Share News

మయూర వాహనంపై మల్లన్న

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:34 PM

శ్రీశైలం క్షేత్రంలో సోమవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

మయూర వాహనంపై మల్లన్న

పట్టువస్త్రాలు సమర్పించిన టీటీడీ

నేడు రాష్ట్ర ప్రభుత్వం తరపున..

శ్రీశైలం, మార్చి 4: శ్రీశైలం క్షేత్రంలో సోమవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఉభయ దేవాలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సుగంధ పుష్పాలతో ముస్తాబు చేశారు. అనంతరం మయూర వాహనంపై అధిష్టింపజేశారు. ఆలయ అర్చకులు, వేదపండితులు అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. తరువాత స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మంగళ వాయిద్యాలు, కళాకారుల సంగీత, జానపద నృత్యాల నడుమ ఆలయం రాజగోపురం నుంచి వెలుపలకి తోడ్కొని వచ్చారు. గంగాధర మండపం వద్ద ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి క్షేత్ర పురవీధుల్లో గ్రామోత్సవం జరిపారు. గ్రామోత్సవం ముందు కోలాటం, చెక్కభజన, రాజభటుల వేషాలు ఆకట్టుకున్నాయి. ఆలయ రాజగోపురం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గంగాధర మండపం మీదుగా నంది మండపం వరకు.. తిరిగి అక్కడి నుంచి బయలు వీరభద్ర స్వామి ఆలయం దాకా కొనసాగింది. భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను భక్తులు కన్నులారా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. గ్రామోత్సవంలో ఆలయ అధికారులు, సిబ్బంది, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పణ..

శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలతో వచ్చిన వీరికి శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, అర్చకులు, వేదపండితులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అర్చకులు పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. అనంతరం శ్రీశైల దేవస్థానం ఆలయ అధికారులు, టీటీడీ దేవస్థాన అధికారులు, అర్చకులు పట్టువస్త్రాలను తలపై పెట్టుకుని ఆలయ ప్రవేశం చేసి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. మల్లన్నకు పట్టువస్త్రాలు సమర్పించడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని టీటీడీ ఈవో తెలిపారు. ఈ సందర్భగా టీటీడీ ఈవోను శ్రీశైల దేవస్థానంలో టీటీడీ తరపున అతిథి గృహాన్ని నిర్మించాలని కోరారు.

నేడు రావణ వాహన సేవ..

మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలో భాగంగా ఐదోరోజు మంగళవారం సాయంత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు రావణ వాహన సేవ నిర్వహిస్తారు. అనంతరం గ్రామోత్సవ కార్యక్రమం చేపడతారు.

నేడు కాణిపాకం నుంచి..

బ్రహ్మోత్సవాల్లో ఐదోరోజు ఉదయం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం, సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ దక్షిణ మాఢ వీధిలోని నిత్య కళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని భ్రామరీ కళావేదిక, శివదీక్షా శిబిరాల ప్రాంగణంలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం సాంప్రదాయ నృత్యప్రదర్శన, వేణుగానం, భక్తి గీతాలు, భక్తి సంగీత విభావరి, శివలీలలు పౌరాణిక నాటకం, బాలనాగమ్మ నాటకం కార్యక్రమాలను నిర్వహించారు.

Updated Date - Mar 04 , 2024 | 11:34 PM