Share News

నిండా మునిగిన నందికొట్కూరు

ABN , Publish Date - Apr 24 , 2024 | 11:59 PM

‘శ్రీశైలం జలాశయం ముంపు వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు జీవో 98 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కేజీ రోడ్డులో దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తాం.

నిండా మునిగిన నందికొట్కూరు

అటకెక్కిన జగన్‌ హామీలు

ఐదేళ్లుగా అంతర్గత కుమ్ములాటలు

అభివృద్ధిని పట్టించుకోని రెండు వర్గాలు

నంద్యాల, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి)/నందికొట్కూరు:

‘శ్రీశైలం జలాశయం ముంపు వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు జీవో 98 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. కేజీ రోడ్డులో దుకాణాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లిస్తాం. మిడ్తూరు మండలానికి సాగు నీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేస్తాం. నందికొట్కూరుకు తాగు, సాగునీటి సమస్య లేకుండా చేస్తాం’ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గానికి వచ్చిన అప్పటి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల చిట్టా ఇది. ఆయన చెప్పిన మాటలకు నియోజకవర్గ ప్రజలు జిల్లాలో ఎవరికీ ఇవ్వని భారీ మెజారిటీని నందికొట్కూరు వైసీపీ అభ్యర్థికి కట్టబెట్టి ఎమ్మెల్యేను చేశారు. ఏరు దాటక బోడి మల్లన్న.. సామెత చందాన అధికారం చేపట్టిన తర్వాత సీఎం జగన్‌ నందికొట్కూరు వైపు తిరిగి చూడలేదు. నియోజకవర్గం ప్రజలను పట్టించుకోలేదు. నందికొట్కూరును నట్టేట ముంచారనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు వైసీపీ ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్‌, శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించాలన్న పట్టుదలతో నియోజకవర్గ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా తీర్చి దిద్దుతారని నమ్మి ఓట్లు వేసినందుకు వైసీపీ ప్రభుత్వం తమకు బాగా బుద్ధి చెప్పిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మేం చేయం.. ఇతరులు చేస్తే ఒప్పుకోం’ అనేది వైసీపీ తీరు. అధికారంలోనికి వచ్చిన తర్వాత వైసీపీ నందికొట్కూరు నియోజకవర్గంలో చేపట్టిన ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా లేదు. పైగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.110 కోట్లతో ప్రారంభించిన తాగునీటి పథకాన్ని గాలికి వదిలేసింది. దీంతో పట్టణంలో నీటి కొరత ఏర్పడి, ప్రజలు ట్యాంకర్లతో నీరు కొనుక్కునే పరిస్థితి దాపురించింది. ఇక యువ క్రీడాకారుల కోసం గత టీడీపీ ప్రభుత్వం నందికొట్కూరులో ఇన్‌డోర్‌ స్టేడియం పనులను చేపట్టింది. ఇది పూర్తి చేస్తే టీడీపీకి ఎక్కడ గుర్తింపు వస్తుందన్న ఉద్దేశంతో స్టేడియం పనులను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టి, కొత్త దానిని నిర్మించింది. అయితే దీని నిర్వహణను సరిగా పట్టించుకోకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక మైనారిటీల కోసం షాదీఖానా నిర్మాణం ఆరంభించి నాలుగేళ్లు దాటినా పూర్తిగా పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తున్నాయన్న ఉద్దేశంతో ఆరు నెలల క్రితం పనులను ప్రారంభించింది. అయితే ప్రభుత్వం నిధులు సరిగా కేటాయించకపోవడంతో పనులు ఆగిపోయాయి. ‘వైసీపీ ప్రభుత్వ పనితీరు ఇలా ఉంటుందా? ’ అని నియోజకవర్గ ప్రజలు ముక్కున వేలేసుకున్నారు.

అన్న చెప్పాడంతే..

వైసీపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత నందికొట్కూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని ఆ పార్టీ నాయకులు తమ గుప్పిట్లోకి తీసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ అక్రమ లే అవుట్లు వేస్తూ దండిగా జేబులు నింపుకుంటున్నారు. గతేడాది ఆఖర్లో ’కుడా’ అధికారులు నందికొట్కూరు పట్టణంలోని అక్రమంగా వెలసిన లే అవుట్లపై దాడులు నిర్వహించారు. ఒక వర్గానికి చెందిన నాయకులను టార్గెట్‌ చేస్తూ.. మరో వర్గం నాయకులు కావాలనే ఈ దాడులు చేయించారన్న ఆరోపణలున్నాయి. దాడుల వ్యవహారాన్ని ముందే పసిగట్టిన వైసీపీ కౌన్సిలర్లయిన రియల్టర్లు తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి, అధికారులు తమ వెంచర్లపై దాడులు చేయకుండా ఆపగలిగారు. ఇది ఇలా ఉంటే అక్రమ వెంచర్లు వేస్తున్న వైసీపీ నాయకులు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారన్న ఆరోపణలున్నాయి. సాధారణంగా ఎకరం పొలంలో వెంచరు వేసేందుకు వివిధ రకాల ఫీజల రూపంలో ప్రభుత్వానికి రూ.3.10 లక్షలు చెల్లించాలి. దీనికి తోడు వెంచర్లలో వివిధ అవసరాల కోసం 10 శాతం స్థలం వదలాలి. ఈ నిబంధనలు పాటించకుండా, ప్రభుత్వానికి ఫీజుల చెల్లించకుండా అధికారులను బురిడీ కొట్టిస్తుండటంతో ప్రభుత్వానికి రూ. కోట్లలో నష్టం వాటిల్లుతోంది. ఏ అధికారి అయినా వీరి అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. ‘అన్న చెప్పాడు. మేము వేసే లే అవుట్ల వైపు కన్నెత్తి చూడకండి.? ఏదైనా తేడా వస్తే, అన్నకు చెబుతా’మంటూ అధికారులను బెదిరిస్తున్నారు. వైసీపీ పై స్థాయి నాయకులను అడ్డం పెట్టుకుని ఆ పార్టీ కింది స్థాయి నాయకులు తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాన్ని మూడు పూవులు.. ఆరు కాయలుగా సాగిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వర్గ పోరు.. ప్రొటోకాల్‌ గొడవలతోనే..

కిందటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీకి దిగిన తోగూరు ఆర్థర్‌ నియోజకవర్గానికి కొత్త. అయితే ఆయనను గెలిపించే బాధ్యతను ఆ పార్టీ అప్పట్లో ముఖ్యంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అప్పగించారు. అందరూ కలిసి ఆర్థర్‌ గెలుపునకు కృషి చేశారు. అయితే ఆ తర్వాత ఆర్థర్‌, సిద్ధార్థ మధ్య విభేదాలు పొడసూపాయి. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా.. ఆ పార్టీకి చెందిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గం ప్రతిపక్షంలో ఉన్నట్లు భావించింది. అట్లాగే తమను సిద్ధార్థరెడ్డి వర్గం నామినేటెడ్‌ పోస్టులకు దూరం చేసిందన్న ఉద్దేశం ఎమ్మెల్యే వర్గంలో ఉండేది. ఇలా రెండు వర్గాలు బహిరంగంగానే విమర్శలు చేసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ పనుల కోసం ఒకరి వద్దకు వెళితే మరొకరికి కోపం వచ్చేది. ఎమ్మెల్యేనే అడగలేకపోయారా? అని ఒకరు అంటే.. సిద్ధార్థ దగ్గరికే వెళ్లలేకపోయారా? అంటూ మరో వర్గం నిష్టూరాలాడేవారనే విమర్శలు వచ్చాయి. దీంతో నియోజకవర్గ ప్రజలు తమ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో తెలియక అయోమయంలో పడిపోయారు. దీని వల్ల నియోజకవర్గం పూర్తిగా వెనుకబడిపోయింది.

మాట తప్పి.. మడమ తిప్పి

‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని 2019 ఎన్నికలకు ముందు చెప్పిన జగన్‌ నియోజకవర్గంలో ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారు. దీనికి ఉదాహరణ.. శ్రీశైలం ముంపు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వంచించిచడం. ఉద్యోగాలు వస్తాయేమనని ఎదురు చూసిన నిర్వాసితులకు నిరాశే మిగిలింది. ఇక స్థానికంగా కేజీ రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన దుకాణాదారులకు నష్టపరిహారం ఇవ్వనేలేదు. ప్రస్తుతం కేజీ రోడ్డు పరిస్థితి అరగుండు కొట్టిన చందంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. నియోజకవర్గంలోని మిడ్తూరు మండలం మాత్రం కర్నూలు పశ్చిమ కరువు ప్రాంతాన్ని తలపిస్తున్నది. ఈ మండలంలో ఒక్క ఎకరాకు కూడా సాగునీరు పారే పథకాలు లేవు. తాము అధికారంలోనికి వస్తే మిడ్తూరు మండలానికి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని జగన్‌ ప్రతిపక్ష నేత హోదాలో గొప్పలు చెప్పారు. కానీ మిడ్తూరు మండలాన్ని కరువు ప్రాంతంగానే వదిలేశారు. ఇది చాలక, టీడీపీ హయాంలో శ్రీకారం చుట్టిన ‘మిడ్తూరు ఎత్తిపోతల పథకం’ పనులను తుంగలో తొక్కేశారు. ఓట్ల కోసం పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పిన జగన్‌ ఐదేళ్లలో చేసిందేమీ లేదు. పక్కనే కృష్ణా నది గలాగలా పారుతున్నా.. నందికొట్కూరు పట్టణ ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారంటే.. వైసీపీ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అభ్యర్థి మార్పు ఆనవాయితీతో..

‘ఒక అభ్యర్థి ఒకసారే’ అనే పద్ధతిని నందికొట్కూరులో వైసీపీ సాగిస్తోందని నియోజకవర్గ ప్రజలకు బాగా అవగతమైంది. మూడు పర్యాయాలుగా ఇక్కడ ఒకసారి పోటీలో దిగిన వారు మరోసారి బరిలోనికి దిగడం లేదు. 2014లో వైసీపీ మొదటిసారి ఐజయ్యను తమ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోగా, 2019లో రెండోసారి ఐజయ్యకు మొండి చేయి చూపించి తోగూరు ఆర్థర్‌కు అవకాశం ఇచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఆర్థర్‌ను తప్పించి వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి తన సొంత జిల్లా కడపకు చెందిన ధారా సుధీర్‌ను ఎన్నికల బరిలో నిలిపారు. ఈసారి కూడా తమదే గెలుపని వైసీపీ గట్టిగా భావిస్తోంది. అయితే గత రెండు పర్యాయాలు వైసీపీ అభ్యర్థులకు ఎదురుకాని వ్యతిరేకత ప్రస్తుత అభ్యర్థి సుధీర్‌ పట్ల వ్యక్తమవుతోంది. సుధీర్‌ స్థానికుడి కాదని, ఒకవేళ గెలిపిస్తే ఎక్కడికో వెళ్లి పనులు చేయించుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయంతో స్థానిక ప్రజల్లో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే భావన తెరపైకి వచ్చింది. వైసీపీ వల్లనే నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 11:59 PM