Share News

అంచనాలతో కుసీ ్త..!

ABN , Publish Date - May 18 , 2024 | 11:50 PM

అంచనాలతో కుసీ ్త..!

అంచనాలతో కుసీ ్త..!

పోలైన ఓట్ల నివేదికలు పట్టుకుని లెక్కలు

ఫలితాలపై అభ్యర్థుల తర్జనభర్జన

ఏం జరుగుతుందోనని గుబులు

జూన్‌ 4 వరకు టెన్షన్‌.. టెన్షన్‌

మరోవైపు గెలుపుపై బెట్టింగ్‌ జోరు

కర్నూలు, మే 18 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ ముగిసి వారం రోజులైంది. ఓటర్లు రోజు వారి పనుల్లో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ విధుల్లో బిజీగా గడిపిన అధికారులు రోజువారి విధుల్లోకి వెళితే.. సెలవులు కావడంతో ఉపాధ్యాయులు కుటుంబాలతో కలిసి వేసవి వినోదం టూర్లకు ప్లాన్‌ చేసుకుంటున్నారు. అయితే.. సార్వత్రిక సమరంలో తలపడిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపు అంచనాలతో కుస్తీ పడుతున్నారు. పోలింగ్‌ కేంద్రాల వారీగా పోలైన ఓట్ల నివేదికలు, వివరాలు టేబుల్‌పై పెట్టుకొని ఫలానా పోలింగ్‌ కేంద్రంలో మనకు మెజార్టీ వస్తుంది..? ఫలానా కేంద్రంతో ప్రత్యర్థికి స్వల్ప మెజార్టీ వస్తుంది..? మనం డబ్బులు ఇచ్చినా స్థానిక నాయకుడు పంపిణీ చేయకపోవడంతో అక్కడ మనకు ఓట్లు పడలేదు..? ఫలానా వార్డులో ఉద్యోగులు, యువకులు, వ్యాపారులు ఎక్కువగా ఉన్నారు.. అక్కడ మనకే మెజార్టీ వస్తుంది..! లెక్కల్లో అభ్యర్థులు బిజీబీజీ అయ్యారు. గ్రామ, వార్డు ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలతో ఏ గ్రామంలో లీడ్‌ వస్తుంది..? ఏ గ్రామం, వార్డులో చేజారిపోతుంది..? అనే అంశాలపై చర్చిస్తున్నారు. బూత్‌ల వారీగా ఇచ్చిన డబ్బులు.. ఆ డబ్బు ఓటర్లకు ఏ మేరకు చేరింది.. డబ్బులు తీసుకున్న ఓటర్లు మనకే ఓటు వేశారా..! అంటూ ద్వితీయ శ్రేణి నాయకులను ఆరా తీస్తున్నారు. అదే క్రమంలో అభ్యర్థి ఇచ్చిన డబ్బులు సక్రమంగా ఓటర్లకు చేర్చని ద్వితీయ శ్రేణి నాయకుల ఫోన్లు స్విచ్‌ఆఫ్‌ వస్తుడటం గమనార్హం.

కర్నూలు లోక్‌సభ స్థానం పరిధిలో కర్నూలు, కోడుమూరు (ఎస్సీ), ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలతో పాటు నంద్యాల లోక్‌సభ స్థానంలో పరిధిలోని పాణ్యం సెగ్మెంట్‌ కూడా జిల్లా పరిధిలో వస్తుంది. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్ల్లో 20,54,563 మంది ఓటర్లు ఉండగా.. 15,70,007 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో సగటున 76.42 శాతం పోలింగ్‌ నమోదైంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన మూడు సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పరిశీలిస్తే ఇప్పుడే పోలింగ్‌ పెరిగింది. గత ఎన్నికలతో పోలిస్తే 1,72,517 మంది ఓటర్లు అధికంగా ఓటు వేశారు. రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూంలకు ఈవీఎంలు చేర్చారు. అభ్యర్థుల భవిత ఈవీఎంలలో నిక్షిప్తమైంది. పోలింగ్‌ ముగిని మూడు గడిచిపోయినా అభ్యర్థుల్లో ఉత్కంఠ ఏ మాత్రం తగ్గలేదు. గ్రామాల వారిగా లెక్కలు వేస్తూ అంచనాలతో కుస్తి పడుతున్నారు. తమకు గెలిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని, ఫలానా సామాజికవర్గం ఓట్లు మాకే గంపగుత్తగా పడ్డాయని, ఆ ఓట్లతోనే విజయం సాధిస్తామంటూ టీడీపీ కూటమి, వైసీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేయడం కొసమెరుపు.

ఓ వైపు ఊరట.. మరో వైపు దడ..!

