Share News

జగన్‌ నయవంచకుడు

ABN , Publish Date - Apr 17 , 2024 | 12:05 AM

జాబ్‌క్యాలెండర్‌ అని, సీపీఎస్‌ రద్దని, మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేసిన నయ వంచకుడు జగన్‌ అంటూ ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు.

జగన్‌ నయవంచకుడు

మళ్లీ అధికారంలోకి వస్తే ఊళ్లు, ఆస్తులు వదిలి వెళ్లాల్సిందే

విజనరీ చంద్రబాబు వల్లే నవ్యాంధ్ర ప్రగతి

వైసీపీని తరిమేసేందుకు ప్రజలు సిద్ధం కావాలి

ఎమ్మిగనూరు, కోసిగి రోడ్‌షోల్లో బాలకృష్ణ పిలుపు

కర్నూలు, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి)/ఎమ్మిగనూరు/కోసిగి: జాబ్‌క్యాలెండర్‌ అని, సీపీఎస్‌ రద్దని, మద్యపాన నిషేధమని ప్రజలను మోసం చేసిన నయ వంచకుడు జగన్‌ అంటూ ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ధ్వజమెత్తారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా మంగళవారం ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పర్యటించారు. జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం కర్నూలు నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించి అక్కడే బస చేశారు. మంగళవారం సాయంత్రం 4గంటలకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి, ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి, మంత్రాలయం టీడీపీ అభ్యర్థి మాధవరం ఎన్‌.రాఘవేంద్రరెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు, ఎంపీ డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌తో కలిసి రోడ్‌షో నిర్వహించారు. గోనెగండ్ల మండలం వేముగోడు, హెచ్‌.కైరవాడి, గోనెగండ్ల మీదుగా ఎమ్మిగనూరుకు చేరుకున్నారు. శివ సర్కిల్‌లో జరిగిన సభలో మాట్లాడారు. అక్కడి నుంచి పట్టణ వీధుల గుండా ముగతి, హాలహర్వి దాటి మంత్రాలయం నియోజకవర్గంలో అడుగుపెట్టారు. కళ్లుదేవకుంట, మంత్రాలయం, మాలపల్లి, మాధవరం మీదుగా కోసిగికి చేరుకున్నారు. రాత్రి కోసిగిలో జరిగిన సభలో బాలకృష్ణ మాట్లాడారు. ఏ పల్లెకు వెళ్లినా తమ అభిమాన నటుడు, తెలుగుదేశం నాయకుడు బాలకృష్ణ రాక కోసం గంటలు తరబడి యువకులు, మహిళలు, రైతులు ఎదురు చూశారు. బాలకృష్ణ రాగానే జై బాలయ్య అంటూ హోరెత్తించారు. జనసేన, బీజేపీ కార్యకర్తలు సైతం బాలకృష్ణ యాత్రలో పాల్గొన్నారు.

చేనేతలకు టెక్స్‌టైల్‌ పార్కు ఇస్తే రియల్‌ వ్యాపారమా..?

ఎమ్మిగనూరులో అత్యధికంగా ఉన్న చేనేతలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బనవాసి ఫారం వద్ద వంద ఎకరాల్లో గత టీడీపీ ప్రభుత్వం టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేసిందని అన్నారు. వైసీపీ వచ్చాక టెక్స్‌టైల్‌ పార్కు రద్దు చేసి ఆ భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోందని విమర్శించారు. రూ.1986 కోట్లతో ఆర్డీఎస్‌ ప్రాజెక్టును తెస్తే వైసీపీ ప్రభుత్వం ఆపేసిందని, ఎమ్మిగనూరుకు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని రూ.145 కోట్లతో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్‌ తెస్తే జగన్‌ ఆపేశారని పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుకా సౌమ్యురాలు.. పేదరాలు అంటూ జగన్‌ చెప్పారని, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.360 కోట్లు అప్పు తీసుకొని ఎగ్గొట్టిన బుట్టా రేణుకా పేదరాలు.. సౌమ్యురాలా అని ప్రశ్నించారు.

జగన్‌కు ఓటు వేస్తే దొంగచేతికి తాళం ఇచ్చినట్లే..

జగన్‌కు ఓటు వేస్తే దొంగ చేతికి తాళం ఇచ్చినట్లేనని బాలకృష్ణ అన్నారు. రాష్ట్రానికి పట్టిన శని జగన్‌ అని విమర్శించారు. సిద్ధం.. సిద్ధం అంటున్న జగన్‌ దేనికి సిద్ధమో చెప్పాలన్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ అపుల పాలు చేయడానికి సిద్ధమా..?దళితులు, మైనార్టీలపై దాడులు చేయడానికి సిద్ధమా..? ప్రజల ఆస్తులను అప్పుల కోసం తాకట్టుపెట్టేందుకు సిద్ధమా..? దేనికి సిద్ధం జగన్‌ అంటూ ప్రశ్నించాడు. ప్రజలు జగన్‌ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని దుయ్యబట్టారు. సంక్షేమానికి పునాది వేసిందే ఎన్టీఆర్‌ అని అన్నారు. విజనరీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక సంక్షేమంతోపాటు అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఐటీ విప్లవం తెచ్చిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అంటూ కీర్తించారు.

Updated Date - Apr 17 , 2024 | 12:05 AM