Share News

కర్నూలుకు ఏరువాక కేంద్రం

ABN , Publish Date - Aug 03 , 2024 | 11:19 PM

నంద్యాలలోని ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌)ను కర్నూలుకు తరలిస్తున్నారు.

కర్నూలుకు ఏరువాక కేంద్రం

తరలింపు ఉత్తర్వుల కలకలం

ఓ కీలక అధికారి ఏకపక్ష నిర్ణయం..?

ఆప్కాస్‌ కాంట్రాక్టు సిబ్బంది కోసమేనని విమర్శలు

ఆందోళనలో రైతులు

నంద్యాల టౌన్‌, ఆగస్టు 3 : నంద్యాలలోని ఏరువాక కేంద్రం (డాట్‌ సెంటర్‌)ను కర్నూలుకు తరలిస్తున్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రిజిస్ర్టార్‌ జి.రామచంద్రారావు తరలింపునకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ఉమ్మడి జిల్లాలో గతంలో ఏరువాక కేంద్రాన్ని బనవాసి కేంద్రంగా నిర్వహించేవారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా బనవాసిలో ఉన్న ఏరువాక కేంద్రాన్ని నంద్యాలకు మార్చారు. ఏరువాక కేంద్రాన్ని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఆవరణలో ఇప్పటి వరకు నిర్వహిస్తున్నారు.

కీలక అధికారి ఏకపక్ష నిర్ణయం

గుంటూరు లామ్‌లోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇన్‌చార్జి హోదాలో అత్యంత కీలకమైన పోస్టులో ఉన్న ఓ మహిళా అధికారి ఏరువాక కేంద్రం తరలింపు విషయంలో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. నంద్యాలలో ఏరువాక కేంద్రంలో ఆప్కాస్‌ విధానంలో కొందరు ఆ మహిళా అధికారికి సంబంధించిన సన్నిహితులు పని చేస్తున్నారు. వీరంతా కర్నూలు నుంచి నంద్యాలకు రాకపోకలు సాగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఆప్కా్‌సలో నియమించిన ఉద్యోగుల కోసం, ప్రయాణ ప్రయాసలు తప్పించేందుకు ఏకంగా నంద్యాలలోని ఏరువాక కేంద్రాన్ని కర్నూలుకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త జిల్లాగా ఏర్పడిన తరువాత నంద్యాలకు కేటాయించిన ఏరువాక కేంద్రాన్ని ఉన్నట్లుండి గుట్టు చప్పుడు కాకుండా కర్నూలుకు తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితమే తరలింపు ఉత్తర్వులు గుంటూరులోని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ పేరుతో ఆదేశాలు వెలువడ్డాయి. ఈనెల 14వ తేదీలోగా కర్నూలుకు తరలించాలంటూ ఆదేశించారు. అక్కడి రైతుల వినతి మేరకు ఏరువాక కేంద్రాన్ని తరలిస్తున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.

అధికార వర్గాల్లో విస్మయం

నంద్యాలలోని ఏరువాక కేంద్రాన్ని ఉన్నట్లుండి కర్నూలుకు తరలించాలంటూ వచ్చిన ఆదేశాలు ఇక్కడి వ్యవసాయ శాఖ, ఆర్‌ఏఆర్‌ఎ్‌సలోని శాస్త్రవేత్తలు, అనుబంధ శాఖల అధికారులు, సిబ్బంది, రైతుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. ఓ మహిళా కీలక అధికారి తనకు సంబంధించిన వారి కోసం ఏకంగా ఒక ప్రభుత్వ కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలన్న ఆదేశాలు అధికార వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏరువాక కేంద్రాన్ని కర్నూలుకు తరలిస్తున్న సమాచారం బయటకు పొక్కడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలుకు తరలించకుండా నంద్యాల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నారు.

ఆర్‌ఏఆర్‌ఎస్‌కు సంబంధం లేదు

నంద్యాలలోని ఏరువాక కేంద్రాన్ని కర్నూలుకు తరలిస్తున్నారు. విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలకు, ఆర్‌ఏఆర్‌ఎస్‌కు ఎలాంటి సంబంధం లేదు. మిగతా విషయాలు తెలియవు.

- ఏడీఆర్‌, డాక్టర్‌ జాన్సన్‌

Updated Date - Aug 03 , 2024 | 11:19 PM