పట్టణాలతో పల్లెల్లో నాయకులు, కార్యకర్తలు చెబుతున్న ఓట్ల లెక్కలు మాటలతో అభ్యర్థులు కొంత ఊరట చెందుతున్నారు. అదే క్రమంలో ఫలానా చోట మనకు తక్కువ వస్తాయి కావచ్చు.. అనే అనుమానాలు కూడా వెంటాడుతుండడం అభ్యర్థుల్లో గుబులు రేకెత్తిస్తోంది. మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే బాలనాగిరెడి, ఆయన సన్నిహితులు రెండు రోజులుగా గ్రామాల నాయకులు చెప్పే ఓట్ల లెక్కలతో ‘మనమే గెలుస్తాం..’ అంటూ ధీమా వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే నియోజకవర్గంలో మెజార్టీ ఓటర్లు ఉన్న వాల్మీకులు పార్టీలకు అతీతంగా గంపగుత్తగా టీడీపీకి వేసి ఉంటారనే అనుమానం రావడంతో అధికార వైసీపీలో ఓ రకమైన భయం కలవరపెడుతోంది. ఆదోనిలో పోలింగ్‌ మరుసటి రోజు వైసీపీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఫలానా పోలింగ్‌ కేంద్రంలో సైక్లింగ్‌ చేసి వంద ఓట్లు వేశామని ఒకరు.. మా వార్డులో రెండొందలు వేయించామని మరొక నాయకుడు చెబితే.. మా ఊర్లో బీజేపీకి ఏజెంటే లేడంటూ ఓ గ్రామ నాయకుడు చెబుతూ వచ్చారు. ఆ మాటలు.. లెక్కలు విన్న వైసీపీ అభ్యర్థి సాయిప్రసాద్‌రెడ్డి ‘50 వేల ఓట్లతో గెలుస్తాం’ అంటూ అతి నమ్మకంతో ఉన్నట్లు సమాచారం. ఈ రెండు రోజుల్లో లెక్కల్లో తేడాలు కనిపిస్తున్నాయని, బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ పార్థసారథిరెడ్డి వాల్మీకి సామాజికవర్గం కావడం, ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా ఆయనకే పడ్డాయనే ప్రచారం జోరుగా అందుకుంది. అదే క్రమంలో చేనేతలు మెజార్టీగా బీజేపీ కమలం వైపే మొగ్గు చూపారు.. ఉద్యోగులు ప్రభుత్వ వ్యతిరేకతతో ఆ పార్టీకే ఓట్లు వేశారని, పల్లెల్లో కూడా ఆశించిన స్థాయిలో మనకు ఓట్లు రాలేదని లెక్కలు చెబుతుండడంతో సాయి గుండెల్లో గుబులు మొదలైందని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. మంత్రాలయం, ఆదోనిలో ఒక్కటే కాదు.. జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల్లోని అభ్యర్థులకు గణాంకాల అంచనా నిద్రలేకుండా చేస్తోంది.

బెట్టింగ్‌ల జోరు

ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలో నిక్షిప్తమై ఉంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ఉండబోతోంది. అంటే ఇంకా ఇంకా 16 రోజుల సమయం ఉంది. సోషల్‌ మీడియాలో పలు రకాలు సర్వేలు ఇబ్బడిముబ్బడిగా వస్తున్నాయి. అదే క్రమంలో రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు విభాగాలు విభజించి ఏ ప్రాంతంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది..? అంటూ బెట్టింగ్‌లు వేస్తున్నారు. అదే క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ పార్టీకి సీట్లు వస్తాయి..? ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి గెలుస్తారు..? అంటూ భారీగా పందెం కాస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో రూ.కోట్లలో బెట్టింగ్‌ జరుగుతోంది. అదే క్రమంలో 2014, 2019, 2014 ఈ మూడు ఎన్నికల్లో పోలింగ్‌ శాతం ఆధారంగా పెరిగిన పోలింగ్‌ శాతం ఏ పార్టీకి అనుకూలం, తొలిసారిగా ఓటు వేసిన యువ ఓటర్లు ఎటు వైపు మొగ్గు చూపారు..? లెక్కలతో కుస్తి పడుతూ.. ఓ అంచనాకు వచ్చి బెట్టింగ్‌లు వేస్తున్నారు.

మూడు ఎన్నికల్లో పోలింగ్‌ శాతం ఇలా

నియోజకవర్గం 2014 2019 2024

కర్నూలు 58.27 59.53 63.75

పాణ్యం 71.74 74.41 74.44

పత్తికొండ 78.80 83.97 84.98

కోడుమూరు 74.57 78.77 79.14

ఎమ్మిగనూరు 74.47 79.15 81.97

మంత్రాలయం 78.02 84.98 84.31

ఆదోని 65.28 65.31 66.55

ఆలూరు 75.97 79.71 80.73

సగటు 72.24 75.87 76.42

Updated Date - May 18 , 2024 | 11:50 PM