Share News

ఆరంభ శూరత్వం..!

ABN , Publish Date - Mar 18 , 2024 | 12:43 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో కోడ్‌ అమలులోకి వచ్చింది.

ఆరంభ శూరత్వం..!

టెండర్లు లేకుండానే శిలాఫలకాలు

ఎన్నికల వేళ వైసీపీ నాయకుల హడావుడి

అభివృద్ధి చేసేసినట్లు కలరింగ్‌

అంతా ఓట్ల కోసమేనని విమర్శలు

కర్నూలు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. దీంతో కోడ్‌ అమలులోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు వైసీపీ నాయకులు పడరానిపాట్లు పడ్డారు. అభివృద్ధి చేసేసినట్లు కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నాలూ చేశారు. సరిగ్గా షెడ్యూల్‌ విడుదలకు ముందు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో హడావుడి చేశారు. క్యాన్సర్‌ చికిత్సకు కీలకమైన లీనియర్‌ యాక్సిలలేటర్‌ యంత్రాలు సహా ఒక్క పరికరం, ఫర్నిచర్‌ లేకుండానే స్టేట్‌ క్యాన్సర్‌ యూనిట్‌ను ప్రారంభించారు. పరిపాలన అనుమతులు ఉన్నాయో లేదో..! అధికారులకే తెలియాలి. అలాగే నేషనల్‌ లా యూనివర్సిటీకి కూడా సీఎం జగనే శంకుస్థాపన చేశారు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రే ప్రజలను మభ్యపెట్టేలా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తుంటే.. వైసీపీ ప్రజాప్రతినిధులు తక్కువ తిన్నారా..! టీడీపీ ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన పనులకు వైసీపీ నాయకులు శంకుస్థాపనలు చేశారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి. ఐదేళ్లు అభివృద్ధిని పట్టించుకోని సీఎం జగన్‌, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చే ముందు అభివృద్ధి చేశామంటూ హడావుడి చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐదేళ్లు కళ్లు మూసుకున్నారా..?

కర్నూలు నగర జనాభా 6 లక్షలు దాటింది. విస్తరిస్తున్న కాలనీలు, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు అందించే పైపులైన్‌ వ్యవస్థతోపాటు నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. గాజులదిన్నె జలాశయం నుంచి పైపులైన్‌ కోసం రూ.350 కోట్లు, టిడ్కో ఇళ్లు సహా నంద్యాల, నందికొట్కూరు రోడ్డు వైపు విస్తరిస్తున్న వివిధ కాలనీలకు ముచ్చుమర్రి లిఫ్ట్‌ నుంచి తాగునీరు అందించేలా మరో రూ.500 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. డీపీఆర్‌ దశలోనే ఎన్నికలు వచ్చాయి. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా పట్టించుకోలేదు. మరో రెండు రోజుల్లో షెడ్యూల్‌ వస్తుందనగా గత వారం రూ.115 కోట్లతో సమగ్ర నీటి సరఫరా అభివద్ధి పథకం పేరిట సీఎం జగన్‌ శంకుస్థాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇదేనా చిత్తశుద్ధి..? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మురుగు నీటి శుద్ధి పనులు పూర్తి చేయకనే..!

నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో గత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో రూ.9 కోట్లతో హంద్రీ నదిపై దేవానగర్‌ వద్ద 2 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ, హంద్రీనది-తుంగభద్రలో కలిసే జోహరాపురం బ్రిడ్జి వద్ద 10 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్‌టీపీ) నిర్మాణం పనులు 2018లో చేపట్టారు. రాంబొట్ల దేవాలయం వద్ద మరో 35 ఎంఎల్‌డీ సామర్థ్యంతో మరో ఎస్‌టీపీ నిర్మాణానికి రూ.79 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అటకెక్కాయి. 2020లో మరోసారి వైసీపీ ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఏళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదు. తాజాగా.. రూ.131.85 కోట్లతో 35.6 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి కేంద్రం నిర్మాణం కోసం సీఎం జగన్‌ శిలాఫలకం ఆవిష్కరించారు. ఐదేళ్లు అసంపూర్తి పనులే పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు మళ్లీ శంకుస్థాపన చేయడం హాస్యాస్పదంగా ఉందని ప్రజలు పెదవి విరుస్తున్నారు. నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల పేరిట ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మేయర్‌ బీవై రామయ్యలు వైసీపీ సమన్వయకర్త (రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి) ఏఎండీ ఇంతియాజ్‌ అహ్మద్‌తో కలిసి భూమి పూజలు చేయడం చూసిన జనం ఐదేళ్లు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నిస్తున్నారు.

లా వర్సిటీకి టెండర్లు లేకుండానే..!

కర్నూలు నగర శివారున జగన్నాథగట్లుపై 150 ఎకరాల విస్తీర్ణంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (నేషనల్‌ లా యూనివర్సిటీ) నిర్మాణానికి సీఎం జగన్‌ శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రూ.1,011 కోట్లతో నిర్మిస్తున్నామని సీఎం జగన్‌ వెల్లడించారు. చిత్తశుద్ధితో చేపట్టి ఉంటే అభినందనీయమే. అయితే.. ఎన్నికల షెడ్యూలు వచ్చే సమయంలో గతవారం హడావుడిగా శంకుస్థాపన చేయడం విమర్శలకు తావిస్తోంది. నిధులు మంజూరు, పరిపాలన అనుమతులపై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. టెండర్ల ప్రక్రియ కూడా మొదలు కాలేదని సమచారం. అంటే.. కేవలం ఎన్నికల్లో ఓటర్లను మఽభ్యపెట్టేందుకే ఈ అత్యుత్సాహం అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

మళ్లీ.. మళ్లీ శంకుస్థాపన!

ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో రూ.19.50 కోట్లతో 14 గ్రామాల సమగ్ర (మల్టీ విలేజెస్‌) తాగునీటి సరఫరా పథకానికి ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి ఈ నెల 13న శంకుస్థాపన చేశారు. గత టీడీపీ ప్రభుత్వంలో మండలంలోని గాజులదిన్నె, పుట్టపాశం, కైరవాడి, పెద్దనెలటూరు, చిన్న నెలటూరు, ఎర్రబాడు, ఈరంపల్లి సహా 11 గ్రామాలకు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి తాగునీరు అందించే సమగ్ర తాగునీటి పథకానికి 2017 ఏప్రిల్‌లో ఆనాటి ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయా గ్రామాల్లో ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు కూడా నిర్మించారు. పైపులైన్‌ పనులు చేయాల్సి ఉండగా.. 2019లో వచ్చిన ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్రకోట ఐదేళ్లు పట్టించుకోలేదు. ఓహెచ్‌ఆర్‌ ట్యాంకులు అసంపూర్తిగా ఆగిపోయాయి. త్వరలోనే ఎన్నికలు రాబోతుండడంతో ఆయా గ్రామాల్లో ప్రజలు నిలదీస్తారనే భయం.. ఓటర్లను మభ్యపెట్టేందుకు వైసీపీ ఇన్‌చార్జి బుట్టా రేణుకతో కలిసి మళ్లీ శంకుస్థాపన చేసి అభాసుపాలయ్యారని స్థానికులు అంటున్నారు. పట్టణంలో కూడా షాడో ఎమ్మెల్యేలుగా వైసీపీ నాయకులు ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి, బుట్టా రేణుకలు కోడ్‌ అమల్లోకి రాకముందే సీసీ రోడ్లు, డ్రైనేజీలకు భూమి పూజ చేయడం హాస్యాస్పదంగా ఉందని స్థానికులు విమర్శిస్తున్నారు.

Updated Date - Mar 18 , 2024 | 12:43 AM