Share News

జగనన్నా.. హైకోర్టు ఎక్కడన్నా..?

ABN , Publish Date - Jan 30 , 2024 | 12:36 AM

రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగనన్న కర్నూలుకు న్యాయ రాజధాని చేస్తానన్నాడు.

జగనన్నా.. హైకోర్టు ఎక్కడన్నా..?

హంద్రీనీవా పూర్తి చేయలేని అసమర్థుడు

నాసికరం మద్యంతో పెరిగిన మరణాలు

ప్రత్యేక హోదాపై బీజేపీని ప్రశ్నించే దమ్ముందా?

సీఎం జగన్‌పై వైఎస్‌ షర్మిల ఫైర్‌

ఉమ్మడి జిల్లా కార్యకర్తలతో సమావేశం

కర్నూలు, జనవరి 29 (ఆంధ్రజ్యోతి)/కర్నూలు అర్బన్‌: ‘రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన జగనన్న కర్నూలుకు న్యాయ రాజధాని చేస్తానన్నాడు. అస్సలు ఇక్కడ ఏర్పాటు చేస్తానన్న హైకోర్టు ఏమైంది జగనన్నా...’ అంటూ ఏపీసీసీ చీఫ్‌ షర్మిల సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ షర్మిల సోమవారం తొలిసారి కర్నూలు జిల్లాకు వచ్చారు. నగరంలోని తనిష్క్‌ ఫంక్షన్‌ హాల్‌లో కర్నూలు, నంద్యాల కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం ఆయా జిల్లాల డీసీసీ అధ్యక్షులు బాబురావు, జె.లక్ష్మినరసింహయాదవ్‌ అధ్యక్షతన జరిగింది. సీడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, కేవీపీ రామచంద్రరావు, వర్కింగ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌వలి ముఖ్య అతిథులుగా హాజర య్యారు. ఈ సందర్భంగా వైఎస్‌ షర్మిల మాట్లాడుతూ ఆనాటి రాజశేఖరరెడ్డి పాలనకు.. ఇప్పటి జగనన్న పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. జగనన్న పాలనలో రాష్ట్ర పరిస్థితి ఘోరంగా మారిందన్నారు. ఎక్కడికెళ్లినా సమస్యలే.. ఈ ప్రభుత్వంపై పోరాటాలు చేయకపోతే మనం బాగుపడే పరిస్థితి లేదన్నారు. జగన్‌ ప్రభుత్వంపై పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మతతత్వ బీజేపీకి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వ్యతిరేకి అయితే జగన్‌ బానిసగా మారాడని షర్మిల ధ్వజమెత్తారు.

నాసిరకం లిక్కర్‌ తాగొద్దు..

‘సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రత్యేక హోదా తేలేదు కానీ.. స్పెషల్‌ స్టేటస్‌ అంటూ నాసిరకం మందు తెచ్చి ప్రజల ప్రాణాలను హరిస్తున్నాడు. ఈ వైసీపీ పాలనలో ఇష్టం ఉన్నా లేకున్నా అమ్మిందే తాగాలి.. చెప్పిన ధరకే కొనుగోలు చేయాలి. డిజిటల్‌ చెల్లింపులు లేవు.. ఓన్లీ క్యాష్‌. దేశంలో ఇలాంటి పరిస్థితి ఏ రాష్ట్రంలోనైనా ఉందా? నాసిరకం మద్యం తాగడం వల్ల లివర్‌ చెడిపోయి ప్రాణాలు పోతున్నాయి. ఈ పాపం నీది కాదా జగనన్నా..’ అని షర్మిల ప్రశ్నించారు. ఇలాంటి నాసిరకం మందు తాగకండి అని మందుబాబులకు ఆమె పిలుపునిచ్చారు.

జగన్‌ ఓ అసమర్థుడు

రాయలసీమకు జీవనాడిగా ఉన్న హంద్రీనీవా పనులు పదిశాతం పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం ఆ పనులను కూడా పూర్తి చేయలేని అసమర్థుడు సీఎం జగన్‌ అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులకు పంటల బీమా కూడా ఇవ్వడం లేదన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారన్నారు. రాబోయే ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని, 73 రోజుల ఇంటింటికి వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి బీజేపీ బానిస పార్టీలను ఇంటికి పంపాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సుధాకర్‌బాబు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకులు దిలి్‌పదోకా, ఆదోని మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ దేవిశెట్టి, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు నీలకంఠప్ప, లక్ష్మినారాయణ రెడ్డి, విల్సన్‌, దామోదరం రాధాకృష్ణ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు బతుకన్న, ఎన్‌ఎ్‌సయూఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగమధుయాదవ్‌, కాంగ్రెస్‌ జిల్లా మహిళా అధ్యక్షురాలు ప్రమీల, సేవాదళ్‌ అధ్యక్షురాలు అనంతవెంకట సుజాత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 30 , 2024 | 12:36 AM