Share News

ఎల్‌పీఎం గుదిబండ..!

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:01 AM

శాశ్వత భూ హక్కుల పేరిట గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) విధానం రైతుల పాలిట గుదిబండగా తయారైంది.

ఎల్‌పీఎం గుదిబండ..!
కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

తగ్గిపోతున్న రిజిస్ట్రేషన్లు.. ఖజానాకు ఆదాయం కోత

కూటమి ప్రభుత్వం వచ్చినా అదే దుస్థితి

ఎల్‌పీఎం నంబరు కోసం రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు

ఉమ్మడి జిల్లాలో 2,500కు పైగా రిజిస్ట్రేషన్లు పెండింగ్‌

కర్నూలు, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): శాశ్వత భూ హక్కుల పేరిట గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) విధానం రైతుల పాలిట గుదిబండగా తయారైంది. దశాబ్దాల కాలంగా ఉన్న సర్వే నంబర్లు స్థానంలో ఎల్‌పీఎం తీసుకురావడంతో సబ్‌ రిజిస్ట్రార్లకు కొత్త సమస్య తలెత్తింది. రిజిస్ట్రేషన్‌ విలువ ఖరారులో స్థిర నిర్ణయానికి రాలేకపోతున్నారు. భూముల క్రయ విక్రయాలకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రీసర్వేకు ముందు ఒక రైతులకు వివిధ ప్రాంతాల్లో భూములు ఉంటే వేర్వేరు సర్వే నంబర్లు ఉండేవి. ఆ భూములు ఉండే ప్రాంతాలను బట్టి రిజిస్ట్రేషన్‌ విలువల్లో హెచ్చుతగ్గులు ఉండేవి. రీసర్వే తరువాత వేర్వేరు చోట్ల భూములన్నింటినీ కలిపి ఒకే ఎల్‌పీఎం నంబరు ఇచ్చారు. పక్కపక్కనే ఉన్న ఐదారుగురు రైతుల భూములన్నింటికీ ఒకే ఎల్పీఎం నంబరు ఇచ్చారు. ఆ నంబర్లు మేరకే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. రిజిస్ట్రేషన్ల కోసం వెళితే.. ఎల్‌పీఎం నంబరులో ఎంత విస్తీర్ణం ఉందో అంతటికీ రిజిస్ట్రేషన్‌ విలువ చూపుతోంది. మొత్తం భూమి విస్తీర్ణం సెలెక్ట్‌ చేస్తుంది. సాంకేతిక సమస్యల కారణంగా ఆర్థిక ఇబ్బందులతో భూములు అమ్ముకున్న రైతులు.. కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఎల్‌పీఎం సమస్యతో దాదాపు 2,500కు పైగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయి ఖజానాకు రావాల్సిన రూ.55 కోట్లకు పైగా రాబడి కోల్పోవాల్సి వచ్చింది.

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం అనాలోచితంగా చేసిన నిర్ణయాలు రైతుల పాలిట శాపంగా మారాయి. రీ సర్వే పేరిట దశాబ్దాలుగా ఉన్న సర్వే నంబర్ల స్థానంలో ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) నంబర్లు తీసుకొచ్చింది. రెవిన్యూ రికార్డుల ప్రకారం కర్నూలు జిల్లాలో 472 రెవిన్యూ గ్రామాలు ఉంటే 252 గ్రామాల్లోనూ, నంద్యాల జిల్లాలో 462 రెవిన్యూ గ్రామాలకు గానూ 215 గ్రామాల్లో రీ సర్వే చేశారు. సర్వే చేసిన గ్రామాల్లో ఎల్‌పీఎం నంబర్లు కర్నూలు జిల్లాలో 65 వేలు, నంద్యాల జిల్లాలో 75 వేలకు పైగా ఖాతాలకు ఇచ్చారు. ప్రస్తుతం భూములు క్రయవిక్రయాలు జరిగితే ఈ ఎల్‌పీఎం నంబర్లు ద్వారానే రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. పక్కపక్కనే భూములు ఉన్న రైతులు అందరికి ఒకే ఎల్‌పీఎం నంబరు ఇవ్వడం, సబ్‌ డివిజన్‌ చేయకపోవడంతో రిజిస్ట్రేషన్‌ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్లూరు మండలం ఏ. గోకులపాడు గ్రామంలో ఓ రైతు తనకున్న పదెకరాల పొలంలో ఐదు ఎకరాలు కర్నూలు నగరంలోని ఓ వ్యక్తికి విక్రయించాడు. అగ్రిమెంట్‌ గడువు ముగుస్తుండడంతో రిజిస్ట్రేషన్‌ కోసం కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళితే.. ఆ ఎల్‌పీఎం నంబరులోని పూర్తి విస్తీర్ణం సెలెక్ట్‌ అవుతుంది. ఆదోని మండలం కపటి గ్రామానికి చెందిన ఓ రైతు పొలం అమ్మాడు. నెల రోజుల క్రితం రిజిస్ట్రేషన్‌ కోసం ఆదోని సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసు వెళితే.. ఆ రైతుతో పాటు ఎల్‌పీఎం నంబరు పరిఽధిలో ఉన్న ఐదారుగు రైతుల భూమి కూడా సెలెక్ట్‌ అయింది. సబ్‌ డివిజన్‌ చేసి కొత్త ఎల్‌పీఎం నంబరు తెచ్చుకునే వరకు రిజిస్ట్రేషన్‌ చేయలేమని తేల్చేశారు. ఎల్‌పీఎం నంబరు కోసం తహసీల్దారు కార్యాలయం చుట్టు తిరుగుతున్నా ఫలితం శూన్యం.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కొ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో 75 నుంచి 200కు పైగా ఎల్‌పీఎం నంబర్ల సమస్య వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిపోయినట్లు తెలుస్తోంది. కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్‌, ఆత్మకూరు, ఆళ్లగడ్డ.. వంటి ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. రీ సర్వే గ్రామాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో సుమారుగా 2,500కు పైగా డాక్యుమెంట్లు ఎల్‌పీఎం నంబర్ల సమస్యతో రిజిస్ట్రేషన్‌ పెండింగుల్లో ఉంటాయని ఓ అధికారి తెలిపారు. ఇంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చని అంటున్నారు. కల్లూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం పరిధిలో ఒక్కటే 150కి పైగా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తున్నది. ఒక్కో డాక్యుమెంట్‌ ద్వారా స్టాంప్‌ డ్యూటీ రూపంలో సగటున రూ.20-25 వేలు వరకు రావచ్చని సబ్‌ రిజిస్ట్రార్‌ ఒకరు తెలిపారు. ప్రధాన రహదారి పక్కనే ఉన్న భూములకు ఎక్కువ మొత్తంలో వస్తుందని అంటున్నారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో దాదాపుగా రూ.55 కోట్లకు పైగా స్టాంప్‌ డ్యూటీ రూపంలో ఖజానాకు రావాల్సిన రాబడికి కోత పడినట్లైంది.

