Share News

కర్నూలు-విశాఖ మధ్య రైలు మార్గం

ABN , Publish Date - Nov 06 , 2024 | 11:56 PM

కర్నూలు- విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ అలైన్‌మెంట్‌ ప్రతిపాదనకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

కర్నూలు-విశాఖ మధ్య రైలు మార్గం

రైల్వే శాఖ గ్రీన్‌ సిగ్నల్‌

రెట్టింపు వేగంలో సాగిపోనున్న రైళ్లు

కర్నూలు నుంచి విశాఖకు నాలుగు గంటల ప్రయాణం

కర్నూలు, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి):కర్నూలు- విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ అలైన్‌మెంట్‌ ప్రతిపాదనకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ రైలు మార్గం నిర్మాణం జరిగితే కర్నూలు నుంచి విశాఖకు నాలుగు గంటల్లో ప్రయాణం చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలను కలుపుతూ సెమీ హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌ను ఆ శాఖ అధికారులు ఖరారు చేశారు. ప్రధాన నగరాల మధ్య రైలు ప్రయాణం సమయాన్ని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఈ కారిడార్‌ పూర్తయితే కర్నూలు ప్రాంతం పారిశ్రామిక, వాణిజ్య పరంగా అభివృద్ధి చెందనుంది. రాజధాని అమరావతికి రెండు మూడు గంటల్లో చేరుకునే అవకాశం ఉంది. మంత్రాలయం-కర్నూలు వయా ఎమ్మిగనూరు రైలు మార్గాన్ని కూడా నిర్మిస్తే కర్నూలు సిటీ రైల్వేస్టేషన్‌ రైల్వే జంక్షన్‌గా మారుతుంది. ఆ దిశగా జిల్లా ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉంది.

రాయలసీమ ముఖద్వారం కర్నూలు. హైదరాబాద్‌ - బెంగళూరు ఇండస్ట్రియల్‌ కారిడార్‌లో భాగంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్‌ హబ్‌ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. జిల్లాకు చెందిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్‌ జిల్లాకు పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎలాంటి పరిశ్రమలు రావాలన్నా రైలు మార్గాలు, జాతీయ రహదారులు, విమాయాన ప్రయాణ సౌకర్యం కీలకం. ఇప్పటికే హైదరాబాద్‌ - బెంగళూరు జాతీయ రహదారి ఉంది. దీనిని ఆరు లైన్ల రహదారిగా మార్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. కర్నూలు-చిత్తూరు వయా నంద్యాల జాతీయ రహదారి ఉంది. సూరత్‌ - చెన్నై వయా కర్నూలు మీదుగా జాతీయ రహదారి పనులు నిర్మాణంలో ఉన్నాయి. కర్నూలు (ఓర్వకల్లు) ఎయిర్‌ పోర్టు కూడా ఉంది. హైదరాబాద్‌, బెంగళూరుకు రైల్వేలైన్‌ సౌకర్యం ఉన్నా రాష్ట్ర రాజధాని అమరావతి, ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చెందుతున్న విశాఖకు కర్నూలు నగరం నుంచి రైలు మార్గం లేదు. పారిశ్రామిక, వ్యాపార అభివృద్ధికి ఇది అవరోధంగా ఉందని వ్యాపార వర్గాల వాదన. కర్నూలు - విశాఖపట్నం వయా సూర్యపేట, విజయవాడ మీదుగా సెమీ హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు కేంద్రం ఆమోదం ముద్ర వేయడం శుభపరిణామని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతిపాదనలతో కాలయాపన చేయకుండా తక్షణం కార్యాచరణ ప్రారంభించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

రైలు మార్గం ఇలా..

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గించాలన్నది ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో తొలి సెమీ హైస్పీడ్‌ కారిడారి ఇది. శంషాబాద్‌ - విశాఖపట్నం వయా సూర్యపేట, విజయవాడ మీదుగా రైల్వేలైన్‌ను ప్రతిపాదించారు. ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నం నుంచి కర్నూలు వయా విజయవాడ, సూర్యపేట, నల్గొండ, కల్వకుర్తి, నాగర్‌ కర్నూలు మీదుగా కర్నూలుకు మరో కారిడార్‌ ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక ఇంజనీరింగ్‌, ట్రాఫిక్‌ (పీఈటీ) సర్వే పూర్తయిందని, ఈ నెలాఖరులోగా రైల్వే బోర్డుకు నివేదికలు అందజేస్తారని అధికారులు పేర్కొంటున్నారు.

