Share News

జ్ఞాపకాలు.. అనుభవాలు

ABN , Publish Date - Dec 31 , 2024 | 12:34 AM

కాలగమనంలో ఓ వసంతం కరిగిపోతోంది. ఎన్నో తీపి, మధుర జ్ఞాపకాలను 2024 సంవత్సరంలో వదిలిపోతోంది.

జ్ఞాపకాలు.. అనుభవాలు

మిగిల్చిన చేదు అనుభవాలు..

2024కు వీడ్కోలు పలుకుతూ..

కొంగొత్త ఆశలతో 2025 నవ వసంతంలోకి అడుగులు వేస్తూ...

కర్నూలు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కాలగమనంలో ఓ వసంతం కరిగిపోతోంది. ఎన్నో తీపి, మధుర జ్ఞాపకాలను 2024 సంవత్సరంలో వదిలిపోతోంది. ఐదేళ్ల వైసీపీ పాలనకు అంతం పలికి... కూటమి ప్రభుత్వానికి స్వాగతం పలికిన ఏడాదికి ఈరోజే ఆఖరు. గడిచిన 12 నెలల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నో సంఘటనలు మరెన్నో మధురానుభూతుల... ఇంకెన్నో సంగతులు, కీలక ఘట్టాలు. నిన్నటి ఘనతలు స్మరించుకూంటూ గతించే ఏడాదికి వీడ్కోలు పలుకుతూ.. కోటికాంతులతో వికసించే 2025 సంవత్సరం ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఆహ్వానం పలుకుతున్న వేళ.. 2024 మిగిల్చిన కీల సంఘటనల, అనుభవాల సమాహారమే ఈ అక్షర రూకపం.

కదం తొక్కిన అంగన్‌వాడీలు

్చజనవరి 3: గౌరవ వేతనం రూ.26 వేలు, పదవి విరణమ తరువాత రూ.10 లక్షలు ఇవ్వాలనే డిమాండ్లతో అంగన్‌వాడీలు కార్య కర్తలు కదం తొక్కారు. కర్నూలు, నంద్యాల కలెక్టరేట్‌ను ముట్టడించారు. అంతకు ముందు 22 రోజులు రిలే దీక్షలు చేశారు.

దేవరగట్టు కర్రల సమరం

అక్టోబరు 13: దేవరగట్టులో దసరా విజయ దశమి ఉత్సవాల్లో భాగంగా బన్ని జైత్రయాత్ర మహోత్సవం (కర్రల సమరం) నిర్వహించారు. ఈ ఉత్సవంలో 79 మంది గాయపడ్డారు. కర్రల సమరం చూసేందుకు వచ్చిన ముగ్గురు కర్ణాటక యువకులు రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు.

తూర్పున చంద్రబాబు.. పశ్చిమాన భువనేశ్వరి

జనవరి 8: ఆళ్లగడ్డలో రా కదలిరా..! సభలో అధినేత చంద్రబాబు, కోడుమూరులో నిజం గెలవాలి..! అంటూ నారా భువనేశ్వరి దంపతులిద్దరు ఒకే రోజు ఉమ్మడి కర్నూలులో పర్యటించారు. 28న పత్తికొండ రా కదలిరా..! సభలో చంద్రబాబు పాల్గొన్నారు.. తెలుగు తమ్ముళ్లలో జోష్‌ నింపారు.

జగన్‌పై చెల్లి షర్మిల నిప్పులు

జనవరి 29: రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా కర్నూలులో పర్యటించిన వైఎస్‌ షర్మిల అన్న జగన్‌ పాలనపై నిప్పులు చెరిగారు.

జూలై 7: నందికొట్కూరు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 8 ఏళ్ల చిన్నారి అదృశ్యం అయ్యింది. అత్యాచారం చేసి హత్య చేశారని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఓ నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

మే 11: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదోని పట్టణంలో పర్యటించారు.

మే 11 : నంద్యాలో రాజ్‌ థియేటర్‌ సర్కిల్‌లో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జగనన్న భూ హక్కు చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు.

