రావణ వాహనంపై మల్లన్న విహారం
ABN , Publish Date - Mar 06 , 2024 | 12:23 AM
రావణ వాహనంపై మల్లన్న విహారం

కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం నుంచి పట్టువస్ర్తాలు
నేడు పుష్పపల్లకి
శ్రీశైలం, మార్చి 5: శ్రీశైలం క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు మంగళవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి రావణవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో ఉత్సవమూర్తులను సుగంధపుష్పాలతో ముస్తాబైన రావణవాహనంపై ఆశీనులను చేసి ఆలయ అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళవాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయ రాజగోపురం నుంచి వెలుపలకు తీసుకొచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాధికాలను నిర్వహించి క్షేత్ర వీధుల్లో గ్రామోత్సవం జరిపారు.
పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలంలో వైభవంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం తరపున ధర్మకర్తల మండలి అధ్యక్షుడు ఎ.మోహనరెడ్డి, ఈవో ఎ.వెంకటేశ్ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలతో వచ్చిన వీరికి శ్రీశైల దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
నేడు పుష్పపల్లకిసేవ : బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు పుష్పపల్లకిసేవ నిర్వహించనున్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఆహూతులను అలరించాయి. ఆలయ దక్షణ మాడవీధిలోని నిత్యాకళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని భ్రామరీకళావేదిక, శివదీక్షాశిబిరాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాలు కొనసాగాయి.