Share News

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా ఓటమి ఖాయం

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:01 AM

రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఓడిపోవడం ఖాయమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా ఓటమి ఖాయం
బుడ్డా సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు

ఆత్మకూరు, ఏప్రిల్‌ 7: రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఓడిపోవడం ఖాయమని శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బుడ్డా సమక్షంలో సుమారు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ శ్రీశైల నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా టీడీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నారన్నారు. ఇంకా అనేక గ్రామాల్లో మరెన్నో చేరికలు ఉన్నాయని తెలిపారు. దీన్ని చూసి ఎమ్మెల్యే శిల్పాకు ఓటమిఇ భయం పట్టుకుందని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన ఎమ్మెల్యే శిల్పా ఐదేళ్లలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఏమి చేశారని ప్రశ్నించారు. ప్రత్యేకించి సిద్దాపురం ఎత్తిపోతల పథకాన్ని గాలికి వదిలేశారని, అందుకే ఆత్మకూరు మండలంలో నేడు తాగు,సాగునీటి కోసం ప్రజలు ఇక్కట్లు పడాల్సిన దుస్థితి దాపరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం గ్రామాల్లో వర్గపోరును ప్రోత్సహించి జనాల మధ్య చిచ్చులు పెట్టారని ఆరోపించారు. ఇవన్నీ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతున్నాయని, అందుకే వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ఇంటికి పంపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇకపోతే ఎమ్మెల్యే శిల్పాపై ప్రజాభిమానం లేకపోవడంతో కేవలం డబ్బు సంచులతో రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. శిల్పా లాంటి పొలిటికల్‌ వ్యాపారులకు ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. అదేవిధంగా ఎక్కడి నుంచో వలసొచ్చిన ఎమ్మెల్యే శిల్పాకు ఇక్కడి ప్రజల కష్టాలేవి తెలియని, తాను పక్కనే ఉన్న వేల్పనూరు బిడ్డనని, ఏకష్టం వచ్చినా ఇక్కడి ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బుడ్డాను టీడీపీ శ్రేణులు భారీ గజమాలతో సత్కరించారు. పార్టీలోకి చేరిన వారిలో నరేంద్ర, వెంకటేశ్వరరెడ్డి, రోశయ్య, వెంకటేశ్వర్లు, శ్రీరామ్‌నాయక్‌ తదితరులు ఉన్నారు. ఆ పార్టీ నాయకులు రమేష్‌, రాముడు, జనసేన పార్టీ శ్రీరాములు తదితరులు ఉన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:01 AM