జూన్‌ 4: ఓటరన్న తీర్పు వెలువడిన రోజు. ఉమ్మడి జిల్లాలో కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ స్థానాలు సహా 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ విజయకేతం ఎగుర వేసింది. 1985 తరువాత 40 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది. రెండు స్థానాలతో వైసీపీ సరిపుచ్చుకుంది.

జూన్‌ 12: రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో పాటుగా ఉమ్మడి జిల్లా నుంచి నంద్యాల, బనగానపల్లె, కర్నూలు ఎమ్మెల్యేలు ఎన్‌ఎండీ ఫరూక్‌, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌లు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

ఓటర్ల తీర్పు

మే 13: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఇచ్చిన రోజు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో 76.45 శాతం ఓటర్లు ఓట్లు వేశారు.

పారిశ్రామిక శోభ

జూలై 23: ఓర్వకల్లు ఇండస్ర్టియల్‌ నోడ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌-2024-25 ప్రసంగంలో తీపి కబురు చెప్పారు. ఫేజ్‌-1 కింద 2,612 ఎకరాల్లో రూ.2,786 కోట్లతో అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఇక్కడికి జపనీస్‌ సంస్థ సెమికండక్టర్‌ పరిశ్రమతో పాటు డ్రోన్‌ తయారీ పరిశ్రమలు రాబోతున్నాయి.

కృష్ణమ్మకు జలహారతి

జూలై 31: సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించారు. కృష్ణమ్మకు జలహా రతి ఇచ్చారు. రికార్డు స్థాయిలో 1,573 టీఎంసీల వరద శ్రీశైలం డ్యాంకు చేరింది. తరువాత మరమ్మతులకు ఫేజ్‌-1 కింద రూ.102.58 కోట్లు మంజూరు చేశారు.

అక్టోబరు 17: కప్పట్రాళ్ల రిజర్వు ఫారెస్ట్‌లో యురేనియం అంచనాలో భాగంగా 68 బోర్లు తవ్వకాలకు కేంద్ర అటవి శాఖ అనుమతి ఇవ్వడంతో యురేనియం కలకలం రేపింది. సేవ్‌ కప్పట్రాళ్ల..! అంటూ 15 గ్రామాలు రోడ్డెక్కారు. పది రోజులకు పైగా ఆందోళన చేశారు. దిగివచ్చిన ప్రభుత్వం అనుమతి ఉప సంహరించుకుంది.

శ్రీశైలానికి సీప్లేన్‌

నవంబరు 9: శ్రీశైలం పాతల గంగలో సీప్లేన్‌ ల్యాండ్‌ అయ్యింది. విజయవాడ నుంచి శైశైలంకు సీప్లేన్‌లో సీఎం చంద్రబాబు ప్రయాణించారు. దేశంలో సీప్లేన్‌ టూరిజానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు

ఆగస్టు 10: రాయలసీమ జీవనాడి తుంగభద్ర డ్యాం 19వ క్రస్ట్‌గేట్‌ చైన్‌లింక్‌ తెగిపోయి కొట్టుకుపోయింది. సీఎం చంద్రబాబు తక్షణమే ప్రాజెక్ట్స్‌ క్రస్ట్‌గేట్స్‌ నిపుణుడు కన్నయ్యనాయుడును పంపించి స్టాప్‌లాగ్‌ ఏర్పాటు చేసి 30 టీఎంసీలు కడలిపాలు కాకుండా కాపాడారు.

అల్లు అర్జున్‌పై కేసు నమోదు

మే 11 : సినీ హీరో అల్లు అర్జున్‌, నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి చంద్రకిశోర్‌రెడ్డిపై నంద్యాల రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ జనసమీకరణలో పాల్గొన్నట్లు అప్పట్లో ఆయనపై కేసు నమోదు కావడం సంచలనమైంది.

Updated Date - Dec 31 , 2024 | 12:34 AM