Share News

తమ్ముళ్లలో జోష్‌

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:39 AM

తమ్ముళ్లలో జోష్‌

తమ్ముళ్లలో జోష్‌

టీడీపీ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపిన అధినేత

పత్తికొండ రా.. కదలిరా సభకు వెల్లువెత్తిన జనం

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సాగిన ప్రసంగం

ఉమ్మడి జిల్లాలో చంద్రబాబు సభ సక్సెస్‌పై చర్చ

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత పర్యటన తెలుగు తమ్ముళ్లలో జోష్‌ నింపింది. చంద్రబాబు ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఉర్రూతలూగించింది. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికలకు టీడీపీ శ్రేణులను సన్నద్ధం చేస్తూ మరో వైపు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆదివారం పత్తికొండలో నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ విధానాలను తూర్పారబట్టారు. అంచనాలకు మించి జనం తరలి రావడంతో రెట్టింపైన ఉత్సాహంతో చంద్రబాబు ప్రసంగించారు. మొత్తంగా పత్తికొండ రా కదలిరా బహిరంగ సభ సూపర్‌ సక్సెస్‌ కావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరిసింది.

నాడు బాదుడే బాదుడు.. నేడు ‘రా.. కదలిరా’

టీడీపీ అధినేత చంద్రబాడు 2022 నవంబరు 16,17,18వ తేదీల్లో పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో బాదుడే బాదుడు సభలు, రోడ్‌షోలలో పాల్గొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు వెళ్లే మార్గంలో పల్లెపల్లెనా జనం నీరాజనం పలికారు. సభలకు వెల్లువెత్తారు. పాణ్యం, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు నియోజకవర్గాల పరిధిలో 11 మండలాల్లో 32 గ్రామాలు, ఎమ్మిగనూరు, ఆదోని, పత్తికొండ మున్సిపాలిటీ పట్టణాల్లో చంద్రబాబు పర్యటన జరిగింది. ఆయా గ్రామాల్లో చంద్రబాబు రోడ్‌షో, బాదుడే బాదుడు సభకు 4-4.5 లక్షల మందికిపైగా ప్రజలు వచ్చి ఉంటారని నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఆ నివేదికను ప్రభుత్వానికి పంపారు. సరిగ్గా ఏడాది తరువాత చంద్రబాబు రా కదలిరా పిలుపుతో పత్తికొండకు వచ్చారు. ఇప్పుడు కూడా అదే రీతిలో జనం నీరాజనం పలికారు.

ప్రశ్నలు సందిస్తూ.. ఉత్తేజం నింపుతూ

పత్తికొండ రా కదలిరా సభ సక్సెస్‌ చేసేందుకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, వివిధ నియోజకర్గాల ఇన్‌చార్జిలు కేఈ శ్యాంబాబు, బీవీ జయనాగేశ్వరరెడ్డి, కోట్ల సుజాతమ్మ, కె.మీనాక్షినాయుడు, పి.తిక్కారెడ్డి, టీజీ భరత్‌, ఆకెపోగు ప్రభాకర్‌ పది రోజులుగా కష్టపడి పని చేశారు. పల్లెపల్లెకు వెళ్లి రా కదిలిరా సభకు తరలి రావాలని పిలుపునిచ్చారు. మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ సహా రాష్ట్ర నాయకులు ప్రభాకర్‌ చౌదరి, బీదా రవిచంద్రయాదవ్‌, భూమా అఖిలప్రియ, ఎన్‌ఎండీ ఫరూక్‌, గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి వంటి ముఖ్య నాయకులు సభా ఏర్పాట్లలో తాము సైతం అంటూ నిమగ్నమయ్యారు. పత్తికొండలో సభ ఏర్పాటు చేయడంతో ఆ నియోజకవర్గం ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు ప్రత్యేకంగా కష్టపడాల్సి వచ్చింది. నాయకుల సమష్టి కృషితో జనం వెల్లువలా తరలివచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయకుడు ప్రజలకు ప్రశ్నలు సందిస్తూ.. ఉత్తేజం నింపుతూ ప్రసంగం సాగించారు. భష్మారసుర జగన్‌ను ఓటుతో అంతం చేసేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. చివర్లో సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి.. అనే పాటకు టీడీపీ శ్రేణులు స్టెప్పులు వేయగా వారి జోష్‌ను చూసి చంద్రబాబు వారిని మరింత ఉత్సాహపరిచారు.

సభ సూపర్‌ సక్సెస్‌పై చర్చ

పత్తికొండ రా కదలిరా బహిరంగ సభ అనంతరం సోమవారం రాత్రి అధినేత చంద్రబాబు హెలిపాడ్‌కు సమీపంలో గోపాల్‌ ప్లాజా ఫంక్షన్‌ హాల్‌లో రాత్రి బస చేశారు. సభ ముగిసిన తరువాత మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ సహా నియోజకవర్గాల ఇన్‌చార్జిలు, రాష్ట్ర పార్టీ ముఖ్య నాయకులతో చంద్రబాబు చిట్‌చాట్‌ నిర్వహించారు. సభ సక్సెస్‌ చేసిన అందరిని ప్రత్యేకంగా అభినందించారు. ‘అదే క్రమంలో ఎన్నికలకు మిగిలిన సమయం 73 రోజులే.. ఇన్‌చార్జిలు, నాయకులు సంగ్రామానికి సిద్ధంగా ఉండాలి.. రాబోయే విజయం కోసం పని చేసిన ప్రతి నాయకుడు, కార్యకర్తల సేవలు గుర్తుంచుకుంటాను.. మన ప్రభుత్వంలో సరైన గుర్తింపు, సముచిత స్థానం ఉంటుంది. మీరు సిద్ధంగా ఉండండి’ అంటూ దిశానిర్దేశం చేశారు.

చంద్రబాబు బహిరంగ సభ విజయవంతం

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు : కేఈ, బీటీ

పత్తికొండ/తుగ్గలి, జనవరి 29: టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సభ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతాభివందనాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు, పత్తికొండ ఇన్‌చార్జి కేఈ శ్యాంబాబు అన్నారు. సోమవారం తుగ్గలి మండల కేంద్రంలోని తుగ్గలి నాగేంద్ర స్వగృహంలో వారు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి కంచుకోటగా ఉన్న పత్తికొండలో రా కదలిరా బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించాలని తలంచామని అన్నారు. ఇందుకు ఇన్‌చార్జిలు సుజాతమ్మ, తిక్కారెడ్డి, మీనాక్షినాయుడు, నాగేశ్వరరెడ్డి, ఆకెపోగు ప్రభాకర్‌, టీజీ భరత్‌ పూర్తి స్థాయిలో పని చేసి విజయవంతం చేశారని అన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా బహిరంగ సభ జరగడం ఆనందంగా ఉందన్నారు. తుగ్గలి నాగేంద్ర తిరిగి పార్టీలోకి రావడం శుభ పరిణామమని అన్నారు. కార్యక్రమంలో మనోహర్‌చౌదరి, సురేష్‌చౌదరి, ధనుంజయ, గురుస్వామిలతోపాటు పలువురు నాయకులు ఉన్నారు. తుగ్గలి నాగేంద్ర మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పని చేస్తానని అన్నారు. చివరి వరకు పార్టీ కోసమే పని చేస్తానని చెప్పారు.

Updated Date - Jan 30 , 2024 | 12:39 AM