Share News

మాతృమూర్తి స్వరూపమే జగన్మాత

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:16 AM

మాతృమూర్తి స్వరూపమే జగన్మాత అని, తనను కొలిచే భక్తులను రక్షించేందుకు విభిన్న అవతారాలు దాలుస్తుందని ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు.

మాతృమూర్తి స్వరూపమే జగన్మాత

భక్తులను ఆదుకోవడానికే విభిన్న అవతారాలు

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు

కర్నూలు(కల్చరల్‌), జనవరి 11: మాతృమూర్తి స్వరూపమే జగన్మాత అని, తనను కొలిచే భక్తులను రక్షించేందుకు విభిన్న అవతారాలు దాలుస్తుందని ప్రముఖ ప్రవచన కర్త, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. యువ ప్రజా నాయకుడు టీజీ భరత్‌ ఆధ్వర్యంలో, నగరంలోని ఎస్‌ఏపీ క్యాంపులోని టీజీ వెంకటేశ్‌ అవుట్‌ డోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన చాగంటి కోటేశ్వరరావు ప్రవచన బోధనల కార్యక్రమంలో రెండో రోజు గురువారం ఆయన ‘జగన్మాత వైభవం’ అనే అంశంపై ఆయన ప్రవచన బోధన చేశారు. సృష్టిలో సమస్త ప్రాణులకు జగన్మాత తల్లిరూపంలో కాపాడుతోందని, పరమ భాగవతాదులకు ఇబ్బందులు కలిగినప్పుడు ఆమె అనేక రూపాల్లో వచ్చి రక్షించిందని చెప్పారు. విశాలాక్షి, కామాక్షి, కనకదుర్గ ఇలా ఎన్ని పేర్లుతో అవతారాలు దాల్చినా అవన్నీ లోక రక్షణకే అని పలు ఉదాహరణల మధ్య వివరించారు. భగవంతుడు, అమ్మవారు వేరు కాదని, దేవుడు శివుడు రూపంలో ఉంటే ఆమె పార్వతిగా, విష్ణురూపంలో ఉంటే లక్ష్మిగా, బ్రహ్మ రూపంలో ఉంటే సరస్వతిగా భగవంతుని వెంటే తానై నిలుస్తుందని చెప్పారు. భగవంతుడు దాల్చే వివిధ అవతారాలతోపాటు అమ్మవారి అవతారాలు కూడా నిరూపణ అయి, అది లోకానికి మేలు చేస్తుందని అన్నారు. పురుషుడు ఎంత గొప్పవాడైనా భార్య లేనిదే పుణ్యం సంపాదించుకోలేడని, దాంపత్య జీవితంలో భార్యాభర్తలు శరీరాలు వేరే కానీ మనసులు ఒక్కటై ఉంటాయని చెప్పారు. తల్లి బిడ్డ నుంచి ఏమీ ఆశించకుండా ఎలా ప్రేమను పంచుతుందో శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు కూడా భక్తులైన తన పిల్లలను ప్రేమిస్తుందని, అమ్మవారు మాతృ మూర్తికి సమానమని చెప్పారు. జగన్మాతను ఆరాధించిన ఆదిశంకరాచార్యులు, భక్తపోతన, కాళిదాసు వంటి వారు రాసిన పద్యాలను వాటి అర్థాలను వివరించారు. అలాగే దేవీ భాగవతంలో అమ్మవారి గురించి వర్ణించిన విధానాన్ని భక్తులకు సోదాహారణల మధ్య తెలియజేశారు.

చాగంటి వారు అనుమతిస్తే కర్నూలులో ఆశ్రమం కట్టిస్తాం

ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచన కార్యక్రమం ప్రారంభానికి ముందు యువ నాయకుడు టీజీ భరత్‌ మాట్లాడారు. చాగంటి కోటేశ్వరరావు అనుమతిస్తే ఆయనకు కర్నూలులో ఆశ్రమం కట్టిస్తామని అన్నారు. ఏడాదిలో ఒక నెలరోజులు కర్నూలులో ఉంటూ ధార్మిక ప్రవచన బోధనలు చేయాలని విన్నవించారు. ప్రవచన బోధన అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను టీజీ భరత్‌ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

- టీజీ భరత్‌

Updated Date - Jan 12 , 2024 | 12:16 AM