Share News

ఇళ్లు లేవు.. ఊళ్లు లేవు!

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:30 PM

ఇళ్లు లేవు.. ఊళ్లు లేవు!

ఇళ్లు లేవు.. ఊళ్లు లేవు!

పేదలను దగా చేసిన జగన్‌ ప్రభుత్వం

పలు గ్రామాల్లో పునాదులు దాటని జగనన్న కాలనీలు

జిల్లాలో మంజూరు చేసిన ఇళ్లు 40,815.. నిర్మాణాలు పూర్తైనవి 17,034

గత టీడీపీ ప్రభుత్వంలో 1.05 లక్షల ఇళ్లు మంజూరు.. 51,191 పూర్తి

ఉమ్మడి జిల్లాలో 82,872 ఇళ్లు పూర్తి

కర్నూలు, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): చిత్తశుద్ధికి తాను ప్రతిరూపమని సీఎం జగన్‌ ప్రచారం చేసుకుంటారు. నోటెంట వచ్చిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని ఊదరగొడతారు. గత ఐదేళ్ల ఆయన మాటలను, పాలనను పరిశీలిస్తే పొంతన లేదని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. మాయ మాటలు, నీట మూటలు సీఎం సొత్తని రుజువు అవుతుంది. దానికి ప్రబల ఉదాహరణ జగనన్న ఇండ్ల్లు, జగనన్న కాలనీలు. నవరత్నాల్లో భాగంగా ఇండ్ల పథకం గురించి వైసీపీ అంతూపొంతూ లేకుండా ప్రచారం చేసుకుంది. ఐదేళ్లపాటు దాన్ని భరించడం ప్రజలకు కష్టంగా ఉండేది. ఈ ఎన్నికల వేళ క్షేత్ర పరిశీలన చేస్తే ఈ అసంబద్ధత అంతా బట్టబయలవుతున్నది.

రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇంటి పట్టాలు ఇచ్చాం.. పక్కా ఇళ్లు నిర్మిస్తున్నాం..! అని సీఎం జగన్‌ సహా వైసీపీ నాయకులు పదేపదే చెప్పారు. అధికార కాలపరిమితి ముగిసిపోయింది. ఇప్పుడు వాస్తవాలను చూస్తే ఓట్లాటలో జగన్‌ మాటల గారడీ బట్టబయలవుతుంది. గూడు లేని నిరుపేదలను ఆయన ఘోరంగా వంచించారు. లక్షల మందికి అవాసం కల్పిస్తామని గ్రామాలకు దూరంగా.. నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో సెంటు స్థలం పేరిట ప్రజా ధనం లూటీ చేశారు. కొండలు.. గుట్టలు.. వంకల్లో పట్టాలిచ్చి ఇళ్లు నిర్మిస్తామంటూ దగా చేశారు. కర్నూలు జిల్లాలో ఐదేళ్లలో 40,815 మందికి పేదలకు పక్కా ఇళ్లు మంజూరు చేశారు. ఐదేళ్లలో నిర్మాణాలు పూర్తైన గృహాలు 17,034 మాత్రమే. అంటే.. మంజూరు చేసిన అరకొర ఇళ్లలో 42 శాతం కూడా పూర్తి చేయనే లేదు. అదే.. గత టీడీపీ ప్రభుత్వం వివిధ పథకాలు కింద 87,999 ఇళ్లు మంజూరు చేసి.. 51,191 ఇళ్ల్లు పూర్తి చేసి గృహ ప్రవేశాలు కల్పించారు. అదే ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1.76 లక్షల ఇళ్లు మంజూరు చేసి 82,872 ఇళ్లు పూర్తి చేశారు. పేదల పట్ల ప్రేమ ఉంటే చంద్రబాబులా పాలన చేయాలి. ఇదీ నిజమైన చిత్తశుద్ధి.

ఓట్లాటలో సామాన్యులను మాయ చేయడం జగన్‌కు తెలిసినంతగా మరే పార్టీ నాయకుడికి తెలియదనే చెప్పాలి. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు కాస్త వెనకపడ్డారనే చెప్పాలి. అదే సీఎం జగన్‌ తాను తప్ప మరే ప్రభుత్వం ఇంతలా అభివృద్ధి, సంక్షేమం అమలు చేయలేదనే మాట గారడితో బూరిడీ కొట్టించడంలో దిట్ట అని విశ్లేషకులు అంటున్నారు. ఎమ్మిగనూరు సిద్ధం సభలో నా అక్కచెల్లెమ్మలకు లక్షల ఇళ్లు కట్టించాను.. అని సీఎం జగన్‌ గొంతుచించుకు చెప్పారు. అవునా.. పేదలకు లక్షల ఇళ్లు కట్లించారా..? లెక్కలు వేస్తే ఇదంతా ఎండమావి అని ఎవరికైనా తెలుస్తుంది. జగన్‌ కట్టించ్చిన ఇళ్ల వ్యవహారం కూడా అంతే. జిల్లాలో కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరు, ఆదోని, ఆలూరు, పత్తికొండ, మంత్రాలయం, పాణ్యం నియోజకవర్గాల్లో జగన్‌ ప్రభుత్వం ‘నవరత్నాలు-పేదలు అందరికి ఇళ్లు’ పథకం కింద 389 లే-అవుట్లలో సెంటు స్థలం పేరిట అనువుగాని కొండలు, గుట్టలు, వంకల్లో స్థలాలు ఇచ్చారు. మెగా గ్రౌండింగ్‌ మేళా పేరిట అర్భాటం చేశారు. జగన్‌ తప్ప ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా పేదలకు ఒక్క ఇల్లు కూడా కట్టించలేదేమో..! అన్నంతగా ప్రచారం చేశారు. తీరా చూస్తే.. ఓట్ల కోసం ఇళ్ల పేరిట పేదలను వంచనకు గురి చేశారని స్పష్టంగా అర్థం అవుతుంది. జిల్లాలో 25 మండలాల్లో కేవలం 40,815 ఇళ్లు మంజూరు చేస్తే.. ఇప్పటి వరకు పూర్తి చేసిన ఇళ్లు 17,034 మాత్రమే. అంటే.. 42 శాతం కూడా దాటలేదు. ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేకపోవడానికి ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చే యూనిట్‌ కాస్ట్‌ (విలువ) సరిపోకపోవడమే. అప్పులు పుట్టక పేదలు ఇల్లు కట్టుకోడానికి ఆసక్తి చూపడం లేదు.

