Share News

తెరపైకి ఇంతియాజ్‌..!

ABN , Publish Date - Feb 29 , 2024 | 12:53 AM

వైసీపీ సీట్లాట రసవత్తరంగా మారింది.

తెరపైకి ఇంతియాజ్‌..!

కర్నూలు వైసీపీ టికెట్‌ రేసులో ఐఏఎస్‌ అధికారి

ఉద్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ

ఆగమేఘాలపై ఆమోదించిన ప్రభుత్వం

ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు ఆశాభంగం

మూణ్నాళ్ల ముచ్చటగా ఇలియాజ్‌ బాషా పేరు

కర్నూలు, ఫిబ్రవరి 28 (ఆంధ్రజ్యోతి): వైసీపీ సీట్లాట రసవత్తరంగా మారింది. నోటిఫికేషన్‌ ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ గెలవలేరని వైఎస్‌ జగన్‌ ఆయనకు టికెట్‌ నిరాకరించారు. ఆ స్థానంలో నీవే మా అభ్యర్థి అంటూ డాక్టర్‌ ఇలియాస్‌బాషాను తెరపైకి తెచ్చారు. ఆయన పేరు వారం రోజుల పాటు నియోజకవర్గ వ్యాప్తంగా చక్కర్లు కొట్టింది. ఈ క్రమంలో తాజాగా సెర్ఫ్‌, మైనార్టీ సంక్షేమ శాఖ సీఈఓ, సీసీఎల్‌ఏ కార్యదర్శిగా పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారి ఏఎండీ ఇంతియాజ్‌ అహ్మద్‌ పేరు తెరపైకి వచ్చింది. కర్నూలు వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్‌ ఖరారు చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. త్వరలో విడుదలయ్యే తొమ్మిదో జాబితాలో ఆయన పేరును ప్రకటించే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా కలెక్టరు, సెర్ఫ్‌, మైనార్టీ వెల్పేర్‌ సీఈఓగా పని చేసిన ఏఎండీ ఇంతియాజ్‌ వైసీపీలో గ్రూపు రాజకీయాలు, కుమ్మలాటలు తట్టుకొని రాజకీయాల్లో రాణిస్తారా? అన్నది ప్రశ్నార్థకమే.

హఫీజ్‌కు బుజ్జగింపు..

కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎంపికలో పలు మలుపు తిరుగుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ రాబోయే ఎన్నికల్లో గెలవలేరు అంటూ ఆ పార్టీ అధిష్ఠానం పక్కన పెట్టింది. ఈ నెల 22న తాడేపల్లి ప్యాలెస్‌కు హఫీజ్‌ఖాన్‌ను పిలిపించారు. టికెట్‌ ఇవ్వలేమని, భవిషత్తులో రాజకీయంగా మంచి అవకాశాలు ఉంటాయని బుజ్జగించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆర్థో విభాగం ప్రొఫెసర్‌గా పని చేస్తున్న డాక్టర్‌ ఇలియాస్‌బాషాకు టికెట్‌ ఇస్తామని, గెలుపించుకు రావాలని హఫీజ్‌ఖాన్‌కు సీఎం జగన్‌ సూచిస్తే.. సరే అన్నా! నా భవిషత్తు ఏమిటీ..? అని హఫీజ్‌ఖాన్‌ అడిగినట్లు సమాచారం. దీంతో జగన్‌ హఫీజ్‌ఖాన్‌ను నచ్చచెప్పి పంపించారు. ఇదిలా ఉండగా ఇంతియాజ్‌ను తెరపైకి తీసుకురావడంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు సమాచారం.

తెరపైకి ఇంతియాజ్‌!

ఎమ్మిగనూరు వైసీపీ అభ్యర్థిగా మాచాని వెంకటేశ్‌ను అధికారింగా ప్రకటించి.. ఆ వెంటనే మాజీ ఎంపీ బుట్టా రేణుకను ప్రటించారు. అదే ఫార్మలాను కర్నూలు అభ్యర్థి ఎంపికలోనూ అనుసరించారు. జగన్‌ ప్రభుత్వంలో కీలకమైన చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ), సెర్ఫ్‌ సీఈఓ, మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్‌ సెక్రెటరీ ఏఎండీ ఇంతియాజ్‌ అహ్మద్‌ (2009 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి)ను కర్నూలు వైసీపీ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆయన వాలంటరీ రిటైర్మెంట్‌ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాల మీద ఉద్యోగ విరమణ దరఖాస్తును ఆమోదించింది. ఆయన చేసిన దరఖాస్తును తక్షణమే ఆమోదిస్తున్నట్లు పేర్కొంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతియాజ్‌ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం మూడు నెలల ముందస్తు నోటీసు ఇవ్వాలన్న నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ఆర్టీ నంబర్‌ 477లో పొందుపరిచారు. ఈ మేరకు నాన్‌ కేడర్‌ ఐఏఎస్‌గా ఉన్న ఇంతియాజ్‌ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ దరఖాస్తును అనుమతిస్తూ జవహర్‌ రెడ్డి నోటిఫికేషన్‌ జారీ చేశారు.

ఇంతియాజ్‌ నేపథ్యం : ఏఎండీ ఇంతియాజ్‌ స్వగ్రామం కోడుమూరు. కర్నూలు నగరంలో ప్రముఖ కేఎం హాస్పిటల్‌ అధినేత దివంగత డాక్టర్‌ ఇస్మాయిల్‌కు ఆయన స్వయాన అల్లుడు. జిల్లాలో బంధువర్గం, పరిచయాలు ఉన్నప్పటికి.. 2009లో ఐఏఎస్‌గా ఎంపికయ్యాక ఉద్యోగ రీత్యా ఎక్కువ కాలం బయటనే ఉన్నాడు.

Updated Date - Feb 29 , 2024 | 10:07 AM