Share News

చేనేతలకు శుభవార్త

ABN , Publish Date - Nov 25 , 2024 | 12:11 AM

దశాబ్దాలుగా ఎమ్మిగనూరు చేనేతలు ఎదురు చూస్తున్న టెక్స్‌టైల్‌ పార్కు కల ఎట్టకేలకు సాకారం కానుంది.

చేనేతలకు శుభవార్త
మంత్రిని సన్మానిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

త్వరలో ఎమ్మిగనూరులో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు

బనవాసి దగ్గర టెక్స్‌టైల్‌ పార్కు స్థలాన్ని పరిశీలించిన మంత్రి

ఎమ్మిగనూరు, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా ఎమ్మిగనూరు చేనేతలు ఎదురు చూస్తున్న టెక్స్‌టైల్‌ పార్కు కల ఎట్టకేలకు సాకారం కానుంది. ఆదివారం పట్టణంలో నిర్వహించిన భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఎమ్మిగనూరులో త్వరలో టెక్స్‌టెల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కలెక్టర్‌ దగ్గర ఫైల్‌ ప్రాసెసింగ్‌లో ఉందని తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హాయంలో టెక్స్‌టైల్‌ పార్కు కోసం కేటాయించిన స్థలాన్ని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ పరిశ్రమ ద్వారా ఐదువేల మందకి ఉపాది దక్కుతుందన్నారు. దివంగత బీవీ మోహాన్‌ రెడ్డి కలను ఆయన కుమారుడు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి నెరవేరుస్తున్నట్లు ఆమె తెలిపారు. తన చిన్న తనంలోనే బీవీ మోహాన్‌ రెడ్డి ఎమ్మెల్యే అవుతానని జ్యోస్యం చెప్పారని, తన తండ్రితో బీవీ మోహన్‌ రెడ్డికి ఉన్న అనుభందాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఎమ్మిగనూరుతో పాటు అనంతపురం జిల్లాలోని రాయదుర్గం, పామిడి ప్రాంతాల్లో టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాయలసీమలో సాగునీరు, తాగునీరు, పరిశ్రమలు తెచ్చిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. కర్నూలు జిల్లాల్లో బీసీ హాస్టళు, బీసీ రెసిడెన్సియల్‌ స్కూల్స్‌ను అభివృద్ది చేస్తామన్నారు. కురువలు తమ పిల్లలకు విద్యనందించాలని ఆమె పిలుపునిచ్చారు. మాదాసి కురువను ఎస్సీ జాబితాలో చేర్పించే విషయంపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్‌తో చర్చించామన్నారు. కర్నూలు జిల్లాలోని నాయకులతో కమిటి ఏర్పాటు చేయాలని సూచించారని చెప్పారు.

ఎమ్మిగనూరులో ఘనంగా భక్త కనదాసు జయంతి వేడుకలు ఎమ్మిగనూరు పట్టణంలోని ఇండస్‌ గ్లోబల్‌ పాఠశాల ఆవరణంలో ఆదివారం కురువల ఆరాద్యదైవం భక్త కనకదాసు జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయనాగే శ్వరరెడ్డి, ఎంపీలు బీకే పార్థసారథి, బస్తిపాటి నాగరాజు, కురువలు పెద్దఎత్తున పట్టణ పురవీదులగుండా బైక్‌లపై ర్యాలీ నిర్వహించి సభాస్థలానికి చేరుకున్నారు. అక్కడ భక్త కనకదాసు చిత్రపటానికి పూజలు చేశారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎమ్మిగనూరు మార్కెట్‌ యార్డు పదవిని బీసీల్లో కురువలకు ఇస్తున్నట్లు తెలిపారు. వేడుకల్లో కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, డైరెక్టర్‌ రామకృష్ణ, జడ్పీ మాజీ చైర్మన్‌ బత్తిన వెంకటరాముడు, నాయకులు మద్దిలేటి, బీరప్ప, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Nov 25 , 2024 | 12:11 AM