Share News

ఎమ్మెల్యేల ప్రసన్నంలో అధికారులు

ABN , Publish Date - Jun 11 , 2024 | 11:47 PM

నగర పాలక సంస్థ పరిధిలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు కొత్త ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఎమ్మెల్యేల ప్రసన్నంలో అధికారులు

బదిలీల నిలుపుదలకు ప్రయత్నాలు

వైసీపీ విధేయుల్లో మొదలైన వణుకు

కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 11: నగర పాలక సంస్థ పరిధిలో పని చేస్తున్న అధికారులు, ఉద్యోగులు కొత్త ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్కడ తమ పదవికి గండం వస్తుందోనన్న భయంతో ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికారులు వైసీపీ నాయకులు, కార్యకర్తలకు తొత్తులుగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తాము చేసిందంతా ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో కొత్త ఎమ్మెల్యే ఇళ్ల వద్దకు ఉరుకులు పెడుతున్నారు. నగర పాలక సంస్థ పరిధిలో 52 వార్డులు ఉన్నాయి. ఇందులో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం 33, పాణ్యం 16, కోడుమూరు 3 వార్డులు ఉన్నాయి. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవడానికి అధికారులు, ఉద్యోగులు క్యూ కడుతున్నారు. నూతనంగా గెలిచిన ఎమ్మెల్యేలకు పుష్పగుచ్ఛాలు ఇస్తూ తమ సీటుకు ఎలాంటి ఢోకా లేకుండా చూడాలని అడుగుతున్నట్లు తెలిసింది.

బదిలీలు ఆపుకునేందుకు ప్రయత్నాలు

కార్యాలయంలో పని చేస్తున్న కొందరు ఉద్యోగుల సర్వీసు ఐదేళ్లు దాటింది. అలాంటి వారికి బదిలీ అనివార్యం. అయితే ఎలాగైనా బదిలీని ఆపుకునేందుకు ముగ్గురు ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా కొందరు అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వానికి వీర విధేయులుగా పని చేశారు. నలుగురు అధికారులు మాత్రం వైసీపీ చెప్పిన పని చేయలేక వేరే చోటికి బదిలీపై వెళ్లారు. పూర్తిగా విధేయత చూపిన అధికారులు ఇతర ప్రాంతాలకు బదిలీపై వెళ్లాలని ఆలోచిస్తుంటే.. మరి కొందరు ఎలాగైనా ఇక్కడే ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2024 | 11:47 PM