Share News

బుగ్గన దోచుకున్నది కక్కిస్తాం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:51 AM

ఆర్థిక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి భారీగా దోచేశాడని.. తిన్నదంతా కక్కిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బుగ్గన దోచుకున్నది కక్కిస్తాం

మంత్రి పదవిని అడ్డం పెట్టుకున్న మైనింగ్‌ మాఫియా

బుగ్గనకు రాజకీయ సన్యాసం తప్పదు..

నందికొట్కూరు రూపురేఖలు మారుస్తా

సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తా

ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు

డోన్‌, నందికొట్కూరుకు పోటెత్తిన ప్రజలు

డోన్‌, ఏప్రిల్‌ 29: ఆర్థిక మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి భారీగా దోచేశాడని.. తిన్నదంతా కక్కిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థను బుగ్గన నాశనం చేశాడని ధ్వజమెత్తారు. సోమవారం ప్రజాగళం యాత్రలో భాగంగా డోన్‌, నందికొట్కూరులో జరిగిన భారీ బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడారు. ఆయా సభలకు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు. ముందుగా డోన్‌ పట్టణంలోని పాతబస్టాండులో నిర్వహించిన ప్రజాగళం సభలో టీడీపీ డోన్‌ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి, నంద్యాల ఎంపీ భైరెడ్డి శబరితో కలిసి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గనపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. డోన్‌ నియోజకవర్గంలో వనురులన్నీ మంత్రి బుగ్గన పెద్ద ఎత్తున దోపిడీ చేశాడని ఆరోపించారు. మైనింగ్‌లను మింగేసి కోట్ల రూపాయలు అప్పనంగా సంపాదించాడని విమర్శించారు. మంత్రి బంధువు గజేంద్రరెడ్డి నియోజకవర్గంలో భారీగా దోపిడీ చేసి ప్రజల జేబులను గుల్ల చేశారన్నారు. క్రషర్లు, మైనింగ్‌ గనుల్లో సెటిల్‌మెంట్లతో మంత్రి అనుచరులు, బంధువులు ఇష్టారాజ్యంగా దందాలు చేశారని మండిపడ్డారు. మంత్రి బుగ్గన అనుచరులు కర్ణాటక మద్యాన్ని డోన్‌కు తీసుకువచ్చి అక్రమంగా సంపాదించాడన్నారు. బేతంచెర్లలో వాగులను కబ్జాలు చేశారని ఆరోపించారు. అవినీతితో బుగ్గన సంపాదించిన సొమ్మంతా టీడీపీ అధికారంలోకి రాగానే కక్కిస్తామన్నారు. ఎన్నికల తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎక్కడికి వెళ్లిపోతాడో తెలుస్తుందన్నారు. కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి దెబ్బకు డోన్‌ నుంచి బుగ్గన పారిపోవడం ఖాయమని, రాజకీయ సన్యాసం తప్పదన్నారు. ఈ సభలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

నందికొట్కూరును నందనవనం చేస్తా

నందికొట్కూరు, ఏప్రిల్‌ 29: జగన్మోహన్‌రెడ్డి గత రెండు రోజుల క్రితం ప్రవేశపెట్టిన ఎన్నికల మేనిఫెస్టో అట్టర్‌ ప్లాఫ్‌ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నందికొట్కూరు పట్టణంలో నిర్వహించిన ప్రజాగళం సభ సందర్భంగా కొత్త బస్టాండ్‌ నుంచి పటేల్‌ సెంటర్‌ వరకు చంద్రబాబు నాయుడు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో అట్టర్‌ ప్లాఫ్‌ అయిందన్నారు. టీడీపీ సూపర్‌ సిక్స్‌ పథకాలు ప్రజల్లోకి సూపర్‌గా వెళ్లాయన్నారు. తెలుగుగంగ, గాలేరునగరి, ఎస్‌ఆర్‌బీసీ, కేసీ కాలువ, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ లాంటి ప్రధాన కాలువలు రాయల సీమతో పాటు మద్రాసుకు నీరు ఇస్తున్నా నందికొట్కూరుకు సాగునీరు లేదన్నారు. సాగు నీటి ప్రాజెక్టులకు గేట్‌ వేగా ఉన్న నందికొట్కూరును నందనవనంగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మిడ్తూరు, జూపాడు బంగ్లా ఎత్తిపోతల పథకాలను నిర్మిస్తామన్నారు. కృష్ణానదిపై బ్రిడ్జి కమ్‌ బ్యారేజీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు అలగనూరు రిజర్వాయర్‌కు మరమ్మతులు చేపట్టి పైప్‌లైన్‌ ద్వారా నందికొట్కూరు పట్టణానికి తాగునీటిని అందిస్తామన్నారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన జైన్‌ ఇరిగేషన్‌ కంపెనీకి నీటి సరఫరా చేసి తిరిగి ప్రారంభించి యువతకు ఉద్యోగావ కాశాలు కల్పిస్తామన్నారు. బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేర్చుతామన్నారు. నందికొట్కూరు అసెంబ్లీ అభ్యర్థి గిత్తా జయసూర్యతో పాటు ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ సభలో టీడీపీ రాష్ట్ర నాయకుడు మాండ్ర శివానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:51 AM