శ్రీశైల జలాశయం 6 గేట్ల ఎత్తివేత
ABN , Publish Date - Oct 20 , 2024 | 11:58 PM
నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది.
శ్రీశైలం, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జలాశయానికి వరద భారీగా కొనసాగుతుండడంతో ఆదివారం డ్యాం అధికా రులు 6 క్రస్టుగేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్ జలాశయానికి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి 1,28,368 క్యూసెక్కులు, సుకేసుల నుంచి 67,312 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కులు మొత్తం 1,95,929 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటల సమాయానికి జలాశయానికి 1,25,641 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత పూర్తిస్థాయి నీటిమట్టం 884.80 అడుగులకు చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 211.4250 టీఎంసీలుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 30,698 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కులు నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. జలాశయం ఆరు క్రస్టుగేట్ల ద్వారా 1,67,898 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.