అక్రమంగా గోడలు కట్టేశారు..!
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:31 PM
సంపన్నుల నివాసం ఉండే ఇళ్ల మధ్యలో స్లమ్ ఏరియా ఉండకూడదని, వారు అటూ ఇటూ తిరగకూడదన్న ఉద్దేశంతో ఏకంగా ఓ వైసీపీ నాయకుడు అడ్డంగా వారం రోజుల క్రితం రాత్రికి రాత్రే గోడలు కట్టేశారు.

సీసీ రోడ్డును ధ్వసం చేసిన వైనం
ఆదోనిలో వైసీపీ నాయకుడి బరితెగింపు
సంపన్నుల నివాసం ఉండే ఇళ్ల మధ్యలో స్లమ్ ఏరియా ఉండకూడదని, వారు అటూ ఇటూ తిరగకూడదన్న ఉద్దేశంతో ఏకంగా ఓ వైసీపీ నాయకుడు అడ్డంగా వారం రోజుల క్రితం రాత్రికి రాత్రే గోడలు కట్టేశారు. దర్జాగా మున్సిపల్ ఓపెన్ స్థలంలో సుమారు రూ.20 లక్షలు వెచ్చించి కాలనీవాసుల రాకపోకల కోసం వేసిన సీసీ రహదారిని ఎక్స్‌కవేటర్ల సాయంతో తొలగించారు. ఈ ఘటన ఆదోని పట్టణంలోని మహత్మాగాంధీ నగర్ సమీపంలోని ఓ ఎస్టేట్‌లో వెలుగులోకి వచ్చింది.
ఆదోని, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఆదోని పట్టణ శివారు ప్రాంతంలోని రైల్వే లైన్ సమీపంలో మహత్మాగాంధీ నగర్ కాలనీ సమీపంలో ఓ ఎస్టేట్ వెలిసింది. వైసీపీకి చెందిన ఓ నాయకుడు ప్లాట్లు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. దాదాపు 60 సెంట్ల వరకు మున్సిపల్ ఓపెన్ సైట్‌గా ఉంచారు. వైసీపీ నాయకుడు వేసిన ప్లాట్ల స్థలం పక్కన స్లమ్ ఏరియా ఉండటంతో ఆయన ప్లాట్లకు ధర పడిపోతుందన్న నెపంతో ఓపెన్ సైట్‌లో ఆ ప్రాంతవాసులు రాకుండా అడ్డంగా ప్రహరీని నిర్మించేశాడు.
స్థలం విలువ పెంచుకోవడానికి..
మహత్మాగాంధీ నగర్‌లోని కాలనీవాసులు కూలీ పనులు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ప్రాంతంలో చాల మంది ఉద్యోగులు ఉన్నప్పటికీ మాస్ ఏరియా కిందనే గుర్తిస్తున్నారు. వైసీపీ నాయకుడు వేసిన ప్లాట్లకు ధర తగ్గుతుందన్న ఉద్దేశంతో ఇటు వైపు కాలనీవాసులు రాకపోకలు కొనసాగించకుండా ఉంటే తన ప్లాటుకు డిమాండ్ వస్తుందన్న దురద్దేశంతో నాలుగు చోట్ల వదిలిన రస్తాను మూసివేయించాడు.
రూ.20 లక్షల సీసీ రోడ్డు ధ్వంసం
కాలనీ పక్కన ఆహ్లాదకర వాతావరణం కోసం 60 సెంట్లకు పైగా పార్కు కోసం మున్సిపల్ ఓపెన్ సైటును వదిలారు. 2014లో టీడీపీ ప్రభుత్వంలో ఓపెన్ సైటు పక్కనే 100 అడుగులకు పైగా కాలనీవాసులు రాకపోకలకు సీసీ రహదారిని నిర్మించారు. పది సంవత్సరాల నుంచి కాలనీవాసులు ఆ రహదారి వెంట వెళ్తున్నారు. అయితే వారం రోజుల క్రితం రాత్రికి రాత్రే వైసీపీ నాయకుడు సీసీ రహదారిని ఎక్స్‌కావేటర్ల సహాయంతో ధ్వంసం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఈ విషయాన్ని కాలనీవాసులు అసిస్టెంట్ కమిషనర్ అనుపమ దృష్టికి తీసుకుపోవడంతో అసిస్టెంట్ కమిషనర్ నేరుగా కాలనీలో పర్యటించి ప్రహరీని పరిశీలించారు. దారికి అడ్డంగా నిర్మించిన ప్రహరిని తొలగించి రహదారి రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగించాలన్నారు. గోడను నిర్మించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. అధికారుల పర్యవేక్షణ తరువాత సీసీ రోడ్డును ధ్వంసం చేశారు.
అధికారం లేకున్నా అదే బరితెగింపు
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అంతో ఇంతో పనులు చేయించుకున్నారు. అధికారం కోల్పోయి 6నెలలు గడిచిన అదే బరితెగింపు కొనసాగిస్తూ ప్రజల్లో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే పార్థసారధి దృష్టి సారించి ప్రహరిని తొలగించడమే కాకుండా సీసీ రహదారిని ద్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుని సీసీ రహదారిని నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
కాలనీవాసులు వినతి పత్రం ఇచ్చారు
మూడు నెలల క్రితం ఇక్కడికి వచ్చాను. కాలనీవాసులు ఇటీవల వినతి పత్రం ఇచ్చారు. రికార్డులను పరిశీలించి విచారిస్తాం.
- కృష్ణ, మున్సిపల్ కమిషనర్