరారు. మూడుసార్లు పోటీ చేస్తే.. బీసీలలో బలమైన వాల్మీకి సామాజికవర్గానికి చెందిన వారు.. మాకు న్యాయం చేస్తారని రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిపించారు. వాల్మీకి సామాజికవర్గం కేటగిరిలో వైసీపీ ప్రభుత్వంలో కేబినెట్‌ హోదా కలిగిన కార్మిక శాఖ మంత్రి పదవి చేపట్టారు గుమ్మనూరు జయరాం. ఈ పదవిలో ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. జయరాంకు మంత్రి పదవి రావడంతో ఆలూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది.. ముఖ్యంగా ఈ ప్రాంతం చిరకాల స్వప్నమైన జల జీవనాడి ‘వేదవతి ప్రాజెక్టు’ పూర్తి చేసేందుకు కృషి చేస్తారని ఆశించారు. మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి ఆయన, సోదరులు, కుటుంబ సభ్యులపై ఎన్నో అవినీతి ఆరోపణలు వచ్చాయి. పెద్ద ఎత్తున ఆస్తులు పోగేసుకున్నారే తప్పా అభివృద్ధి కోసం ఏ మాత్రం పాటుపడలేదని స్థానికులు అంటున్నారు. ఏ పల్లెకు వెళ్లినా.. ఎవరిని కదిపినా మంత్రి జయరాం మా ఊరికేమి చేశాడు.. ఆయన, ఆయన కుటుంబ సభ్యులు బాగుపడ్డారే తప్పా కనీసం గ్రామాలకు తాగునీటి పథకాలు కూడా తీసుకురాలేకపోయారని చర్చించుకుంటున్నారు. ఇదీ ఐదేళ్లు మంత్రిగా కొనసాగుతున్న గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో ప్రగతి ముద్ర అంటున్నారు.

వేదవతిని అటకెక్కించారు..!

తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) సీసీ లైనింగ్‌ పనులపై చూపిన శ్రద్ధ ‘వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు’ నిర్మాణంపై చూపలేదని ఆయా గ్రామాల రైతులు ఆరోపిస్తున్నారు. ఎల్లెల్సీ పనుల్లో నాణ్యతా ఎలా ఉందో అందరికి తెలుసు.. ఆ పనుల్లో పెద్దఎత్తున వాటాలు వస్తున్నాయ్‌.. వేదవతి ప్రాజెక్టు పనుల్లో రావడం లేదనే ఉద్ధేశంతోనే శ్రద్ద చూపలేని, మంత్రిగా అనుకొని ఉంటే తప్పక సీఎం జగన్‌ను ఒప్పించి నిధులు తెప్పించి ఇప్పటికే పూర్తి చేసి ఉండేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల్లో 80 వేల ఎకరాలు సాగునీరు, 196 గ్రామాలకు తాగునీరు అందించాలనే మహా సంకల్పంతో గత టీడీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం చంద్రబాబు వేదవతి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. వేదవతి నది నుంచి వృథాగా పోతున్న 8 టీఎంసీల వరద జలాలు ఎత్తిపోసి.. హాలహర్వి, మొలగవళ్లి వద్ద నిర్మించే జలాశయాల్లో నిల్వ చేసి పల్లెసీమలను సస్యశామలం చేయాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. 2019 జవనరిలో జీఓ నం.77 జారీ చేసి రూ.1,942.38 కోట్లు నిధులు ఇచ్చారు. టెండర్లు పూర్తి చేసి హైదరాబాద్‌కు చెందిన మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థకు పనులు అప్పగించి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రావడం, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వేదవతి ప్రాజెక్టు పూర్తి చేస్తానని పలు సందర్భాల్లో హామీ కూడా ఇచ్చారు. చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్ట్‌ సంస్థ రెండేళ్ల క్రితమే పనులు ఆపేసింది. మంత్రి గుమ్మనూరు నిధులు తెప్పించి పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే పేదల గొంతు తడిపే ఈ ప్రాజెక్టు అటకెక్కిందని సాగునీటి రంగ నిపుణులు, మేధావులు ఆరోపిస్తున్నారు.

వలస బాటలో ‘ఆలూరు పల్లెలు’

మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిథ్యం వహిస్తున్న ఆలూరు నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లోని ప్రజలు ఇప్పటికే వలసలకు వెళ్లారు. గుంటూరు, విజయవాడ, కర్ణాటక ప్రాంతాలకు వెళ్లి కూలి పనులు చేసుకుంటున్నారు. కనీసం వలసల నివారణలో మంత్రి గుమ్మనూరు ఎలాంటి కృషి చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Feb 27 , 2024 | 12:16 AM