Share News

మన్మోహన్‌ సింగ్‌ సేవలు మరువరానివి

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:50 PM

దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సేవలను సోమయాజులపల్లెవాసులు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు.

మన్మోహన్‌ సింగ్‌ సేవలు మరువరానివి
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిధులు మంజూరు చేసిన చెరువు ఇదే

2004 జూలై 1న సోమయాజులపల్లెకు రాక

రైతు కుటుంబానికి ఆర్థిక సాయం

చెరువు నిర్మాణానికి నిధులు మంజూరు

ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్న గ్రామస్థులు

ఓర్వకల్లు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సేవలను సోమయాజులపల్లెవాసులు నేటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఆయన సేవలు మరువలేనివని కొనియాడుతు న్నారు. సోమయాజులపల్లెకు చెందిన రైతు పెద్ద కురువ రంగన్న అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆయన భార్య పార్వతమ్మతోపాటు మిగతా రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేం దుకు 2004 జూలై 1న నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సోమయాజులపల్లెకు చేరుకున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెక్కులు అందజేశారు. గ్రామానికి సాగు నీరు లేదని మన్మోహన్‌ సింగ్‌ దృష్టికి రైతులు తీసుకెళ్లడంతో రూ.కోటి నిధులు మంజూరు చేశారు. సంవత్సరంలోపే చెరువు నిర్మాణం పూర్తి చేసి పొలాలకు సాగు నీరు అందించారు. ఆ చెరువు కింద దాదాపు 350 ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా బోర్లలో కూడా భూగర్భ జలాలు పెరిగాయి. ఇప్పటికీ ఆ గ్రామంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ను స్మరించుకుంటున్నారు.

నాటి ప్రధాని చేసిన సేవలు మరువరానివి

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మృతి తీరని లోటు. మా గ్రామానికి ఆయన వచ్చి రైతులందరితో కలిసి చెరువు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరడంతో తక్షణమే స్పందించారు. రూ.కోటి నిధులు మంజూరు చేసి చెరువు నిర్మాణం చేపట్టారు. ఆయన రుణం తీర్చుకోలేనిది. - కాకి దేవేంద్ర, రైతు

350 ఎకరాలకు సాగు నీరు

ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ చొరవతో చెరువు నిర్మాణం చేపట్టడంతో 350 ఎకరాలకు సాగు నీరు అందుతోంది. అదేవిధంగా బోర్లలో కూడా భూగర్భ జలాలు పెరిగాయి. ఆయన మరణం తీరని లోటు. - రామ మద్దిలేటి, రైతు

Updated Date - Dec 27 , 2024 | 11:50 PM