Share News

దివ్యాంగులపై చిన్నచూపు చూస్తున్న జగన్‌

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:28 AM

దివ్యాంగులపై చిన్నచూపు చూస్తున్న జగన్‌

దివ్యాంగులపై చిన్నచూపు చూస్తున్న జగన్‌

రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు

కర్నూలులో సింహగర్జన సభ

కర్నూలు(అర్బన్‌), ఫిబ్రవరి 29: విభిన్న ప్రతిభావంతుల పట్ల వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని దివ్యాంగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గోనుగుంట్ల కోటేశ్వరరావు ఆరోపించారు. గురువారం కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వికలాంగుల జేఏసీ ఆధ్వర్యంలో వికలాంగుల సింహగర్జన సభను నిర్వహించారు. జేఏసీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ అకాల మరణానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విభిన్న ప్రతిభావంతులపట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఏ రంగంలోనూ వికలాంగులకు న్యాయం చేయడంలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు పెంచిన రూ. 3 వేల పించన్‌ తప్ప ఈ ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేసిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఓట్లు వేయించుకోడానికి అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. దివ్యాంగుల పింఛన్‌ను రూ. 3 వేలు చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో చంద్రబాబు వికలాంగులకు మోటర్‌ బైకులు, వివాహ ప్రోత్సాహకాభివృద్ధికి రూ. లక్ష ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికైనా జగన్‌ ప్రభుత్వం కళ్లు తెరిచి విభిన్న ప్రతిభవంతుల పింఛన్‌ను రూ.3వేల నుంచి రూ.6వేలకు పెంచాలన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఇంటి స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, ఆర్థిక రుణాలు అందించాలని, బ్యాక్‌ లాగ్‌ పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. సంఘం దక్షిణాది రాష్ట్రాల నాయకుడు శ్రీనివాసులు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎల్లప్ప మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం అన్ని రకాలుగా దివ్యాంగులను మోసం చేసిందని అన్నారు. జేఏసీ అధ్యక్షుడు బీసీ నాగరాజు, కడప, అనంతపురం, గుంటూరు జిల్లాల నాయకులు దుర్గారావు, వీరారెడ్డి, శ్రీనివాసులు, జేఏసీ కోశాధికారి వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:28 AM