కర్నూలు నుంచి విశాఖపట్నం వయా సూర్యాపేట మీదుగా ప్రతిపాదించిన సెమీ హైస్పీడ్‌ కారిడార్‌ (రైలుమార్గం)లో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌ నగర్‌ జిల్లాల్లో ఎనిమిది రైల్వే స్టేషన్లను ప్రతిపాదించారు. తెలంగాణలో ఎక్కువ భాగం రైలు మార్గం ఉంటుంది. కర్నూలు నగరం చెంతనే ఉన్న తుంగభద్ర నది, తెలంగాణలో ప్రవహించే కృష్ణా నదులపై రైల్వే వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఈ రైలు వంతెనలు పర్యాటకులను ఆకట్టుకునేలా నిర్మిస్తారని అధికారులు తెలిపారు. ప్రస్తుతం కర్నూలు నుంచి విజయవాడకు చేరుకోవాలంటే ఎంత తక్కువ కాదన్నా 6 గంటలు పడుతుంది. అదే విశాఖకు చేరుకోవడానికి 8-10 గంటలకు పైగా సమయం పడుతుందని అంటున్నారు. సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో నడిచే రైళ్లు గంటకు 200 కి.మీ.కు పైగా వేగంతో దూసుకుపోతాయని, విశాఖకు నాలుగైదు గంటల్లో చేరుకోవచ్చని, విజయవాడకు రెండు మూడు గంటల్లో చేరుకునే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.

అలా చేస్తే కర్నూలు రైల్వే జంక్షన్‌గా మారే అవకాశం

మంత్రాలయం-కర్నూలు వయా ఎమ్మిగనూరు, కోడుమూరు రైలు మార్గం ప్రతిపాదనల్లో ఉంది. ఈ రైల్వేలైన్‌ కోసం 1970లో ఎమ్మిగనూరు వాసి ఆనాటి కర్నూలు ఎంపీ గాదెలింగన్నగౌడ్‌ తొలిసారిగా పార్లమెంట్‌లో గళమెత్తడంతో పార్లమెంట్‌ మినిట్స్‌ బుక్‌లో నమోదైంది. 2004లో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో రూ.165 కోట్లు అవసరమని గుర్తించి సర్వే కోసం నిధులు ఇచ్చారు. మంత్రాలయం (తుంగభద్ర) రైల్వే స్టేషన్‌ నుంచి మాధవరం, మంత్రాలయం, ఇబ్రహీంపురం, నందవరం, ఎమ్మినూరు, ఎర్రకోట, గోనెగండ్ల, హెచ్‌.కైరవాడి, వేముగోడు, కోడుమూరు, గూడూరు, నాగులాపురం, పెద్దపాడు మీదుగా కర్నూలు నగరం శివారులోని దూపాడు రైల్వేస్టేషన్‌ కలుపుతూ 110.70 కిలోమీటర్ల రైలుమార్గం, 14 స్టేషన్లతో అలైన్‌మెంట్‌ రూపొందించారు. రైల్వే ఇంజనీరింగ్‌, ట్రాఫిక్‌ సర్వేలు కూడా పూర్తయ్యాయి. సికింద్రాబాద్‌ దక్షిణ మధ్య రైల్వే కార్యాలయంలో ఈ రైలుమార్గం పెండింగ్‌లో ఉంది. ఈ రైల్వేలైన్‌ నిర్మాణం కోసం జిల్లా వాసులు ఐదు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తే కర్నూలు నుంచి తూర్పుకు సూర్యపేట, విజయవాడ సెమీ హైస్పీడ్‌ రైల్వే కారిడార్‌, పడమర వైపునకు కర్నూలు-మంత్రాలయం వయా ఎమ్మిగనూరు, ఉత్తర వైపునకు కర్నూలు - హైదరాబాద్‌ వయా గద్వాల, మహబూబ్‌నగర్‌, దక్షిణం వైపునకు కర్నూలు - బెంగళూరు వయా డోన్‌, గుత్తి రైల్వేలైన్లు సాగిపోతాయి. నాలుగు వైపుల రైలు మార్గాలతో కర్నూలు జంక్షన్‌గా మారే అవకాశం ఉంది. జిల్లా ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఆ మేరకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Nov 06 , 2024 | 11:56 PM