దీపావళికి మహాశక్తి
ABN , Publish Date - Oct 27 , 2024 | 11:53 PM
టీడీపీ ఎన్నికల హామీల్లోని సూపర్ సిక్స్‌లో మహాశక్తి పథకం ఒకటి. దీని కింద పేద మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితం
31 నుంచి అమలుకు శ్రీకారం
తెల్ల రేషన్‌కార్డు ఉన్న వాళ్లందరూ అర్హులే, రేపటి నుంచే బుకింగ్
సమస్యలపై 1967 టోల్‌ఫ్రీ నెంబరును సంప్రదించవచ్చు
బ్ధిదారుల జాబితా తయారీలో అధికారులు నిమగ్నం
కర్నూలు కలెక్టరేట్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ ఎన్నికల హామీల్లోని సూపర్ సిక్స్‌లో మహాశక్తి పథకం ఒకటి. దీని కింద పేద మహిళలకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇది దీపావళి నుంచి అమలు కానున్నది. అర్హులందరూ మూడు సిలిండర్లుపై నగదును డీపీటీ విధానం కింద పొందనున్నారు. సిలిండర్ డెలివరీ సమయంలో నగదు మొత్తం చెల్లించాలి. సిలిండర్‌కు కేంద్రం ఇచ్చే రాయితీ పోను మిగిలిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల వ్యవధిలో జమ చేయనున్నది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాశక్తి పథకం పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో గ్యాస్ కనెక్షన్లు 6.64 లక్షలు, దీపం కింద 1.50 లక్షలు ఉజ్వల కింద 58వేలు, సీఎ్‌సఆర్ 54వేలు, జనరల్ కింద 3.81 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.858 ఉండగా.. ప్రభుత్వం రాయితీ రూ.41 ఇస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక సిలిండర్‌పై రూ.300 చొప్పున 12 సిలిండర్లకు రాయితీ ఇస్తోంది. ఒక్కొక్క సిలిండర్‌పై రూ.558 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మూడు సిలిండర్ల మొత్తాన్ని భరించాల్సి ఉంటుంది.
తెల్లరేషన్ కార్డుదారులు అర్హులు:
తెల్లరేషన్ కార్డు ఉన్న వారంతా ఉచిత సిలిండర్‌కు అర్హలేనని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మంగళవారం నుంచి గ్యాస్ సిలిండర్లను గ్యాస్ వినియోగదారులు బుకింగ్ చేసుకోవచ్చు. వారికి ఈ నెల 31న ప్రారంభించి దీపావళి కానుకగా అందజేయనున్నారు.