Share News

మల్లన్నను దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం

ABN , Publish Date - May 25 , 2024 | 11:29 PM

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శనివారం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

మల్లన్నను దర్శించుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం

శ్రీశైలం, మే 25: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను శనివారం మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి డాక్టర్‌ మోహన్‌ యాదవ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన బేగంపేట్‌ ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌ ద్వారా సుండిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలంలోని భ్రమరాంబ అతిథి గృహానికి చేరుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్ల దర్శనార్థం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మోహన్‌ యాదవ్‌ దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మోహన్‌ యాదవ్‌ దంపతులు మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబికాదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించుకున్నారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం మోహన్‌ యాదవ్‌ దంపతులకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపములో వేదపండితులు వేదాశీర్వచనం పలికి తీర్థప్రసాదాలను అందజేశారు. తరువాత ఆలయ అధికారులు సీఎం మోహన్‌ యాదవ్‌కు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి సత్కరించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం క్షేత్రపరిధిలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం సుండిపెంట హెలిప్యాడ్‌కు చేరుకుని హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌కు వెళ్లారు. సుండిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్న మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌కు నంద్యాల జిల్లా బీజేపీ నాయకులు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. సీఎం పర్యటన నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ సహా, నంద్యాల జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు.

Updated Date - May 25 , 2024 | 11:29 PM