Share News

కోట్ల కుటుంబంతో మన్మోహన్‌సింగ్‌ అనుబంధం

ABN , Publish Date - Dec 27 , 2024 | 11:52 PM

భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌సింగ్‌ (92)కు కర్నూలు జిల్లాతో అనుబంధం ఉంది.

కోట్ల కుటుంబంతో మన్మోహన్‌సింగ్‌ అనుబంధం
మన్మోహన్‌ సింగ్‌తో విజయభాస్కర రెడ్డి(ఫైల్‌)

పీవీ మంత్రివర్గంలో పని చేసిన మన్మోహన్‌, కోట్ల విజయభాస్కరరెడ్డి

మన్మోహన్‌ మంత్రి వర్గంలో సూర్యప్రకాశ్‌రెడ్డి

కర్నూలు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): భారత మాజీ ప్రధాని, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్‌సింగ్‌ (92)కు కర్నూలు జిల్లాతో అనుబంధం ఉంది. ఆ మహోన్నత వ్యక్తితో కర్నూలు జిల్లాకు చెందిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉంది. కాంగ్రెస్‌లో సీడబ్ల్యూసీ సభ్యులుగా కోట్ల విజయభాస్కరరెడ్డి, మన్మోహన్‌సింగ్‌ ఇద్దరు పని చేశారు. 1991లో భారత ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు బాధ్యతలు చేపట్టారు. పీవీ మంత్రివర్గంలో మన్మోహన్‌సింగ్‌ ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే.. జిల్లాకు చెందిన పెద్దాయన కోట్ల విజయభాస్కరరెడ్డి న్యాయ, కంపెనీ వ్యవహారాలు బాధ్యతలు చేపట్టారు. ఇద్దరి మధ్య రాజకీయంగా సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 1992లో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి కోట్ల విజయభాస్కరరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఏపీ సీఎంగా కోట్ల వివిధ ప్రాజెక్టులకు నిధుల కోసం పలుమార్లు ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసి పలు రాజకీయ అంశాలే కాకుండా రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టులు, సంస్కరణలపై చర్చించేవారని అంటున్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి మరణాంతరం ఆయన రాజకీయ వారసుడిగా కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి కర్నూలు ఎంపీగా ఎన్నికయ్యారు. 2004, 2009లో జరిగిన రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. రెండో పర్యాయం ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రివర్గ విస్తరణ సమయంలో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి రైల్వే సహాయ మంత్రిగా అవకాశం కల్పించారు. తమ కుటుంబంతో మన్మోహన్‌సింగ్‌కు ఉన్న పరిచయం కారణంగా అనాటి ప్రధాని మన్మోహన్‌ను ఒప్పించి జిల్లాకు రైల్వే కోచ్‌ మరమ్మతుల పరిశ్రమను తీసుకొచ్చారు. ఈ రోజు భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మన మధ్య లేరని, తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి కోట్ల అనుచరులు, ముఖ్యంగా కాంగ్రెస్‌ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రద్ధాంజలి ఘటించారు.

Updated Date - Dec 27 , 2024 | 11:52 PM