ఒకే ఎల్పీఎంతో ఎన్నో కష్టాలు

పక్కపక్కనే భూములున్న రైతులకు, వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములకు అన్నింటికీ ఒకే ఎల్‌పీఎం నంబరు ఇవ్వడం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉదా: కల్లూరు మండలంలోని ఓ గ్రామం రైతుకు హైదరాబాద్‌-బెంగళూరు వయా కర్నూలు జాతీయ రహదారి వెంబడి ఓ సర్వే నంబరులో కొంత భూమి, అదే గ్రామంలో మరో రెండు మూడు చోట్ల భూములు ఉన్నాయని అనుకుందాం. రీసర్వేకు ముందు ఒక్కో భూమికి ఒక్కో సర్వే నంబరు, ఖాతా నంబరు ఉండేది. రీసర్వే తరువాత అన్ని సర్వే నంబర్లలోని భూములకు ఒకే ఎల్‌పీఎం నంబరు ఇచ్చారు. సహజంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న భూమికి రిజిస్ట్రేషన్‌ విలువ ఎక్కువగా, గ్రామానికి దూరంగా ఉన్న భూమి రిజిస్ట్రేషన్‌ తక్కువగా ఉంటుంది. ఒకే ఎల్‌పీఎం నంబరు ఇవ్వడంతో ఆ మొత్తం భూమికి ఒకే రిజిస్ట్రేషన్‌ విలువ సహా మొత్తం భూమిని సెలెక్ట్‌ చేస్తుంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. దీని వల్ల భవిష్యత్తులో భూ సమస్యలతో పాటు న్యాయ సమస్యలు తలెత్తుతాయని, క్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని కర్నూలుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు.

టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చినా..!

గత జగన్‌ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ టీడీపీ కూటమి ప్రభుత్వం రాగానే రద్దు చేసింది. రీసర్వే సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని రైతులు ఆశించారు. అయితే.. టీడీపీ కూటమి ప్రభుత్వం కొలుదీరి ఆరు నెలలు దాటినా కూడా ఇప్పటికీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో 2.0 ప్రైమ్‌కార్డు వర్షన్‌ రూపంలో ఎల్‌బీఎం నంబర్లు ద్వారానే రిజిస్ట్రేషన్‌ చేస్తుండడంతో రైతులు ఇబ్బందులు తప్పడం లేదు. ఎల్పీఎం నంబర్లు కాకుండా పాత విధానం సర్వే నంబర్లు ద్వారానే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేపట్టాలని, దీంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని మెజార్టీ రైతులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో రీసర్వే చేసిన గ్రామాల్లో దాదాపుగా 1.50 లక్షలకు పైగా జాయింట్‌ ఎల్బీఎం నంబర్లు వల్ల అన్నదాతలకు అవస్థలు తప్పడం లేదు. రెవిన్యూ సదస్సుల్లో మెజార్టీగా ఈ సమస్యలే అధికంగా వస్తున్నాయి.

ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం

జాయింట్‌ ఎల్పీఎం నంబర్లు వల్ల రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలు ఉన్నమాట మాట నిజమే. ఐదారుగు రైతులకు ఒకే ఎల్పీఎం నంబరు ఇవ్వడంతో రిజిస్ట్రేషన్‌ సమయంలో మొత్తం భూమి విస్తీరణం సెలెక్ట్‌ చేస్తుంది. దీంతో సమస్యలు తలెత్తున్నాయి. సామాన్య రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించాం. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. సర్వే అండ్‌ సెటిల్మెంట్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, రెవిన్యూ శాఖలు సంయుక్తంగా పరిష్కరించాల్సి సమస్య ఉంది. ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసుకెళ్తాం. త్వరంలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది.

- పీజీఎస్‌ కళ్యాణి, డీఐజీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ, కర్నూలు

Updated Date - Dec 12 , 2024 | 12:01 AM