Share News

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:04 AM

శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో ఆళ్లగడ్డ న్యాయస్థానం గురువారం ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.

హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి) : శిరివెళ్ల మండలం కోటపాడు గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో ఆళ్లగడ్డ న్యాయస్థానం గురువారం ఇద్దరికి జీవిత ఖైదు విధించింది. శిరివెళ్ల ఎస్‌ఐ చిన్న పీరయ్య వివరాల మేరకు.. కోటపాడుకు చెందిన షేక్‌ హుసేన్‌బీ తన కుమార్తెను ఆళ్లగడ్డ పట్టణంలోని రామదాసు వీధికి చెందిన షేక్‌ అహమ్మద్‌ హుసేన్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. అల్లుడు అహమ్మద్‌ హుసేన్‌ తన కుమార్తెను సరిగ్గా చూసుకోవడం లేదన్న కారణంతో హత్య చేసేందుకు హుసేన్‌బీ కుట్ర పన్నింది. ఈ మేరకు అదే గ్రామానికి చెందిన షేక్‌ హుసేన్‌వలితో కలిసి అల్లుడు అహమ్మద్‌ హుసేన్‌పై కోటపాడులో కిరోసిన్‌ పోసి నిప్పంటించింది. గాయాలపాలైన అహమ్మద్‌ హుసేన్‌ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో శిరివెళ్ల పోలీస్‌ స్టేషన్‌లో 2019లో కేసు నమోదైంది. అనంతరం నిందితులను కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండుకు పంపించారు. గురువారం ఆళ్లగడ్డ న్యాయస్థానంలో వాదోపవాదాలు జరిగాయి. సాక్ష్యాలను పరిశీలించిన 5వ అదనపు జిల్లా జడ్జి వీవీఎస్‌ మురళీకృష్ణ షేక్‌ హుసేన్‌వలి, షేక్‌ హుసేన్‌బీలకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించారు.

Updated Date - Oct 25 , 2024 | 12:04 AM