మాదక ద్రవ్యాలను నియంత్రించాలి : కలెక్టర్
ABN , Publish Date - Dec 31 , 2024 | 12:28 AM
మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.

కర్నూలు కలెక్టరేట్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు వీలుగా డివిజన్, మండల గ్రామ స్థాయిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామ స్థాయి కమిటీలో ఏఎన్‌ఎం, పంచాయతీ సెక్రటరీ, వీఆర్వోలను నియమించాలన్నారు. యూనివర్సిటీలు, కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్.1972ను ప్రారంభించిందని, ఈ నెంబరు గురించి అవగాహన కల్పించే విదంగా హోర్డింగులు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను సూచించారు. ఎస్పీ బిందుమాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాదక ద్రవ్యాలను పూర్తి స్థాయిలో నివారించడానికి టోల్‌ఫ్రీ నెంబర్.1972ను కేటాయించాన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, డీటీసీ శాంత కుమారి, జిల్లా వ్యవసాయ అధికారి వరలక్ష్మి, డీఈవో శ్యామ్యూల్ పాల్, డీఎంహెచ్‌వో శాంతిలత, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు పాల్గొన్నారు.