Share News

పెరిగిన ఉపాధి కూలి

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:24 AM

ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు దినసరి కూలి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

పెరిగిన ఉపాధి కూలి

ఏప్రిల్‌ 1 నుంచి అమలు

కొత్త సాఫ్ట్‌వేర్‌తో వేసవి భత్యానికి ఎసరు

కర్నూలు(అగ్రికల్చర్‌), మార్చి 25: ఉపాధి హామీ పథకం కింద పని చేస్తున్న కూలీలకు దినసరి కూలి పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు జాబ్‌కార్డులు కలిగి ఉన్న ఐదున్నర లక్షల మంది కూలీల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని అధికారులు అంటున్నారు. అయితే ఎంత పెరిగేదీ ఇంకా స్పష్టత ఇంకా రాలేదు. కేంద్ర ప్రభుత్వం 2005లో ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించింది. అప్పుడు దినసరి కూలీ రూ.87.50 ఉండగా.. ప్రస్తుతం రూ.272 చెల్లిస్తున్నారు. వేసవిలోని మార్చి, ఏప్రిల్‌, మే మూడు నెలల పాటు ఉపాధి పనులు చేసేందుకు గ్రామాల్లో వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కూలీలు ఉదయం, సాయంత్రం, రెండు పూటలా పనులు చేసుకోవడానికి అవకాశం ఉంది.

వేసవి భత్యానికి ఎసరు: గతంలో ఉపాధి కూలీలకు వేసవి భత్యం ఇచ్చేవారు. మార్చి నుంచి జూన్‌ వరకు 15 నుంచి 30 శాతం వేసవి భత్యాన్ని కూలీలు పొందేవారు. ఏప్రిల్‌, మే నెలల్లో 30 శాతం భత్యం దక్కేది. ఏపీ ప్రభుత్వం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అమలు చేసినప్పుడు వేసవి భత్యాన్ని క్రమం తప్పకుండా కూలీలకు అందించేవారు. కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట కొత్త సాఫ్ట్‌వేర్‌ను అమలులోకి తెచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్‌లో వేసవి భత్యానికి సంబంధించిన వివరాలు పొందుపరచకపోవడం వల్ల ఉపాధి పనులు చేస్తున్న కూలీల నోట్లో మట్టి పడింది. 2022లో రూ.12, 2023లో రూ.15 కూలీని పెంచుకుంటూ వచ్చారు. ఈ ఏడాది ఎంత పెంచుతారో స్పష్టం చేస్తూ ఇంకా ఉత్తర్వులు రాలేదు. ప్రస్తుతం పనులు చేసే ప్రదేశాల్లో ఎండవేడిమి తట్టుకోలేక కూలీలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. నీడ కోసం ఢేరాలు ఏర్పాటు చేయడంతో పాటు నీటి వసతి కూడా మూడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. టెంట్లు, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, తాగునీరు అందుబాటులో ఉంచాలని కూలీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మొర పెట్టుకుంటున్నారు.

వచ్చే నెల నుంచి వర్తింపు

గ్రామాల్లో ఉపాధి పనులు చేస్తున్న కూలీలకు కేంద్ర ప్రభుత్వం దినసరి కూలిని ఏప్రిల్‌ 1 నుంచి పెంచే అవకాశం ఉంది. ఎంత మొత్తం పెంచేదీ స్పష్టంగా ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న కారణంగా వివరాలు వెల్లడించలేదు. ఉత్తర్వులు వచ్చిన వెంటనే కూలీలకు అదనపు కూలి చెల్లిస్తాము. కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తే పని చేసే చోట వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటాం.

- అమర్నాథ్‌ రెడ్డి, డ్వామా పీడీ

Updated Date - Mar 26 , 2024 | 12:24 AM