టీడీపీ ప్రభుత్వంలో 81,872 ఇళ్లు పూర్తి:

గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ గ్రామీణ హౌసింగ్‌ స్కీమ్‌, పీఎంఏవై-ఎన్టీఆర్‌ పట్టణ గృహనిర్మాణ పథకం కింద ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,16,693 పక్కా గృహాలు, కర్నూలు, నంద్యాల, ఎమ్మిగనూరు, ఆదోని, ఆళ్లగడ్డ, డోన్‌, నందికొట్కూరు, ఆత్మకూరు పట్టణాల్లో ఐదు విడతల్లో 59,403 ఏపీ టిడ్కో ఇళ్లు కలిపి 1.76 లక్షల ఇళ్లు మంజూరు చేశారు. అందులో 82,872 ఇళ్లను పూర్తి చేశారు. అందులో కర్నూలు జిల్లాలో ఒక్కటే 87,999 ఇళ్ల నిర్మాణాలు చేపట్టి 51,191 ఇళ్లను పూర్తి చేశారు. మిగిలిన ఇళ్లు మెజార్టీగా రూప్‌కాస్ట్‌ లెవన్‌ (పైకప్పు) వరకు వచ్చాయి. ఆనాడు ఎన్టీఆర్‌ బలహీనవర్గాల కాలనీల పేరిట నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో నీడ లేని పేదలకు సొంతింటి కల సాకారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. ఇందుకు గత ప్రభుత్వంలో కట్టించిన ఇళ్లే నిదర్శనం అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి పేర్కొన్నారు.

ఎవరిది చిత్తశుద్ధి..?

జగన్‌ ప్రభుత్వం 40,815 ఇళ్లు మంజూరు చేసి 17,034 ఇళ్లు మాత్రమే పూర్తి చేస్తే.. గత చంద్రబాబు ప్రభుత్వం ఒక్క కర్నూలు జిల్లాలో 25 మండలాల్లో 87,999 మంది పేదలకు పక్కా గృహాలు మంజూరు చేశారు. 2019 ఫిబ్రవరి 9 నాటికి 51,191 ఇళ్లు పూర్తి చేసి 58.17 శాతం పురోగతి సాధించారు. జగన్‌ కంటే 34,157 ఇళ్లు ఎక్కువగా నిర్మించారు.

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1.50 లక్షల ఉపాధి హామీకి రూ.30 వేలు కలిపి రూ.1.80 లక్షలు మాత్రమే ఆర్థిక సాయం చేసి.. అంతా తామే ఇచ్చినట్లు వైసీపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. గత చంద్రబాబు ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సాయం కాదని గ్రామీణ ప్రాంతాల లబ్ధిదారులకు రూ.50 వేలు, పట్టణ లబ్ధిదారులకు రూ.లక్ష రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఆర్థిక సాయం అందించింది.

జగన్‌ ప్రభుత్వంలో ఇసుక దొరకక గృహ నిర్మాణ లబ్దిదారులు అవస్థలు పడ్డారు. ట్రాక్టర్‌ రూ.3,500 నుంచి రూ.5 వేలు వరకు కొనుగోలు చేశారు. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఉచితంగా ఇసుక ఇచ్చారు.

జిల్లాలో నాటి చంద్రబాబు ప్రభుత్వంలో పేదల ఇళ్ల పురోగతి

పక్కా గృహాలు మంజూరు పూర్తైన ఇళ్లు శాతం

ఎన్టీఆర్‌

హౌసింగ్‌ స్కీమ్‌ 70,015 35,521 50.73

ఏపీ టిడ్కో ఇళ్లు 17,984 15,670 87.13

మొత్తం 87,999 51,191 58.17

జిల్లాలో నేటి జగన్‌ ప్రభుత్వంలో ఇళ్ల పురోగతి

నవరత్నాలు-

పేదలందరికీ ఇళ్లు 40,815 17,034 41.73

ఏపీ టిడ్కో -- -- --

మొత్తం 40,815 17,034 41.73

Updated Date - Apr 26 , 2024 | 11:30 PM